జగన్.. నీ డ్రామాలు ఆపు!
ABN , Publish Date - Apr 15 , 2024 | 03:09 AM
సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. శనివారం విజయవాడలో జరిగిన రాయిదాడి ఘటనను రాష్ట్రంపై జరిగిన దాడిగా, రాష్ట్రానికి జరిగిన గాయంగా వైసీపీ ప్రచారం చేస్తుండడాన్ని ఆయన తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. గులకరాయి
నీకు గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్టా?..
30 వేల మంది మహిళలు, యువతులు
అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా?.. నువ్వే రాయితో కొట్టుకున్నావేమో!..
నిన్ను ఎలా నమ్మాలి!
ఆనాడు చంద్రబాబుపై రాళ్ల వర్షం..
అప్పుడు కనీసం అయ్యో అనలేదే.. జగన్‌కు డబ్బు మదమెక్కింది
ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆదుకుంటాం.. ఆర్యవైశ్యులకూ అండ.. ఉద్యోగులకు 5లోపే వేతనాలు: పవన్
నీకు గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్టా: పవన్
సరిగ్గా ఎన్నికలు వచ్చేప్పటికే జగన్‌కు గాయం అవుతుంది. ఎవరో ఒకరు చనిపోతారు. నాన్నా పులి సామెతలా ఆయన నాటకాలాడుతుంటే నేనే కాదు.. జనం కూడా నమ్మటం లేదు.
సుగాలి ప్రీతికి దారుణం జరిగితే అప్పుడు వైసీపీ పెద్దలెవరూ బాధపడలేదు. రాష్ట్రంలో 30 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమైతే అప్పుడూ రాష్ట్రానికి గాయం కాలేదు.
ఉద్యోగులకు పింఛను అనేది పెద్ద కొడుకు లాంటిది. ఆ ఽభద్రతను మీకు కల్పిస్తాం. దీనిపై చంద్రబాబుతో మాట్లాడా. జగన్ మాదిరి నేను అబద్ధాలు చెప్పను. అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్‌పై సంవత్సరంలో పరిష్కారం చూపుతాం.
- పవన్ కల్యాణ్
తెనాలి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. శనివారం విజయవాడలో జరిగిన రాయిదాడి ఘటనను రాష్ట్రంపై జరిగిన దాడిగా, రాష్ట్రానికి జరిగిన గాయంగా వైసీపీ ప్రచారం చేస్తుండడాన్ని ఆయన తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. గులకరాయి ఘటనకే రాష్ర్ట్రానికి గాయం జరిగితే.. ఇప్పటి వరకు జరిగిన దారుణాలతో రాష్ట్రానికి గాయాలు కాలేదా? అని పవన్ నిలదీశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రాత్రి జరిగిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. ‘‘సీఎం జగన్ తలకు ఒక గులకరాయి తగిలి గాయమైందంట. అయ్యో ఎంత పాపం! ఆయనకు దెబ్బతగిలితే రాష్ట్రానికే గాయమైందంట. అయ్యయ్యో! ఎంత ఘోరం జరిగింది? అదే ఒక సామాన్య బీసీ కుటుంబంలో సోదరిని ఏడిపిస్తున్నారని ప్రశ్నించిన 15 ఏళ్ల అమర్‌నాథ్‌ను వైసీపీ గూండాలు పెట్రోలు పోసి నిప్పంటిస్తే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదట! రేపల్లె రైల్వే స్టేషన్‌లో భర్త ముందే మహిళపై మానభంగం చేస్తే.. అలా కావాలని చేయలేదట.. దొంగతనం కోసం వచ్చి పొరపాటున చేశారని ఓ మంత్రే చెబుతారు. అప్పుడు రాష్ట్రానికి గాయం కాదు. ఈయనకు గులకరాయి తగిలితే మాత్రం రాష్ట్రం మొత్తానికి గాయం అయిపోతుందట. ఇలా మాట్లాడడానికి వైసీపీ నేతలకు సిగ్గుండదా? బాబూ జగన్‌రెడ్డీ ఇక నీ సెంటిమెంట్ డ్రామాలు ఆపు. ఇన్ని నాటకాలు భరించలేకపోతున్నాం’’ అంటూ పవన్ మండిపడ్డారు. ఇంకా ఏమన్నారంటే..
దాడి నిజమేనా?
మా పార్టీ నాయకులు గులకరాయి దాడిని ఖండించాలని కోరారు. కానీ అది నిజం దాడో! ఆయనే కొట్టుకున్నాడో తెలియకుండా ఎట్లా ఖండిస్తాం. అయినా, అందరిపైనా దాడులు చేయించేవారిపై దాడిచేయటానికి ఎవరైనా ధైర్యం చేస్తారా? ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తున్నట్టు? నిజంగా దాడి జరిగితే చేసినవాడిని ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదు? ఆనాడు చంద్రబాబుపై ఏకంగా రాళ్ల వర్షమే కురిపించారు. అప్పుడు వైసీపీ నేతలు ఎందుకు బాధ వ్యక్తం చేయలేదు? నేను వచ్చినప్పుడు నాపైనా రాళ్లు పడుతుంటాయి. ఆయనకు మాత్రం చిన్న గాయం అయితే ఎంతో ఘోరం జరిగిపోయిందని బాధపడుతున్నాడు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు కనిపించవా? ఇద్దరు చెల్లెళ్లు బాబాయిని చంపేశారని గొంతు చించుకుంటుంటే ఒక్క పోలీస్ అఽధికారి మాట్లాడడు. సీబీఐ వస్తే కడప కోటలోకి వెళ్లనివ్వరు. ఇంత దారుణాలు జరుగుతుంటే మనకిపట్టదు. ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి చంపితే గుండెపోటంటారు. మనం మాత్రం చేతులు ముడుచుకు కూర్చుంటాం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవాడు ఒకడు మనందరినీ పొడుస్తా... చంపుతా అంటుంటే ఎంతకాలం భరిస్తాం. అందుకే వ్యతిరేక ఓటు చీలకూడదని నేను పొత్తు పెట్టుకున్నా.
ఏడుపు వస్తోంది?
నిజంగా నాకు ఆవేదన, ఏడుపు వస్తోంది. తప్పు జగన్‌ది కాదు. మనదే. ఆయన ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇసుక మొత్తం దోచేశారు. ఎందరో బీసీలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉపాధి ఉండేది. వారి పొట్టలు కొట్టి ఒక్కరికే దోచిపెట్టారు. మద్య నిషేధం అని చెప్పిన జగన్‌రెడ్డి సారా వ్యాపారిగా మారిపోయాడు. మీ కంపెనీలు మూయించి, దోచుకున్నది కక్కిస్తాం. జగన్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు. ఎస్సీ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశాడు. రూ.450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచేశాడు. 23 సంక్షేమ పథకాలను తీసేశాడు. రూ.4,123 కోట్లు మీకు చేరకుండా మళ్లించేశాడు. కోర్టు ఆ నిధులు వెంటనే ఇవ్వాలని ఆదేశించినా ఇవ్వలేదు. బీసీలను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేశాడు. 34 శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను 24 శాతానికి తగ్గించి ద్రోహం చేశాడు. ముస్లిం యువత కూడా జగన్ మోసాలను గుర్తించాలి. గురుబ్రహ్మ అని గౌరవించాల్సిన ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర పెట్టాడు. పోలీసు ఉద్యోగులు చాలా మంది తమ వేతనాలు, టీఏ, డీఏలు సరిగా రావటంలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీలోపు జీతాలు, టీఏ, డీఏలు పడేలా చూస్తామని మాటిస్తున్నా. వలంటీర్లలో చాలా ప్రతిభ ఉంది. మీలో ఒక అంబటి రాయుడు, ఒక క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి వంటివారు, ఎందరో అబ్దుల్ కలామ్‌లు దాగి ఉన్నారు. మీ జీవితాలను కేవలం రూ.5 వేలకు రేటుకట్టి జగన్ రెడ్డి తాకట్టు పెట్టుకున్నాడు. మీతో ఊడిగం చేయించుకుంటున్నాడు. మేమలా చేయం. మీలో దాగి ఉన్న శక్తిని వెలికితీస్తాం. మేం మీకు వ్యతిరేకం కాదు.
నీ జాగీర్ కాదు.. జగన్!
జగన్ ఏపీ నీ జాగీర్ అన్నట్టు వ్యవహరిస్తున్నావ్. నీ గుత్తాధిపత్యం ఇక సాగదు. మండలం రోజులే నీకు గడువు. కిందికి ఈడ్చుతాం. ఆర్యవైశ్యులపై దాడులు చేయిస్తున్నావ్. ఒక్క తెనాలిలోనే 15 మందిపై దాడులు జరిగాయి. వారికి తెనాలి సభ నుంచి చెబుతున్నా. మీరు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకోవచ్చు. మీపై దాడి చెయ్యాలని చూస్తే.. ఎస్సీ, ఎస్టీ చట్టం ఎంత బలంగా ఉందో అలాంటి చట్టాలను మీకు రక్షణగా ఇస్తాం. మహిళలపైనా దాడులు జరగకుండా కాపలా ఉంటాం.