Share News

Buddha Venkanna: పేర్ని నాని తప్పు ఒప్పుకో.. బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:36 PM

Buddha Venkanna: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా నాని ఉన్నప్పుడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అసభ్యకరమైన సినిమా తీయడానికి నీతో చర్చ చేసింది వాస్తవమా కాదా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

Buddha Venkanna: పేర్ని నాని తప్పు ఒప్పుకో..  బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్
Buddha Venkanna

విజయవాడ: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆనాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడితే ... ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు అలా అనడం సరికాదని చెంపలు ఎందుకు వేసుకోవడం లేదని నిలదీశారు. చివరకు బ్రాహ్మణిని కూడా వదలకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీపై తాను విమర్శలు చేస్తే.. ఆయనకెందుకు అంత పౌరుషం వచ్చిందని బుద్దా వెంకన్న నిలదీశారు.

నాపై కేసులు పెట్టారు..

‘‘ఆరోజు నామీద పేర్ని నాని కేసులు పెట్టి.. నన్ను ఇబ్బందులు పెట్టాలని చూశాడు. నా దేవుడు చంద్రబాబు ఇంట్లో వాళ్లను తిట్టారు కాబట్టే నేను కూడా కౌంటర్ ఇచ్చాను. మరి నిన్ను అనకుండా.. నువ్వు ఎందుకు కేసు పెట్టావో చెప్పు పేర్ని నాని. అసభ్యంగా మాట్లాడినందుకు అరెస్టు చేయాలని ఫిర్యాదు చేస్తావా. మరి ఇప్పుడు నీ భార్య జయసుధ గురించి మేము ఒక్క మాట అయినా అంటున్నామా. చంద్రబాబు కూడా అంగీకరిచలేదని నువ్వే కదా చెప్పావు. కొడాలి నాని, గన్నవరం వల్లభనేని వంశీ కూడా నాపై కేసులు పెట్టారు’’ అని బుద్దా వెంకన్న దుయ్యబట్టారు.


రాంగోపాల్ వర్మతో సినిమాలు తీయించలేదా...

‘‘సినిమాటోగ్రఫీ మంత్రిగా నువ్వు ఉన్నప్పుడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై అసభ్యకరమైన సినిమా తీయడానికి నీతో చర్చ చేసింది వాస్తవమా కాదా..? అక్రమంగా ఉన్న డబ్బులు నువ్వు రాంగోపాల్ వర్మకు ఇచ్చి.. సినిమా తీయడానికి ప్రోత్సహించింది నువ్వు కాదా..? ఈరోజు జయసుధ దోషిగా నిలబడటానికి కారణం నువ్వు కాదా..? గోడౌన్లు ఆమె పేరుతో పెట్టి.. అందులో ఉన్న బియ్యం నువ్వు అమ్ముకున్నావు. అంటే నీ భార్యను నువ్వే కేసులో ఇరికించుకుని.. రాజకీయ కుట్ర అంటావేంటి. నీకు నిజంగా నీ భార్య మీద ప్రేమ ఉంటే.. ఇలాంటి అవినీతి పనులు చేసేవాడివి కాదు. ఏదైనా జరిగినా.. నేను సేఫ్, ఆమె జైలుకు పోతుందని పేర్ని నానికి ముందే తెలుసు. మా పార్టీ గుర్తుతో గెలిచిన వల్లభనేని వంశీ ఎంత ధైర్యవంతుడో ఇప్పుడు అందరూ చూశారు. మేము ఐదేళ్లు మీ అరాచకాలు అడ్డుకుని ప్రజల పక్షాన నిలిచాం. ఇప్పుడు ఓటమి చెందగానే వల్లభనేని వంశీ అడ్రెస్ లేకుండా పోయాడు’’ అని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.


అందులో నిజం ఉందా..

‘‘బూతులు తిట్టే కొడాలి నాని, వంశీలతో అంటకాగినప్పుడు నీకు తెలియదా పేర్ని నానీ. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్లను విమర్శించకూడదని నీకు తెలిసిందా. చంద్రబాబు తన సతీమణి పేరుతో కంపెనీలు పెట్టుకుని నడిపారు. నీలాగా ప్రజల బియ్యాన్ని అమ్ముకుని.. భార్యను జైలుకు పంపాలని అనుకోలేదు. నా భార్య ఆత్మహత్య చేసుకునేలా ఉందని అంటున్న నానీ.. అందుకు నువ్వు కారణం కాదా..? 7500 బస్తాల బియ్యం గోడౌన్‌లో మాయం అయితే... నువ్వే కదా నీ భార్య పేరు గోడౌన్‌కు పెట్టుకున్నావు. నిన్ను ఎందుకు అరెస్టు చేయకూడదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని నువ్వే కదా గతంలో గొప్పగా చెప్పావు. కొడాలి నాని, వంశీ వ్యాఖ్యలను అడ్డుకుని ఇంట్లో వాళ్ల మీద మాట్లాడవద్దని ఎందుకు చెప్పలేదు. మీలాంటి వారితో తిరగను అని పక్కకు ఎందుకు రాలేకపోయావు. జగన్ ఇంట్లో సమావేశాలు పెడితే.. ఇటీవల వారిద్దరినీ పక్కన పెట్టుకుని ప్రెస్‌మీట్‌లు పెట్టావుగా. అసలు నువ్వు చెప్పే దాంట్లో ఒక్కటి అయినా నిజం ఉందా..? రాంగోపాల్ వర్మ నిన్ను సంప్రదించాకే మా అధినేతను అవమానించేలా సినిమా తీసింది నిజం కాదా..? ఆ రోజే చంద్రబాబు, వాళ్ల ఇంట్లో వాళ్లపై సినిమా వద్దని ఎందుకు చెప్పలేకపోయావు. ఇప్పుడు నా భార్య, నా కొడుకు అంటున్న నానీ.. అందరికీ అదే పేగు బంధం ఉండదా..? పాదయాత్ర చేసిన నారా లోకేష్‌పై ఎన్నిసార్లు నోరు పారేసుకున్నావు. జయసుధను నమ్మించి సంతకాలు చేయించుకుని, ఈ కేసులో ఇరికించేలా చేశావు’’ అని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.


అలా చేయకు పేర్నినాని..

‘‘నేనే ఇదంతా ప్లాన్ ప్రకారం చేశాను అని పోలీసుల ముందుకు ఎందుకు రావడం లేదు. అంటే నీ భార్య జైలుకు వెళ్లినా ఫరవాలేదా.. నువ్వు మాత్రం తప్పించుకోవాలనా..? నీకు నీ భార్య మీద ప్రేమ ఉంటే.. పోలీసుల ముందు తప్పు ఒప్పుకో. నేను కొడాలి నాని, వంశీలను తిడితే.. నా మీద కేసు పెట్టాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది. ముందు నువ్వు నాకు సమాధానం చెప్పాలి.. వారిని వెంటేసుకున్నప్పుడు తెలియదా..? పేర్ని నాని ఇప్పటికైనా చేసిన తప్పులకు చెంపలు వేసుకుని క్షమాపణ కోరు. చంద్రబాబు వంటి వ్యక్తికి పాదాభివందనం చేసుకుని.. ఆధూళిని బొట్టు పెట్టుకున్నా.. నువ్వు చేసిన పాపం ఊరికే పోదు. పవన్ కల్యాణ్ కులం, నా కులం ఒకటే అని చాలా హేళనగా మాట్లాడిన చరిత్ర నీది. చంద్రబాబు, లోకేష్‌లు గురించి కూడా నీచంగా మాట్లాడిన చరిత్ర నీది. నాకు అధికారం శాశ్వతం అని విర్రవీగి అడ్డగోలుగా చేశారు. మొన్నటి వరకు అసభ్యంగా మాట్లాడిన పేర్ని నాని.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. మీ ప్రభుత్వం ఉంటే.. పులి లాగా మాట్లాడతారు.. ప్రభుత్వం లేదంటే.. నక్కలా నంగనాచి నాటకాలు ఆడతారు. 7500 బస్తాలు నేనే దొంగతనం చేశానని పోలీసులకు లొంగిపోయి.. నీ భార్యను కేసు నుంచి తప్పించు’’ అని బుద్దావెంకన్న హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Amaravati: జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్

Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం

JC Prabhakar Reddy: వీపు విమానంమోతమోగిస్తా.. మాజీ మంత్రికి జేసీ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 29 , 2024 | 05:53 PM