Share News

Polavaram: పోలవరం పనులు డిసెంబరు దాకా కష్టమే.. ఎందుకంటే..!?

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:09 AM

మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్లలో చేసిన విధ్వంసం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది. మొండిగా రివర్స్‌ టెండరింగ్‌ అమలుతో అంతులేని నష్టం జరిగింది.

Polavaram: పోలవరం పనులు డిసెంబరు దాకా కష్టమే.. ఎందుకంటే..!?

  • ఎన్నో హెడ్‌వర్క్స్‌ డిజైన్లకు అనుమతులు రావాలి

  • జూలై ఆఖరు నుంచి డిసెంబరు 31 వరకు పలు పనుల డిజైన్లకు ఆమోదం?

  • అయినా అంతర్జాతీయ నిపుణులు ఓకే అంటేనే ముందుకు!

  • వారెవరో గుర్తించినా ఇంతవరకు నియమించని కేంద్ర జలశక్తి శాఖ

  • ఈ నెలాఖరులోపు నియామక ఉత్తర్వులు!

  • జగన్‌ ‘రివర్స్‌’ దెబ్బకు ఇప్పటికే ప్రాజెక్టు కుదేలు

  • దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌

  • కాఫర్‌ డ్యాంలలో భారీగా సీపేజీ

  • కుంగిపోయిన గైడ్‌బండ్‌

  • వీటికి కారణమెవరో దర్యాప్తు చేయాల్సిందే!

  • సాగునీటి నిపుణుల డిమాండ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్లలో చేసిన విధ్వంసం పోలవరం (Polavaram) ప్రాజెక్టుకు శాపంగా మారింది. మొండిగా రివర్స్‌ టెండరింగ్‌ అమలుతో అంతులేని నష్టం జరిగింది. పైపెచ్చు.. బోడి గుండుకు.. మోకాలికి ముడివేసినట్లుగా.. కాఫర్‌ డ్యాంల ఎత్తును పెంచకపోవడం వల్లనే .. డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నదన్న మూర్ఖపు వాదనను తెరపైకి తెచ్చారు. 2019 నవంబరులోనే కొత్త కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించి ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మాణాన్ని చేపట్టి ఉంటే.. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేది. కానీ జగన్‌ చేసిన విధ్వంసం పోలవరానికి ఆర్థికంగా భారీ నష్టాన్ని చేకూర్చింది. ప్రధాన డ్యాంలోని కీలకమైన కట్టడాలు దెబ్బతినడంతో పునర్నిర్మాణానికి డిజైన్ల కోసం ఈ ఏడాది చివరిదాకా ఆగాల్సిన దుస్థితి నెలకొంది. పోలవరం ప్రధాన కట్టడాలు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ పునర్నిర్మాణ పనుల డిజైన్లను ఆమోదించడం కోసం అంతర్జాతీయ నిపుణులను కేంద్ర జలశక్తి శాఖ గుర్తించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. అయితే పీపీఏ వారికి ఇంకా నియామక ఉత్తర్వులను ఇవ్వలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఈ నిపుణులకు నియామక పత్రాలను ఈ నెలాఖరులోగా ఇచ్చే వీలుందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. వారిని నియమిస్తేనే పలు డిజైన్లకు ఆమోదముద్ర పడుతుంది.


Chandrababu-Polavaram.jpg

మరింత ఆలస్యం..

పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో స్టోన్‌ కాలమ్స్‌, వైబ్రో కాంపాక్టెడ్‌ ఫిల్స్‌, డీప్‌ సాయిల్‌ మిక్సింగ్‌, ఇతర ప్రత్యామ్నాయ పనుల డిజైన్లను వచ్చే నెలాఖరు నాటికి ఆమోదం తెలిపే వీలుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే.. అంతర్జాతీయ నిపుణులకు నియామక పత్రాలు ఇచ్చి.. వారు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి.. ఆయా పనుల తీరును సమీక్షించి.. డిజైన్లను పరిశీలించి ఆమోదిస్తారు. ఇందుకు చాలా సమయం పడుతుందని.. పనులు మరింత జాప్యమయ్యే వీలుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. పునాదుల పటిష్ఠత అధ్యయన నివేదిక కూడా వచ్చే నెలాఖరునాటికి రానుంది. డయాఫ్రం వాల్‌ డిజైన్లను సెప్టెంబరు నెలాఖరునాటికి ఆమోదించే వీలుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం సీపేజీ అధ్యయన నివేదిక అక్టోబరు పదో తేదీ నాటికి, ఈ డ్యాం స్థిరత్వ అధ్యయన నివేదిక అక్టోబరు 30న వస్తుందని.. డ్యాం లేఅవుట్‌ క్రాస్‌ సెక్షన్‌ డిజైన్‌ నవంబరు నెలాఖరునాటికి వస్తుందని అంచనా వేస్తున్నారు. డైనమిక్‌ అనాలసిస్‌, భూకంప తీవ్రతను తట్టుకునే సామర్థ్య అధ్యయన నివేదిక డిసెంబరు 31 నాటికి వస్తుందంటున్నారు. ఇలా ప్రధాన డ్యాంకు సంబంధించిన డిజైన్లన్నీ వచ్చేందుకు ఈ ఏడాదంతా ఆగాల్సిందే.

Chandrababu-Sachivalayam.jpg

వీటిని సదరు అంతర్జాతీయ నిపుణులు వచ్చి ఆమోదిస్తేనే అడుగు ముందుకు కదులుతుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టేసరికి ఇంకెంత సమయం పడుతుందో తెలియదు. ఇంకోవైపు. డయాఫ్రం వాల్‌ను సమాంతరంగా నిర్మించాలని నిర్ణయించారు. దీనికి కాంట్రాక్టు సంస్థ డిజైన్లను రూపొందించింది. వీటిని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆమోదించాలి. కాఫర్‌ డ్యాంలు నిర్మించి ఐదేళ్లు పూర్తయినందున.. కట్టడాలు శిథిలావస్థకు వచ్చాయి. కాఫర్‌ డ్యాంల నుంచి సీపేజీ తీవ్ర స్థాయిలో ఉంది. దాని నివారణ చర్యలు చేపట్టేందుకు జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ అవసరం. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌, కాఫర్‌ డ్యాంల నిర్మాణాలు దెబ్బతినడానికి, గైడ్‌బండ్‌ కుంగిపోవడానికి కారణాలపై చంద్రబాబు ప్రభుత్వం అధ్యయనం చేపట్టాలన్న డిమాండ్‌ వస్తోంది. సవ్యంగా నిర్మాణ పనులు సాగుతున్న తరుణంలో అర్ధాంతరంగా నిర్మాణ సంస్థను తొలగించి.. రివర్స్‌ టెండర్‌ పేరిట కొత్త సంస్థకు పనులు అప్పగించడంపైనా దర్యాప్తు చేయాలని నిపుణులు కోరుతున్నారు.

Updated Date - Jun 14 , 2024 | 09:29 AM