NagarjunaSagar : కుప్పకూలిన సుంకిశాల గోడ
ABN , Publish Date - Aug 09 , 2024 | 03:25 AM
అది నాగార్జున సాగర్ జలాశయానికి ఆనుకుని నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు! నిత్యం ఒక్కో షిఫ్టులో అక్కడ వంద మంది పని చేస్తూ ఉంటారు!
ధ్వంసమైన రెండో టన్నెల్ గేటు
కూలిన ఇంటేక్ వెల్ రక్షణ గోడ
నాగార్జునసాగర్, హైదరాబాద్ సిటీ, ఆగస్టు 8: అది నాగార్జున సాగర్ జలాశయానికి ఆనుకుని నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు! నిత్యం ఒక్కో షిఫ్టులో అక్కడ వంద మంది పని చేస్తూ ఉంటారు! ఈనెల రెండో తేదీన రాత్రి షిఫ్టు చేసిన కార్మికులు ఉదయం ఆరింటికి బయటకు వెళ్లారు! పగలు డ్యూటీ కార్మికులు ఇంకా లోపలికి రాలేదు! ఆ సమయంలో భారీ శబ్ధం!
టన్నెల్ గేటు, ఇన్‌టేక్ వెల్ రక్షణ గోడ ఒక్కసారిగా కుప్పకూలాయి. కళ్లు మూసి తెరిచేలోగానే ఇన్‌టేక్ వెల్ (భారీ సంపు) నీట మునిగింది! ఆ సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది.
హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది.
సాగర్ జలాశయంలో నీటిమట్టం కనిష్ఠస్థాయికి దిగువన ఉన్నా.. జంటనగరాలకు తాగు నీటిని తరలించేందుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా నిర్మిస్తున్నారు.
2022 మే 14న శంకుస్థాపన చేశారు. తొలుత, రూ.1,450 కోట్లతో మేఘా ఇంజనీరింగ్ వర్క్స్ ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత అంచనా వ్యయం రూ.2,215 కోట్లకు పెంచారు. ప్రాజెక్టులో భాగంగా ఇన్‌టేక్ వెల్ (భారీ సంపు), మూడేసి పంప్ హౌజ్‌లు, టన్నెళ్లు, పంప్‌హౌజ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మిస్తారు. నాటి నుంచి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈనెల ఒకటో తేదీన 2వ నంబర్ పంప్‌హౌజ్‌లో రక్షణ గోడ ఒక్కసారిగా కూలిపోయింది.
మూడు స్థాయుల్లో పంప్‌హౌజ్‌లు
జలాశయం నుంచి ఇన్‌టేక్ వెల్‌కు నీటిని తరలించడానికి మూడు పంప్‌హౌజ్‌లు నిర్మిస్తున్నారు. వీటిలో మొదటిది, మూడోది పూర్తయ్యాయి. రెండో టన్నెల్, పంప్ హౌజ్ పనులు కొనసాగుతున్నాయి.