Share News

ప్యాలెస్‌ కాదు.. వైసీపీ కార్యాలయం..!

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:30 AM

‘రాష్ట్రంలో అక్రమ భవనాలు ఉండడానికి వీల్లేదు. అలాంటి వాటిని మా ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజా వేదిక కూడా అలాంటిదే కాబట్టి కూల్చేస్తున్నాం’

ప్యాలెస్‌ కాదు.. వైసీపీ కార్యాలయం..!

ఆ పార్టీ విశాఖ నేతల బరితెగింపు

ఎండాడలో రెండెకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు

ఎకరా రూ.50 కోట్ల విలువైన భూమికి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున చెల్లింపు

33 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ ఉత్తర్వులు

దీనిపై అప్పట్లోనే వెల్లువెత్తిన విమర్శలు

జీవీఎంసీ అనుమతి లేకుండానే భవన నిర్మాణం

ప్రభుత్వం మారడంతో తాజాగా ప్లాన్‌ అనుమతికి దరఖాస్తు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘రాష్ట్రంలో అక్రమ భవనాలు ఉండడానికి వీల్లేదు. అలాంటి వాటిని మా ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజా వేదిక కూడా అలాంటిదే కాబట్టి కూల్చేస్తున్నాం’ అంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గొప్పలు చెప్పుకొన్నారు. ఆ హడావుడి అంతా ప్రజావేదిక కూల్చివేత వరకే.. ఆ తరువాత ఏ అనధికార నిర్మాణాన్నీ తొలగించింది లేదు. అంతేకాదు ఆయన పార్టీ కూడా అనుమతులు లేకుండా అనేక అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఈ జాబితాలో విశాఖ నగరంలో వైసీపీ కార్యాలయం కోసం చేపట్టిన భవనం కూడా ఉంది.

చేతిలో అధికారం ఉంది కదా అని వైసీపీ నేతలు విశాఖ ఐటీ సెజ్‌ సమీపంలో అత్యంత విలువైన రెండెకరాల భూమిని లీజు పేరుతో కారుచౌకగా దక్కించుకున్నారు. అందులో జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే ప్యాలె్‌సను తలదన్నేలా పార్టీ కార్యాలయం కోసం భారీ భవనం నిర్మించేశారు. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కావడంతో అధికారులు కూడా నోరెత్తే సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అక్రమ భవన నిర్మాణం అంశం ఎక్కడ తమ పీకకు చుట్టుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా 2022 మే 16న పీఎంపాలెం సమీపాన ఎన్‌వీపీ లా కాలేజీ నుంచి ఐటీ హిల్స్‌కు వెళ్లే రోడ్డును ఆనుకుని పనోరమ హిల్స్‌ సమీపంలో ఎండాడ సర్వే నంబర్‌ 175/4లో రెండెకరాల ప్రభుత్వ భూమిని పార్టీ కార్యాలయం నిర్మాణానికి కేటాయించుకున్నారు. ప్రస్తుతం అక్కడ భూమి ధర ఎకరా రూ.50 కోట్లు పైగా పలుకుతుంది. అంటే రెండు ఎకరాల భూమి విలువ రూ.వంద కోట్లు.

ఆ భూమిని ఏడాదికి (ఎకరాకు ఏడాదికి రూ.వెయ్యి) కేవలం రూ.రెండు వేలు చెల్లించేలా 33 ఏళ్లపాటు లీజుకు ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఐదేళ్ల లీజు మొత్తం (రూ.పది వేలు) ముందుగానే చెల్లించాలని, తర్వాత ప్రతి ఐదేళ్లకు లీజు మొత్తాన్ని పది శాతం చొప్పున మాత్రమే పెంచేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందిన భూమిని కారుచౌకగా అధికార పార్టీకి కట్టబెట్టడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. జీవీఎంసీ నుంచి అనుమతులు పొందాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్యాలె్‌సను తలపించేలా ఆ స్థలంలో భారీ భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉండగానే గత ఏడాది సెప్టెంబరు రెండో తేదీన పార్టీ కార్యాలయాన్ని హఠాత్తుగా ప్రారంభించేశారు. ఒకవైపు భవన నిర్మాణపనులు జరగుతుంటే మరోవైపు అక్కడే పార్టీ సమావేశాలు నిర్వహించేవారు. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ పార్టీ నేతలు, కార్యకర్తలతో కార్యాలయం కళకళలాడుతుండేది. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కార్యాలయం ముఖం చూసేవారు లేకపోవడంతో ప్రస్తుతం బోసిపోతోంది.


ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

ప్లాన్‌ అనుమతి లేకుండానే వైసీపీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తిచేసేయడంతో దీనిపై జీవీఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. భవన నిర్మాణానికి ముందే ప్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాన్‌ అప్రూవ్‌ అయిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించాలి. అలా కాకుండా ప్లాన్‌ జారీ కాకుండానే భవన నిర్మాణం చేపట్టినా, పూర్తిచేసినా సరే అక్రమ నిర్మాణంగానే పరిగణిస్తారు. తీసుకున్న ప్లాన్‌కు చిన్నపాటి ఉల్లంఘనలతోనిర్మాణాలు చేశారని ఆరోపిస్తూ అనేక భవనాలను కూలగొట్టేసిన జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు.. ఎలాంటి ప్లాన్‌ లేకుండానే నిర్మాణం పూర్తిచేసిన వైసీపీ భవనం విషయంలో ఎలా ముందుకువెళతారో చూడాలి.

ప్లాన్‌ లేకుండానే భవన నిర్మాణం

జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే వైసీపీ నేతలు పార్టీ కార్యాలయం కోసం ప్యాలెస్‌ మాదిరిగా భారీ భవంతిని నిర్మించేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం వైసీపీ నేతలు మీసాల వెంకట సుబ్రసాయిశరణ్‌ అనే లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌ ద్వారా ప్లాన్‌కు గత ఏడాది జనవరి 12న దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు కింద రూ.10 వేలు చెల్లించి వదిలేశారు. లీజు భూమిలో నిర్మాణం కావడంతో గ్రామ పంచాయతీ చార్జీల కింద రూ.4.44 లక్షలు, పర్మిట్‌ ఫీజు కింద రూ.10.44 లక్షలు, గ్రీన్‌ ఫీజు కింద రూ.33 వేలు, డీపీఎంఎస్‌ యూజర్‌ చార్జీలు కింద రూ.500, లేబర్‌ సెస్‌ చార్జీల కింద రూ.1.54 లక్షలు.. మొత్తం సుమారు రూ.17 లక్షలు జీవీఎంసీకి చెల్లించాలి. ఆ ఫీజులన్నింటినీ చెల్లించిన తర్వాత భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌, డ్రాయింగ్‌ను ఎల్‌టీపీ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు అన్నీ సరైనవేనని ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్‌ అయిన తర్వాత బిల్డింగ్‌ ప్లాన్‌ నంబర్‌ జనరేట్‌ అవుతుంది. తర్వాత ప్లాన్‌ అప్లికేషన్‌ సంబంధిత వార్డు సచివాలయంలోని వార్డు ప్లానింగ్‌ సెక్రటరీ పరిశీలనకు వెళుతుంది. ప్లానింగ్‌ సెక్రటరీ భవన నిర్మాణం ప్రతిపాదిత స్థలానికి వెళ్లి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్లలో ఉన్నట్టుగానే భూమి కొలతలు, రోడ్డు కనెక్టవిటీ ఉనదీ లేనిదీ పరిశీలిస్తారు. సక్రమంగా ఉన్నట్టు నిర్ధారిస్తే తనపై అధికారికి, అలా కమిషనర్‌ వరకూ అప్లికేషన్‌ వెళ్లి అక్కడ ప్లాన్‌ అప్రూవల్‌ జరుగుతుంది. కానీ వైసీపీ కార్యాలయం ప్లాన్‌ విషయానికి వస్తే కేవలం అప్లికేషన్‌ చార్జీల కింద గత ఏడాది జనవరి 12న రూ.పది వేలు చెల్లించి వదిలేశారు. అధికారంలో ఉన్నామనే ధీమాతో ఎలాంటి ప్లాన్‌ లేకుండానే అడ్డగోలుగా భవన నిర్మాణం పూర్తిచేసేశారు. అధికారం కోల్పోవడంతో ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనని భయంతో ఇప్పుడు ప్లాన్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం ఈ నెల 17న గ్రామ పంచాయతీ చార్జీలు కింద కట్టాల్సిన రూ.4.44 లక్షలు చెల్లించారు. మిగిలిన ఫీజులను మాత్రం ఇంకా చెల్లించకపోవడంతో ప్లాన్‌ అప్లికేషన్‌ ఇంకా ఎల్‌టీపీ లాగిన్‌ నుంచి జీవీఎంసీ లాగిన్‌కు చేరలేదు.

Updated Date - Jun 21 , 2024 | 03:30 AM