Share News

TDP-Janasena: జయం మనదే!

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:26 AM

TDP-JSP: ‘టీడీపీ-జనసేన పొత్తు గెలవాలి. రాష్ట్రం వెలగాలి. పేదల జీవితాలు పండాలి. తెలుగుదేశం, జనసేన పార్టీల ఐక్యత విజయ శిఖరంలా నిలబడాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటన

TDP-Janasena: జయం మనదే!

  • మాది విన్నింగ్‌ టీమ్‌.. వైసీపీది చీటింగ్‌ టీమ్‌

  • ప్రజలారా ఆశీర్వదించండి.. వైసీపీని సాగనంపండి.. ‘జెండా’ సభలో బాబు, పవన్‌ పిలుపు

  • టీడీపీ-జనసేన పొత్తు గెలవాలి.. రాష్ట్రం వెలగాలి

  • టీడీపీ అగ్నికి జనసేన తోడైంది.. ఇక అన్‌స్టాపబుల్‌

  • ఈ కలయిక మా కోసం కాదు.. రాష్ట్రం కోసం

  • బాదుడులేని అభివృద్ధి.. కోతలు లేని సంక్షేమం

  • ఐక్యత చెడగొట్టాలనుకునేవారి కుట్రలు తిప్పికొట్టండి

  • కష్టపడిన నేతలకు, కార్యకర్తలకు న్యాయం చేస్తాం

  • పులివెందులలోనూ జగన్‌ను ఓడిస్తాం

  • ‘హూ కిల్డ్‌ బాబాయ్‌’కి దమ్ముంటే జవాబు చెప్పాలి

  • ఎదుగుతున్న చెట్టులాంటి ఏపీపై జగన్‌ గొడ్డలి వేటు

  • ఇలాంటి సైకోను భరించడం అవసరమా?: బాబు

కుట్రలు, కుతంత్రాల వైసీపీ అట్టర్‌ ఫ్లాప్‌ కాబోతోంది. మాది విన్నింగ్‌ టీం. వైసీపీది చీటింగ్‌ టీం. ప్రశాంత రాష్ట్రంలో జగన్‌ విద్వేషాగ్ని రాజేశాడు. అదే అగ్ని ఇప్పుడు వైసీపీని దహించబోతోంది. అగ్నికి వాయువు తోడైనట్లు టీడీపీకి జనసేన తోడైంది. ఇక వైసీపీ బుగ్గి అవుతుంది.

- చంద్రబాబు

జనసేనకు 24 స్థానాలేనా అంటున్నారు. వాళ్లకు తెలియనిదేమిటంటే.. వామనుడిని చూసి బలి చక్రవర్తి కూడా ‘ఇంతేనా’ అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతున్నప్పుడే తెలిసింది.. ఇంత కాదు, అది ఎంతో అని! జనసేన కూడా అంతే! జగన్‌ను అథఃపాతాళానికి తొక్కేస్తాం!

- పవన్‌

  • ప్రజల ఆశీర్వాదం కోసమే ఈ ఉమ్మడి సభ

  • ‘తెలుగు-జన విజయకేతనం’ సభలో చంద్రబాబు ఉద్ఘాటన

అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ-జనసేన (TDP-Janasena) పొత్తు గెలవాలి. రాష్ట్రం వెలగాలి. పేదల జీవితాలు పండాలి. తెలుగుదేశం, జనసేన పార్టీల ఐక్యత విజయ శిఖరంలా నిలబడాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం... బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహించిన ‘తెలుగు జన విజయకేతనం - జెండా’ సభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యాంశాలు చంద్రబాబు మాటల్లోనే...

‘‘రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న ఈ మొదటి సభ రాష్ట్రం దశ, దిశ మార్చబోతోంది. తాడేపల్లిగూడెం సభ తాడేపల్లి ప్యాలె్‌సను కంపింపచేస్తోంది. ఈ సభ ఒక శుభ సూచకం. రాష్ట్రానికి నవోదయం. రెండు పార్టీలు కలిసింది మా కోసం... మా అధికారం కోసం కాదు. ఈ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును బాగు చేయడం కోసం! ఒక సైకో చేతిలో నాశనమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి... యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి... రైతాంగానికి అండగా నిలవడానికి... పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికే ఈ పొత్తు. ఒక వ్యక్తి తన అహంతోనో... తన జేబులు నింపుకోవడానికో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే నేనూ పవన్‌ కల్యాణ్‌ చూస్తూ ఊరుకోలేం. మాది ప్రజలు కోరుకొన్న పొత్తు. ప్రజలు కుదిర్చిన పొత్తు. రాష్ట్రానికి వెలుగు నింపే పొత్తు. మా ఇద్దరికీ ఏ భేషజాలు లేవు. ఈ రాష్ట్రాన్ని విధ్వంస పాలన నుంచి కాపాడటానికి మేం ఏ త్యాగాలకైనా సిద్ధం. ఈ పొత్తు సూపర్‌ హిట్‌ అని ఈ సభతోనే తేలిపోయింది. ప్రజల ఆశీర్వాదం కోసమే ఈ సభ!

కుట్రలు తిప్పి కొట్టండి..

టీడీపీ, జనసేన పార్టీల పొత్తును చూడలేని శక్తులు ఈ ఐక్యతను భగ్నం చేయడానికి అనేక కుట్రలు చేస్తాయి. వాటిలో పడవద్దు. రెండు పార్టీల్లో బాగా పనిచేసిన వారు అనేక మంది ఉన్నారు. అందరికీ ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేం. కానీ.. బాగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యతను మేం ఇద్దరం తీసుకుంటాం. రెండు పార్టీల్లో ఎవరూ అహానికి పోవద్దు. ఇద్దరిలో ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు. రెండు పార్టీలు కలిసి అడుగు వేయాలి. పొత్తు ధర్మాన్ని అందరూ అర్ధం చేసుకోవాలి. ప్రజల జీవితాలను ఛిద్రం చేసిన వారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సమష్టిగా పనిచేయాలి!

‘సైకో’ అంటున్నది ఇందుకే..

దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా సైకో అని పిలుస్తున్నారా? రూ.5కు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూ సి వేయించాడు. ప్రజా వేదిక కూల్చివేతతో తన పాలన మొద లు పెట్టాడు. మాస్క్‌ అడిగిన డాక్టర్‌ సుధాకర్‌ చావు కళ్లచూశారు. తూర్పు గోదావరిలో దళితుడిని చంపి శవాన్ని ఇంటికి డోర్‌ డెలివరీ చేశారు. రాజధాని అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం, విట్‌ యూనివర్సిటీలు పెడితే వాటిపై కక్షగట్టి రోడ్లు వేయకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. రాష్ట్ర క్రికెట్‌ టీం కెప్టెన్‌ హనుమ విహారి వైసీపీ టెర్రరిస్టుల వేధింపులు భరించలేక రాష్ట్రం వదిలి పారిపోయాడు. సొంత చెల్లిని, తల్లిని కూడా సామాజిక మాధ్యమాల్లో చండాలంగా తిట్టిస్తున్నాడు. ఇప్పటం గ్రామంలో జనసేన సభకు భూమి ఇచ్చారని వాళ్ల ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూలగొట్టించాడు. సినిమా టికెట్ల వివాదం తీసుకువచ్చి చిరంజీవి, రాజమౌళి వంటి వారిని కూ డా అవమానించాడు. ఆయన చర్యలను తప్పుబట్టిన పవన్‌ ఈ రాష్ట్రానికి విమానంలో రావడానికి వీల్లేదని అడ్డుపడ్డాడు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టి తర్వాత పిడి గుద్దులు గుద్దడం జగన్‌ నైజం. ఈ సైకోను భరించడం అవసరమా?

నాడు పడిన కష్టాన్ని..

అశాస్త్రీయ విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి గత ప్రభుత్వ హయాంలో అహర్నిశలూ శ్రమించాం. హైదరాబాద్‌ను మించిన రాజధానిని నిర్మించాలని అమరావతి తలపెట్టాం. రాష్ట్రంలో ప్రతి చేనుకూ నీరివ్వాలని పోలవరం పరుగులు పెట్టించాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఐఐటీ, ఐఐఎం సహా పదకొండు కేంద్ర విద్యా సంస్థలు తెచ్చాం. పదహారు లక్షల కోట్లు పెట్టుబడులు, పది లక్షల ఉద్యోగాలు తెచ్చాం. ఎదుగుతున్న చెట్టును ఒక గొడ్డలి వేటుతో నరికినట్లు జగన్‌ నరికేశాడు. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న తపన, పట్టుదల మాకున్నాయి. మేం వస్తే ఏం చేయాలో ఒక బ్లూ ప్రింట్‌తో సిద్ధంగా ఉన్నాం. కొద్ది రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రజల ముందు ఉంచుతాం. మన అభ్యర్థులను ఎంపిక చేసే ముందు రాష్ట్రవ్యాప్తంగా కోటీ ముప్ఫై లక్షల మంది అభిప్రాయాలు సేకరించాం. ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. మన అభ్యర్థులను చూసి జగన్‌ భయపడుతున్నాడు. విజయ సాధనకు కసితో పనిచేయాలి!

వై నాట్‌ పులివెందుల?

‘వై నాట్‌ 175’ అని జగన్‌ అంటుంటే ‘వై నాట్‌ పులి వెందుల’ అని మేం ప్రశ్నిస్తున్నాం. ఏం పీకావని 175 సీట్లు నీకు ఇవ్వాలి? వై నాట్‌ జాబ్‌ క్యాలెండర్‌? వై నాట్‌ డీఎస్సీ? వైనాట్‌ ఉచిత ఇసుక? వీటి గురించి ఎందుకు మాట్లాడవు? ఈసారి పులివెందులలో కూడా ఓడిస్తాం. తాడేపల్లిగూడెం సభలో ప్రజాగర్జన పులివెందులలో కూడా ప్రతి ధ్వనిస్తోం ది. హూ కిల్డ్‌ బాబాయి? దమ్ముంటే సమాధానం చెప్పు జగన్‌! పాతిక ఎంపీ సీట్లు ఇస్తే హోదా తెస్తానన్నాడు. మద్య నిషేధం అన్నాడు. సీపీఎస్‌ రద్దన్నాడు. చేశాడా? జగన్‌ ఒక బ్లఫ్‌ మాస్టర్‌. పవన్‌, బాలయ్యకు కూడా తెలియ ని సినిమా సెట్టింగులు వేసి పాలన చేస్తున్నాడు. కుప్పంలో నీళ్లు వదిలినట్లు చూపించడానికి ఒక గేటు తెచ్చి పెట్టాడు. తెల్లవారేసరికి అక్కడ నీళ్లు లేవు. 23 గంటల్లో పెట్టిన గేటు కూడా లారీలో వేసుకొని వెళ్లిపోయారు. ఈ రాష్ట్రంలో పాలన అంతా ఇదే మాదిరి వ్యవహారం.

సిద్ధానికి యుద్ధమే సమాధానం

సిద్ధం అంటూ రోడ్డెక్కిన వాడికి యుద్ధమంటే ఏమిటో తెలియాలి. ప్రజల నుంచి వచ్చింది తెలుగుదేశం-జనసేన పొత్తు. శ్రామికులు, యువత, నిరుద్యోగులు, రైతులు కోరుకున్న పొత్తు ఇది. తెలుగుదేశం శ్రామికుని కండరాలనుంచి వచ్చింది. రైతు కష్టాలనుంచి, పేదల కన్నీళ్లనుంచి పుట్టుకొచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో మోసపోయిన వారంతా ఓటు వేస్తే జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. తెలుగుదేశం-.జనసేన విజయం సొంతం.

- అచ్చెన్నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ

బాదుడు లేని అభివృద్ధి, కోతలు లేని సంక్షేమం అమలు చేస్తాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రభుత్వ ఆదాయాన్ని పేద వర్గాల అభివృద్ధికి వెచ్చిస్తాం. త్వరలో బీసీ డిక్లరేషన్‌ విడుదల చేస్తున్నాం. తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు, యువత పాలసీ కూడా విడుదల చేస్తాం.

రాష్ట్రంలో విధ్వంసం చేసిన పాలకులను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధం! త్వరలో నవ్యాంధ్రకు నవోదయం! వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసమే చేతులు కలిపాం.

కులాలు కూడు పెట్టవు. మంచి పాలకులు కావాలి. అధికారం కోసం జగన్‌ రాష్ట్రాన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలుగా విభజిస్తున్నారు. ఒక్కో ఇటుక పేర్చి కట్టిన కట్టడాన్ని జగన్‌ ఒక్క గొడ్డలి పెట్టుతో విధ్వంసం చేశారు. దీనిని సీనియర్‌ నేతగా నేను, ప్రశ్నించే తత్వమున్న పవన్‌ భరించలేం.

- చంద్రబాబు

జగన్‌ నీకు సంబంధించినంత వరకూ నేను మూడు పెళ్లిళ్లు.. రెండు విడాకులు. పవన్‌ అంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌.. కన్నీళ్లు తుడిచే చేయి.. ప్రాణాపాయంలో అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ వచ్చే 108 అంబులెన్స్‌.. ఆడబిడ్డలకు రక్షణగా ఉండే రాఖీ. పెద్దోళ్ల భుజం మీద ఉంటే కండువా.. గర్వంగా ఎగిరే జాతీయ జెండా.. జగన్‌.. పవన్‌ అంటే.. నిన్ను నట్టేట ముంచే తుఫాన్‌. నిన్ను పాతాళానికి తొక్కే వామనుడి పాదం. గుర్తుపెట్టుకో.

సమష్టి కృషితో సభ విజయవంతం

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెంలో ఇటువంటి మహోన్నత సభ నిర్వహించడం, దానిని విజయవంతం చేయడంలో అందరి సమష్టి కృషి ఉంది. ఈ సభకు స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించిన వ్యాపారవేత్త నంద్యా ల కృష్ణమూర్తికి కృతజ్ఞతలు. సభ ఏర్పాట్లు కేవలం మూడు రోజుల్లో పూర్తి చేసినందుకు జనసేన నియోజవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివా్‌సను, అన్ని రకాలుగా సహకరించిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జిని అభినందిస్తున్నా. వలంటీర్లు చేసిన కృషి అభినందనీయం. పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బంది అందించిన సహకారానికి కృతజ్ఞతలు.

- నాదెండ్ల మనోహర్‌, చైర్మన్‌, పీఏసీ, జనసేన

దరిద్రపు పార్టీని వదిలేశా..

మెన్నటి వరకు వున్న దరిద్రపు పార్టీని వదిలేశా ను. ఇప్పుడు ఏ పార్టీలోనూ లేను. సైకాసురుడి ని గద్దె దింపడం కోసం, ఇద్దరు గొప్ప నాయకు లు ఈగోలను పక్కన పెట్టి రాష్ట్ర పరిరక్షణ, ప్రజాస్వామ్య రక్షణ కోసం కలిసినందుకు అభినందనలు తెలిపేందుకు ఇక్కడకు వచ్చాను. ఇక ఆ దరిద్రాన్ని చరిత్ర పుటల్లో కలిపేయబోతున్నాం. దుర్మార్గుడి అంతం కోసం శివకేశవులు కలవాలని కోరుకున్నాను. ఇప్పుడు కృష్ణార్జును ల్లా కలిశారు. దుర్మార్గుడి పాలనను తరిమి కొడ దాం. నాకు టికెట్‌ ఇవ్వరని జగన్‌ మీడియాలో వార్తలు రాస్తున్నారు. ఇప్పుడే చెబుతున్నా... నేను నరసాపురం నుంచి పోటీ చేస్తున్నాను. బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ పడుతున్నా.

- కే రఘురామకృష్ణరాజు, ఎంపీ, నరసాపురం

వైసీపీతో యుద్ధంలో గెలవాల్సిందే

జగన్‌ మాట్లాడితే సిద్ధం అంటున్నాడు. మోసపూరిత హామీలతో ఓటు అడగటానికి వస్తున్న అతనితో ప్రజలందరూ యుద్ధం చేసి గెలవాల్సిందే. అందుకే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒకటిగా వచ్చి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కటిగా నిలిచారు. ఈ ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడాలి. అధికార మదాన్ని పారద్రోలాలి. వైసీపీ అధికారంలోకి వచ్చి అంతా నాశనం చేసింది. ఇప్పుడు అటువంటి పాలన కోసం ఇద్దరి నాయకులు పెద్ద మనసుతో కలసి వస్తున్నందున కులమతాలకు అతీతంగా గెలిపించుకోవాలి.

- ఎంఏ షరీఫ్‌. మాజీ చైర్మన్‌, శాసన మండలి

జగన్‌కు జనం ఉసురు తగులుతుంది

జగన్‌ ఐదేళ్ల పాలనలో వ్యవసాయం నాశనమైంది. రైతులను మోసంచేశాడు. ఒక రైతుగా నా స్వీయ అనుభవం చెబుతున్నాను. మొన్నటి తుఫాన్‌, అంతకుమందు భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను దగా చేసాడు. ఒక్కొక్క లోడుకు 20 నుంచి 30 వేల రూపాయల నష్టాన్ని చూపించాడు. బస్తాకు 75 కేజీలు తీసుకోవాలి. ఐదు నుంచి 10 కేజీలు అదనంగా దోచేశారు. ఇది జగన్‌ అబ్బ సోమ్మా..! ఇతని పాలనలో రైతుల ఆత్మహత్యలు మూడో స్థానంలోను, కౌలు రైతుల ఆత్మహత్యలు రెండో స్థానంలోను నమోదయ్యాయి. రైతులకు సబ్సిడీ లేదు. బీమా లేదు. వీరి ఉసురు తగులుతుంది.

- నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే, పాలకొల్లు

ఎస్సీ, బీసీ, మైనార్టీలంటూనే మోసం

నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ఐదేళ్ళుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు. సుబ్రహ్మణ్యంలాంటి ఎస్సీ డ్రైవర్‌ను చంపి పార్శిల్‌ పంపారు. ఎన్నో దౌర్జన్యాలు, అక్రమ కేసులకు ఎస్సీ, ఎస్టీలు బలైపోతున్నారు. వీరందరికి రక్షణ కోసమే జనసేన, టీడీపీ పాలన అవసరం. సిద్ధం అంటూ బోర్డులతో హడావిడి చే స్తున్న జగన్‌ను ఓట్లయుద్ధంలో ఓడించటానికి అందరూ సిద్ధం కావాలి.

- కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి

జగన్‌ను గద్దె దింపాలి

జగన్‌ పాలన, బ్రిటిష్‌ పాలనలా విభజించు, పాలించులా సాగుతోంది. దోపిడీలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబులాంటి సమర్ధవంతమైన నాయకులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కౌరవ పాలన సాగుతోం ది. ఎన్నికల కురుక్షేత్రంలో దుర్యోఽధనుడి పాలనను చరమగీతం పాడుదాం. త్వరలో బీజేపీ కలుస్తుంది. ఈ మూడు పార్టీల కలయిక రాబో యే స్థానిక ఎన్నికల వరకు కొనసాగాలి. మూడు రాజధానులు అంటూ విశాఖను నాశనం చేస్తున్నారు.

- కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి

రాయలసీమను ఎడారిని చేసిన జగన్‌

వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాయలసీమ ఎడారి అయ్యింది. చంద్రబాబు హయాంలో ఎత్తిపోతలకు 90 శాతం రాయితీ ఉండేది. దానిని జగన్మోహన్‌రెడ్డి అమలు చేయడం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తెలుగుదేశంపాటు పడింది. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారు.

- నందమూరి బాలకృష్ణ

Updated Date - Feb 29 , 2024 | 06:43 AM