Bay of Bengal : వరుస అల్పపీడనాలు!
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:26 AM
బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఒకదాని వెనుక మరొకటి వెంటవెంటనే వస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు అల్పపీడనాలు/వాయుగుండాలు రాగా మూడోది ఐదు రోజుల నుంచి బంగాళాఖాతంలో ...
ఒకదాని వెనుక మరొకటి రాక
చురుగ్గా ఈశాన్య రుతుపవనాలు
దక్షిణ కోస్తా దిశగా తీవ్ర అల్పపీడనం
నేటి నుంచి 26 వరకు దక్షిణ కోస్తా, సీమకు వర్షాలు
ఓడరేవుల్లో మూడో నంబరు హెచ్చరిక
26 తర్వాత మరో అల్పపీడనం
విశాఖపట్నం, అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఒకదాని వెనుక మరొకటి వెంటవెంటనే వస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు అల్పపీడనాలు/వాయుగుండాలు రాగా మూడోది ఐదు రోజుల నుంచి బంగాళాఖాతంలో అటు తిరిగి ఇటు తిరిగి చెన్నై, శ్రీహరికోటలకు సమాంతరంగా సముద్రంలో కొనసాగుతోంది. దీని వెనుక మూడు, నాలుగు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనించి మంగళవారానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో అక్కడక్కడ వర్షాలు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈనెల 25, 26, 27 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వివరించింది. 25న ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు, 26న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా తీరంలో గంటకు 35 నుంచి 45, అప్పుడప్పుడు 55 కి.మీ.వేగంతో గాలులు వీస్తున్నందున బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
కోస్తాలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. కాగా, కొన్ని వాతావరణ మోడళ్ల మేరకు మంగళవారం నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. మరోవైపు ఈనెల 26వ తేదీ తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని భూమధ్యరేఖ పరిసరాల్లోని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశారు. ఇది వాయవ్యంగా పయనించి శ్రీలంక దిశగా వస్తుందని భావిస్తున్నారు.
అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం రానున్న రెండు, మూడు రోజులు కొనసాగి తరువాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని, ఈనెల 26వ తేదీ తర్వాత ఏర్పడనున్న అల్పపీడనం శ్రీలంక తీరం దిశగా పయనించినప్పుడు...దాంతో కలిసి బలపడి దక్షిణ తమిళనాడు వైపు వస్తుందని అంచనా వేశారు. ఆ ప్రభావంతో రానున్న ఐదారు రోజుల వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కొనసాగుతాయని వివరించారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నందున బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయన్నారు. కాగా, మంగళవారం కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.