YSRCP Leaders : బెదిరించి, భయపెట్టి కొట్టేశారు!
ABN , Publish Date - Dec 04 , 2024 | 03:33 AM
బెదిరించడం, భయపెట్టడం, వేధించడం... గత్యంతరంలేని పరిస్థితుల్లోకి నెట్టి భారీ ప్రాజెక్టులను కారుచౌకగా దక్కించుకోవడం! వైసీపీ జమానాలో జరిగిన తంతు ఇది! కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ కూడా ఇలాగే చేతులు మారినట్లు ఇప్పటికే బలమైన అనుమానాలున్నాయి.
కాకినాడ పోర్టు, సెజ్‌లను మా నుంచి లాక్కున్నారు
సీఐడీకి వాటి యజమాని కేవీరావు ఫిర్యాదు
నాడు కుట్రపూరితంగా ‘తనిఖీల’ నాటకం
రూ.994 కోట్లు ఎగ్గొట్టినట్లు తప్పుడు నివేదిక
వైవీ తనయుడు విక్రాంత్‌తో మాట్లాడాలని సాయిరెడ్డి ఫోన్.. వాటాలు వదులుకోకుంటే జైలుకే అన్న విక్రాంత్
పోర్టులో 2500 కోట్ల విలువైన మా వాటాకు 494 కోట్లు
సెజ్‌లో రూ.1104 కోట్ల షేర్లకు గాను రూ.12 కోట్లే
‘పెద్దమనసు’తో ఇచ్చేశామని జగన్‌కు విక్రాంత్ కబుర్లు
అన్యాయం గురించి చెబుతున్నా వినని నాటి సీఎం
విక్రాంత్‌రెడ్డి చెప్పినట్లు చేయాలని హుకుం
పది పేజీల ఫిర్యాదులో వివరించిన కేవీ రావు
విక్రాంత్, సాయిరెడ్డి, అరబిందోలపై కేసు నమోదు
అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): బెదిరించడం, భయపెట్టడం, వేధించడం... గత్యంతరంలేని పరిస్థితుల్లోకి నెట్టి భారీ ప్రాజెక్టులను కారుచౌకగా దక్కించుకోవడం! వైసీపీ జమానాలో జరిగిన తంతు ఇది! కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ కూడా ఇలాగే చేతులు మారినట్లు ఇప్పటికే బలమైన అనుమానాలున్నాయి. ఇప్పుడు... స్వయంగా బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) నోరు తెరిచారు. నాడు జరిగిన అన్యాయంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. భయపెట్టి, బెదిరించి మరీ తమ ఆస్తులు కొల్లగొట్టిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. పోర్టు, సెజ్ ‘అరబిందో’కు అప్పనంగా దక్కిన తీరు గురించి తెలిపారు. ‘‘2500 కోట్ల వాటాను 494కోట్లకు లాక్కున్నారు. సెజ్‌లో నా వాటా విలువ 1109కోట్లు! దానిని కేవలం 12కోట్ల రూపాయలకు లాగేసుకున్నారు. నిజాయితీగా వ్యాపారం చేశాం. ప్రభుత్వానికి రూపాయి ఎగ్గొట్టలేదు. అయినా... తీరని అన్యాయం చేశారు’’ అని సెజ్, పోర్టు ఏర్పాటు చేసిన ‘కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ యజమాని కేవీ రావు(65) సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. ఈ అన్యాయం ఏమిటని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకోగా... వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి చెప్పినట్లు చెయ్యమన్నారని, కనీసం తన మాట వినలేదని తెలిపారు.
కేవీ రావు 1999లో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకినాడ పోర్టును అభివృద్ధి చేశారు. జీఎంఆర్‌తో కలిసి కాకినాడ సెజ్‌ను స్థాపించారు. దీని కోసం ఆయన ‘కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశారు. తన కంపెనీ ఆదాయంలో 22శాతం ప్రభుత్వానికి చెల్లించేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా అంతా సాఫీగా సాగింది. ఆ తర్వాతే ఇబ్బందులు మొదలయ్యాయి. దీనిపై ఆయన సీఐడీ అధిపతికి పది పేజీల ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు.
ఇదీ కేవీరావు ఫిర్యాదు...
జగన్ సీఎం కాగానే... కాకినాడ సీ పోర్టు లిమిటెడ్‌కు రాష్ట్ర సర్కారుతో ఇక్కట్లు మొదలయ్యాయి. మారిటైమ్ బోర్డు సహకారం కరువైంది. చెన్నైకి చెందిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీతో ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. ముంబైకి చెందిన మరో సంస్థతోనూ ఆడిట్ అంటూ సమాచారం ఇచ్చారు. రెండు సంస్థలకూ మేం సహకరించాం. రికార్డులన్నీ వారి ముందుంచాం. కానీ... మా సంస్థ ప్రభుత్వానికి 994కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లు ఆడిట్ కంపెనీ వైసీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇదే సమయంలో... మాకు విజయసాయి రెడ్డి ఫోన్ చేశారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని కలవాలని సూచించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న విక్రాంత్ ఇంటికెళ్లి కలిసి మాట్లాడగా.. ‘‘మీరు ప్రభుత్వానికి వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు. మొత్తం కుటుంబం జైలుకు వెళ్లకూడదు అనుకుంటే మీ కంపెనీ షేర్లన్నీ విక్రయించేయండి’’ అని చెప్పారు. మేము 1999 నుంచి వ్యాపారం చేస్తున్నామని, ఎక్కడా రూపాయి కూడా ప్రభుత్వానికి ఎగ్గొట్టలేదని చెప్పగా... ‘‘ఇది నా మాట కాదు.
ముఖ్యమంత్రి జగన్ హుకుం. కాదని ధిక్కరిస్తే మీ కుటుంబం మొత్తం కటకటాల్లోకే’’ అని భయపెట్టారు. దిక్కుతోచని స్థితిలో భయంతో మా కంపెనీ షేర్లు విక్రయురచేందుకు అంగీకరించాం. అయితే షేర్ విలువ ఎంతో చెప్పలేదు. మర్చంట్ బ్యాంకర్‌ను ప్రవేశపెట్టి షేర్ విలువ నిర్ధారిస్తామన్నారు. రూ.100 కోట్లు అడ్వాన్సు కింద చెల్లిస్తున్నామని అగ్రిమెంట్‌పై సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత మమ్మల్ని పిలిచి, మీ వాటా కింద ఉన్న షేర్లలో 41.14శాతానికి 494కోట్ల రూపాయలు ఖరారు చేశామని, డీల్ సెట్ చేసుకోమని చెప్పారు. ఒక్క ఏడాది(2019-20)లోనే 170కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన తమ సంస్థ షేర్లకు ఇంత తక్కువ విలువకట్టడమేమిటని ప్రశ్నించినా వినిపించుకోలేదు. బెజవాడ బెంజ్ సర్కిల్‌లో స్థిరాస్తిని ప్రభుత్వ విలువకన్నా తక్కువకు లాక్కున్నారు.
కాకినాడ సెజ్‌లో ఇలా...
కాకినాడ సెజ్‌ను మేము, జీఎంఆర్ కలిపి 1999 నుంచి అభివృద్ధి చేశాం. అందులో 48.74శాతం మా కుటుంబ వాటా! మిగిలింది జీఎంఆర్ వాటా. మా వాటాలో 8వేల ఎకరాల భూమి, పోర్టులో షేర్ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు పడలేమంటూ ఆ మొత్తం భూమి, వాటాను రూ.400 కోట్లకు ఇచ్చేలా జీఎంఆర్‌కు ఇచ్చేయాలనుకున్నాం. నిజానికి... ఆ ఆస్తి విలువ రూ.1104 కోట్లు! అయినప్పటికీ... భాగస్వామికే (జీఎంఆర్) వదిలేయాలనుకుని అగ్రిమెంట్ చేసుకున్నాం.. కానీ, జీఎంఆర్‌తో ఒప్పందం రద్దుచేసుకుని అందంతా తమకే కట్టబెట్టాలని అరబిందో యాజమాన్యం బెదిరించింది. లేదంటే... జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించింది. కేవలం రూ.12 కోట్లు ఇచ్చి కాకినాడ సెజ్‌లో ఉన్న మా వాటా 48.74శాతాన్ని దక్కించుకున్నారు.
విక్రాంత్ చెప్పినట్లు వినండి...
వేలకోట్ల ఆస్తులను కొట్టేసిన అనంతరం... వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తాడేపల్లిలోని జగన్ ప్యాలె్‌సకు నన్ను (కేవీ రావు) తీసుకెళ్లారు. ‘కేవీ రావు పెద్దమనసుతో వేల కోట్ల వాటాను 12కోట్లకే మనకు ఇచ్చేశారు’ అని జగన్‌కు చెప్పారు. ‘ఇది చాలా అన్యాయం’ అని నేను చెప్పబోతుండగా... ‘విక్రాంత్ చెప్పినట్లు చెయ్యండి’ అంటూ జగన్ హుకుం జారీ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మొత్తం షేర్లు బదిలీ చేశాను. అంతకుముందు మేము ప్రభుత్వానికి రూ.994 కోట్లు ఎగ్గొట్టామని నివేదిక ఇచ్చిన శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ... ఆ తర్వాత పన్ను ఎగవేత తొమ్మిది కోట్లే అని తేల్చింది.
ఇవీ సెక్షన్లు..
ఐపీసీ 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్ విత్ 34ఐపీసీ, భారతీయ న్యాయ సంహితలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ బీఎన్‌ఎస్ 111