ప్రపంచ సమస్యలకు పరిష్కారం భారతీయ తత్వచింతనే
ABN , Publish Date - Oct 01 , 2024 | 04:24 AM
ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వచింతనే పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పెదకాకాని, సెప్టెంబరు 30: ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వచింతనే పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి సందర్భంగా సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆధునిక విద్యాభ్యాసంలో తత్వశాస్త్రం ఒక ప్రత్యేక విభాగంగా రూపుదిద్దుకోవడం మనిషి వికాసానికి, సమాజ వికాసానికి ఎంతో మేలు చేేస విషయం అన్నారు. వివిధ ఉపనిషత్తుల్లో మహర్షులు చేసిన బోధనలను ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఉటంకించారు.
ప్రపంచం నలుమూలల విస్తరిస్తున్న పెడపోకడలకు భిన్నమైన సమాజంగా మనం ఎదగాలన్నా, ప్రపంచం మనల్ని అనుసరించాలన్నా తిరిగి మనం మన మూలాలకు వెళ్లాలని సూచించారు. తొలుత కొత్త సచ్చిదానందమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. ఇప్పటివరకు ముద్రితం కాని ఆచార్య సచ్చిదానందమూర్తి రచనలను, ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రొఫెసర్ అశోక్ వోహ్రా, కె. రమేష్ సంపాదకత్వంలో తీసుకువచ్చిన పుస్తకాన్ని, ఆయన స్మృతి చిహ్నంగా తీసుకువచ్చిన పోస్టల్ కవరును వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు మండలి బుద్థ ప్రసాద్, కామినేని శ్రీనివాసరావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్స లర్ ప్రొఫెసర్ కే. గంగాధరరావు, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. త్రిమూర్తి రావు పాల్గొన్నారు.