Madanapalle Incident: గత ఐదేళ్లలో ఏదో జరిగింది!
ABN , Publish Date - Aug 06 , 2024 | 02:35 AM
ప్రభుత్వానికి ప్రజల నుంచే వచ్చే అర్జీల్లో గతంలో కేవలం 10 శాతం మాత్రమే భూవివాదాలకు సంబంధించి ఉండేవని, ఇప్పుడు అనూహ్యంగా 50 శాతానికి పైగా పెరిగాయంటే గత ఐదేళ్లలో ఏదో జరిగిందని రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అనుమానం వ్యక్తంచేశారు.
భూవివాదాలు 10 శాతం నుంచి
50 శాతానికి పెరిగాయి
కబ్జాలు, దౌర్జన్యాల ఫిర్యాదులే ఎక్కువ
వీటి పరిష్కారమే కలెక్టర్ల ప్రథమ కర్తవ్యం
9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ రికార్డుల
పునఃపరిశీలన: సిసోడియా
అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి ప్రజల నుంచే వచ్చే అర్జీల్లో గతంలో కేవలం 10 శాతం మాత్రమే భూవివాదాలకు సంబంధించి ఉండేవని, ఇప్పుడు అనూహ్యంగా 50 శాతానికి పైగా పెరిగాయంటే గత ఐదేళ్లలో ఏదో జరిగిందని రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అనుమానం వ్యక్తంచేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అందుతున్న భూవివాదాల అర్జీల పరిష్కారానికి కలెక్టర్లందరూ మొదటి ప్రాధాన్యమివ్వాలని కోరారు. గత ఐదేళ్లలో తమ భూమిని కబ్జా చేశారని, దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారనే ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని.. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో భూ వివాద సంబంధిత ఫిర్యాదులు, అర్జీలు వచ్చేవి కావని.. గత ఐదేళ్లలో ఏదో తప్పు జరిగిందనే అభిప్రాయం ఇది కలిగిస్తోందని, ఇప్పుడీ ఫిర్యాదులన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. చాలా చోట్ల అసైన్డ్ భూములు, ఇనామ్ భూముల విషయంలో అక్రమాలు జరిగాయని, చాలా చోట్ల ‘డి’ పట్టాలను కూడా గిఫ్ట్‌గా ఇచ్చేశారని, వాటన్నింటిపైనా విచారణ జరిపి రికార్డులను పునఃపరిశీలించాలన్నారు. రాష్ట్రంలో అసైన్డ్ చట్ట సవరణ అనంతరం ఫ్రీహోల్డ్ చే సిన 9 లక్షల ఎకరాల భూముల రికార్డులను పునఃపరిశీలిస్తామని ప్రకటించారు. ఇందుకు డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసి వారితో రికార్డులను పరిశీలన చేయిస్తామన్నారు. అసైన్డ్ భూముల ప్రీహోల్డ్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటి నివృతికే మళ్లీ పరిశీలన చేయబోతున్నామని తెలిపారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ప్రజలకు దూరమయ్యారని, ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. తాను మదనపల్లె వెళ్లినప్పుడు ప్రజలు కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చేందుకు విముఖత చూపారని, ప్రతి జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు.
తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో భూవివాదాలు ఎక్కువగా ఉన్నాయని, ఫ్రీహోల్డ్(యాజమాన్య హక్కులు) కల్పించిన భూముల రిజిస్ట్రేషన్లు (గిప్ట్, సేల్) ఎక్కువగా జరిగాయని, నిషేధిత జాబితా (22ఏ) నుంచి అసైన్డ్, చుక్కలు, ఇనాం సర్వీసు, షరతుల గల పట్టాలు తొలగించిన భూముల రిజిస్ట్రేషన్లపై పునఃపరిశీలన చేయాలని ఆదేశించారు. ముందుగా ఈ జిల్లాల్లో ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని అక్కడి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదులను పరిష్కరించాలని, నెల రోజుల్లోపు ఇది పూర్తి కావాలని స్పష్టంచేశారు. తర్వాత జోన్లవారీగా అమలు చేయాలన్నారు. భూములు కోల్పోయిన పేదల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల మధ్య సమన్వయం తప్పనిసరని.. భూవివాదాల పరిష్కారం, ఫైళ్ల పరిరక్షణ చాలా ముఖ్యమని తెలిపారు. కలెక్టర్లపై ఎంతో నమ్మకంతో ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వస్తారని, వాటి పరిష్కారమే ప్రథమ కర్తవ్యంగా వారు పనిచేయాలని కోరారు. ఉదాశీనత ప్రదర్శిస్తే ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. ‘మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతా వైఫల్యాలను తెలియజేసింది. అక్కడ 56 సంవత్సరాల వీఆర్‌ఏను రాత్రిపూట కాపలా ఉంచారు. సీసీ కెమేరాలు కూడా పనిచేయలేదు. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని చెప్పారు. భూముల కన్వర్షన్‌లో కలెక్టర్లు నిబంధనలు అమలు చేయాలన్నారు. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.