Pawan Kalyan: పవన్ కోసం ఇల్లు సిద్ధం.. ఎక్కడంటే..
ABN , Publish Date - Apr 06 , 2024 | 03:16 AM
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట నివాసముండేందుకు ఇల్లు చూసుకుంటా.
చేబ్రోలు బైపాస్ రోడ్డులో ఎంపిక..
ఇక్కడే హెలిప్యాడ్ నిర్మాణం కూడా
పిఠాపురం/గొల్లప్రోలు రూరల్, ఏప్రిల్ 5: ‘‘కాకినాడ(Kakinada) జిల్లా పిఠాపురం(Pithapuram) నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట నివాసముండేందుకు ఇల్లు చూసుకుంటా. పురుహుతికా అమ్మవారు ఆశీస్సులతో ఎక్కడ ఉండాలని సూచిస్తారో అక్కడే ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను’’ అని చెప్పిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆ దిశగా వేగంగా అడుగులు వేశారు. చేబ్రోలులో ఒక అభ్యుదయ రైతు నిర్మించిన కొత్త ఇంటిని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపా్‌సరోడ్డు పక్కన తన పంటపొలాల్లో రైతు ఓదూరి నాగేశ్వరరావు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ భవనాన్ని పవన్ నివాసముండేందుకు ప్రాథమికంగా ఎంపిక చేశారు.
జనసేనాని తన సొంతింటిని నిర్మించుకునేవరకూ ఇక్కడే ఉంటారు. ఈ ఇంటికి శుక్రవారం గృహప్రవేశం కూడా పూర్తయింది. తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌ను పూర్తిగా వాహనాల పార్కింగ్‌కు, మొదటి ఫ్లోర్‌లో ఆఫీసు నిర్వహణకు, రెండు, మూడు అంతస్తులు కలిపి డూప్లెక్సు తరహాలో నిర్మించారు. పవన్‌కు అనువుగా ఉంటుందని భావించిన పార్టీ నేతలు దీనిని ఎంపిక చేశారు.
ఓదూరి నాగేశ్వరరావు పవన్ అభిమాని కావడంతో ఇంటిని ఇచ్చేందుకు అంగీకరించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. తనకు అద్దె వద్దని, కేవలం ఒక రూపాయి ఇస్తే చాలని ఆయన చెప్పినట్టు సమాచారం. ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు పవన్ పిఠాపురం రానున్న నేపఽథ్యంలో అప్పటికే ఈ ఇంటిని సిద్ధం చేసి ఇక్కడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ ఇంటికి సమీపంలోనే పంటపొలాల్లో హెలిప్యాడ్ ఏర్పాటు పనులు కూడా ప్రారంభమయ్యాయి.