Tirumala Lord Venkateswara: ఏడుకొండల స్వామికి కునుకు కరువు!
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:17 AM
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగడంతో శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏకాంత సమయం తగ్గుతోంది. అర్చకులు, పండితులు గర్భాలయంలో స్వామివారి ఏకాంత సేవ సమయాన్ని పెంచాలని టీటీడీ అధికారులను కోరుతున్నారు.

రోజుకు 23గంటలకు పైగా కొనసాగుతున్న దర్శనాలు
అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత నిమిషాల
వ్యవధిలోనేతెరుచుకుంటున్న
శ్రీవారి ఆనంద నిలయం తలుపులు
స్వామికి విశ్రాంతి సమయం పెంచాలి
టీటీడీకి అర్చక, పండిత బృందం సూచన
తిరుమల, మార్చి 28(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి రోజురోజుకూ కునుకు కరువవుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీతో స్వామి సేదతీరే సమయం తగ్గిపోతోంది. దీంతో స్వామివారి ఏకాంత సమయాన్ని పెంచాలని అర్చక , పండిత బృందం టీటీడీ అధికార యంత్రాంగానికి సూచనలు చేస్తోంది. రోజూ వేకువజామున సుప్రభాత సేవతో స్వామి నివేదనలు మొదలవుతాయి. ప్రస్తుతం వేకువజాము 2.30 గంటలకు మహద్వారం, వెండి వాకిలి, బంగారు వాకిలి తలుపులు తెరిచి 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తున్నారు. సాధారణంగా రాత్రి 12 గంటలలోపే ఏకాంత సేవ నిర్వహించాలి. అయితే గత పదేళ్లుగా ఈ సేవ నిర్వహణ సమయం అర్ధరాత్రి 1 నుంచి 2గంటల మధ్య సమయానికి మారిపోయింది. కొన్నేళ్లుగా రాత్రి 2.30 గంటలకు ఏకాంత సేవను నిర్వహించి, ఆలయం తలుపులు మూస్తున్నారు. ఒక్కోసారి 2.50 గంటలకు ఏకాంత సేవ పూర్తిచేసి, ఆ వెంటనే అంటే కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే తిరిగి ఆలయం తలుపులు తెరుచుకుంటున్నాయి. క్యూలైన్లు భారీగా ఉండి, కంపార్టుమెంట్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం చేయించాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా క్యూలైన్లు కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి.
రోజుకు 23 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇది సరికాదని, గర్భాలయంలోని మూలమూర్తికి కనీసం గంట నుంచి గంటన్నర సేపైనా ఏకాంతం కల్పించాలని కొందరు పండితులు ఆభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏకాంత సమయంలోనే దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిని ఆరాధిస్తారని, స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి పూజ చేస్తారని పురాణాల్లో ఉందని గుర్తుచేస్తున్నారు. దేవతల ఆగమన సమయంలో మానవ సంచారం ఉండరాదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శనాల సమయాన్ని కుదించి ఏకాంత సమయాన్ని పెంచాలని అర్చకులు, కొందరు పండితులు టీటీడీ అధికారులను కోరినట్లు తెలుస్తోంది.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..