Share News

వైసీపీ నేతపై హత్యాయత్నం

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:41 PM

శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో వైసీపీ నాయకుడిపై హత్యాయత్నం ఘటన కలకలం రేపింది.

   వైసీపీ నేతపై హత్యాయత్నం
ఇందూరి ప్రతాప్‌రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌

సీతారామాంజనేయ ఆలయంలో కత్తులతో దాడి

శిరివెళ్ల మండలం గోవిందపల్లెలో ఘటన

గ్రామంలో పాత కక్షలతోనే హత్యాయత్నం

ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా

శిరివెళ్ల, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో వైసీపీ నాయకుడిపై హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఎనిమిదేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న గ్రామంలో హఠాత్తుగా చోటు చేసుకున్న ఘటనతో గోవిందపల్లె ఉలిక్కిపడింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు... గోవిందపల్లె గ్రామానికి చెందిన వైసీపీ మండల కన్వీనర్‌ ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై శనివారం ఉదయం హత్యాయత్నం జరిగింది. ప్రతి శనివారం లాగానే గ్రామంలోని సీతారామంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లిన ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై అదే గ్రామానికి చెందిన గంగదాసరి రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి మరోకరితో కలిసి ఆలయంలోకి ప్రవేశించి కత్తులతో దాడి చేశారు. ప్రతాప్‌రెడ్డి తలపై, మెడ మీద కత్తులతో తీవ్రంగా గాయపరిచారు. ఆలయంలో ఉన్న మరో వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రతాప్‌రెడ్డిని స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన వెంకట కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగదాసరి రవిచంద్రారెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు శిరివెళ్ల ఎస్‌ఐ చిన్న పీరయ్య తెలిపారు.

ఫ ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

గోవిందపల్లెలో ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన ఘటనాస్థలాన్ని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌ పరిశీలించారు. నిందితులు ఆలయంలోకి ప్రవేశించిన తీరు, హత్యాయత్నం, తదితర వివరాలను ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామానికి చెందిన గంగదాసరి రవిచంద్రారెడ్డి, మరో వ్యక్తి కలిసి ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై కత్తులతో దాడి చేసి ఇద్దరూ కలిసి బైక్‌పై పారిపోయారన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ప్రతాప్‌రెడ్డిపై దాడి జరిగినట్లు భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రతాప్‌రెడ్డి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. దాడి ఘటనను అన్ని కోణాల్లో విచారిస్తున్నామని నిందితులను పట్టుకునేందుకు టీంలను నియమించినట్లు ఎస్పీ వెల్లడించారు.

ఫ ఆలయం పక్కనే పోలీస్‌ పికెటింగ్‌

గోవిందపల్లె గ్రామంలో 2017 మే నెలలో జంట హత్యలు జరిగాయి. ఇందులో గంగుల వర్గానికి చెందిన మండల నాయకుడు ఇందూరి ప్రభాకర్‌రెడ్డి(మాజీ ఎంపీపీ) దారుణ హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి గ్రామంలో పోలీస్‌ పికెట్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హత్యాయత్నం జరిగిన ఇందూరి ప్రతాప్‌రెడ్డికి ఇందూరి ప్రభాకర్‌రెడ్డి స్వయాన సోదరుడు. ఎనిమిదేళ్లుగా గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అదే కుటుంబంలోని మరో వ్యక్తి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం జరగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో పోలీసు బలగాలు మోహరించాయి.

నంద్యాల జీజీహెచవద్ద ఉత్కంఠ

నంద్యాల హాస్పిటల్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత ఇందూరు ప్రతాపరెడ్డిపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. సమాచారం తెలుసుకున్న ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథరెడ్డి నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి తరలిరావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తవాతావరణం నెలకొంది. గంగుల నాని బాధితుడిని పరామర్శించిన అనంతరం పోలీసులు, వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనే దగ్గరుండి ఉదయానంద ఆస్పత్రికి తీసుకువెళ్లారు. దాడిజరిగిన వెంటనే బాధితుడి బంధువులు అంబులెన్సలో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పోలీసు బలగాలు ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. బాధితుడిని మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన పీపీనాగిరెడ్డి, వైసీపీ నాయకుడు మధుసూదనరెడ్డిలు పరామర్శించారు.

హత్యారాజకీయాలు సహించం : గంగుల నాని

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో హత్యారాజకీయాలను సహించేదిలేదు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటాం. మా ప్రాణాలమీదకువస్తే చూస్తూ ఊరుకోం. రౌడీషీటర్‌ ఆగడాలను అరికట్టలేకపోవడం దారుణం. మా వాళ్లకు ఏదైనా జరిగితే ప్రతీకార చర్యలకు వెనుకాడం. గతంలో గోవిందపల్లె గ్రామంలో బాధితుడి అన్న ఇందూరు ప్రభాకరరెడ్డి, బావ శ్రీనివాసరెడ్డిల హత్యకేసులో ప్రథమ సాక్షి ఇందూరు ప్రతాపరెడ్డిని హతమార్చేందుకు కుట్రపన్నారు. ఈ సంఘటనపై పోరాటం చేస్తాం.

Updated Date - Apr 05 , 2025 | 11:41 PM