Share News

Vijayawada : కృష్ణానదిపై ‘మూడు’ ముచ్చట్లు!

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:34 AM

కృష్ణానది నుంచి వృథాగా పోతున్న నీటిని పొదుపు చేయడానికి, భవిష్యత్తులో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వం రెండు ప్రణాళికలను సిద్ధం చేసింది.

Vijayawada : కృష్ణానదిపై ‘మూడు’ ముచ్చట్లు!

  • రాజధాని నీటి కోసం ‘వైకుంఠపురం’.. ప్రకాశం బ్యారేజ్‌ దిగువన నీటి నిల్వల కోసం 2 మినీ బ్యారేజ్‌లు

  • వైకుంఠపురాన్ని వదిలేసిన వైసీపీ

  • చోడవరం వద్ద బెలూన్‌ బ్యారేజ్‌ డిజైన్‌ చేసిన గత టీడీపీ ప్రభుత్వం

  • దాన్ని కూడా పక్కన పెట్టిన జగన్‌ మరో 2 మినీ బ్యారేజ్‌లకు ప్రతిపాదన

  • ఏ ఒక్కటీ పూర్తి చేయని వైసీపీ ప్రభుత్వం

కృష్ణా నది పక్కనే ప్రవహిస్తున్నా సాగు, తాగునీటికి కటకట. ఒక్కోసారి రెండో పంటకు నీరు ఇవ్వలేని పరిస్థితి. పులిచింతల గేట్లు ఎత్తితేనే వేసవిలో జిల్లా ప్రజల గొంతు తడుస్తుంది. ఎల్‌నినో వంటి పరిస్థితులు వస్తే నాగార్జునసాగర్‌ నీటి కోసం కృష్ణా నది నిర్వహణ బోర్డును ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇదీ రాజధాని అమరావతిని ఆనుకుని ఉన్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు ఎదుర్కొంటున్న ఇబ్బంది. వరదలు వచ్చినప్పుడు కృష్ణమ్మ నీరు కడలిలో వృథాగా కలిసిపోతోంది.

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

కృష్ణానది నుంచి వృథాగా పోతున్న నీటిని పొదుపు చేయడానికి, భవిష్యత్తులో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వం రెండు ప్రణాళికలను సిద్ధం చేసింది. రాజధానిలో నీటి అవసరాల కోసం వైకుంఠపురం వద్ద ఒక బ్యారేజ్‌ని, ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దిగువన చోడవరం వద్ద ఒక బెలూన్‌ బ్యారేజ్‌ని నిర్మించాలని తలపెట్టింది. ఈ రెండింటిని వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. చోడవరం వద్ద బ్యారేజీని నిర్మిస్తే విజయవాడ నగరం వైపు చల్లగాలులు వీయడంతో వేసవి తాపం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం కృష్ణా నదిపై ఒకే ఒక్క బ్యారేజీ మాత్రమే ఉంది. అదే ప్రకాశం బ్యారేజ్‌. దీని పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.07 టీఎంసీలు.

వరదలు వచ్చినప్పుడు బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేస్తే హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తోంది. ఒక్కో ఏడాది 300 నుంచి 400 టీఎంసీల నీరు వృథాగా పోతోంది. ఒక్కోసారి ఇది 1200 టీఎంసీలను దాటిన సందర్భాలు ఉన్నాయి. దీనికి చెక్‌ పెట్టడానికి గత టీడీపీ ప్రభుత్వం ప్రకాశం బ్యారేజ్‌కి దిగువన 2017లో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం వద్ద బెలూన్‌ బ్యారేజ్‌ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి డీపీఆర్‌ను రూపొందించింది.

తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ప్రణాళికను పక్కన పెట్టింది. ప్రకాశం బ్యారేజ్‌కి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో పెనమలూరు మండలం చోడవరం వద్ద ఒక బ్యారేజ్‌ను, దీనికి దిగువన 60 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం వద్ద మరో బ్యారేజ్‌ను నిర్మించాలని భావించింది.

ఐదేళ్ల కాలంలో రెండింటిలో ఒక్క దాన్నీ పూర్తి చేయలేదు. మినీ బ్యారేజ్‌ల ఒక్కోదాని నీటి సామర్థ్యం 4.05 టీఎంసీలు. కొత్తగా మినీ బ్యారేజ్‌లు అందుబాటులోకి వస్తే మొత్తం 11.17 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. రెండు మినీ బ్యారేజ్‌లకు ఒకేసారి ఆమోదం తెలపడంతో నిర్మాణం ఒకేసారి ప్రారంభమవుతుందని రైతులు, ప్రజలు భావించారు.

తర్వాత రెండింటికి కాకుండా ఒక బ్యారేజ్‌ నిర్మాణానికి మాత్రమే పరిపాలన ఆమోదం ఇచ్చింది. చోడవరం వద్ద నిర్మించబోయే బ్యారేజ్‌ను పెండింగ్‌లో పెట్టి శ్రీకాకుళం వద్ద బ్యారేజ్‌ను తొలుత నిర్మించాలని భావించింది. శ్రీకాకుళం వద్ద సముద్రం ఆటుపోటుల సమయంలో నీరు సమీప గ్రామాల్లోకి చొచ్చుకు వస్తోంది. దీంతో ఇక్కడ భూగర్భ జలాల పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉన్నందున రెండో బ్యారేజ్‌ నిర్మాణం చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం భావించినా ఒక్క అడుగు ముందుకు పడలేదు.


దిగువ ఇబ్బందులు ఎన్నెన్నో

ప్రకాశం బ్యారేజ్‌ ఎగువ ప్రాంతాన్ని మినహాయిస్తే దిగువన నదీ పరివాహక ప్రాంతంలో చుక్క నీరు ఉండడం లేదు. వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం నిండుకుండలా కనిపిస్తోంది. నదిలో నీరు నిరంతరం ప్రవహిస్తున్న దానికి, వరదలు వచ్చి ఆగిపోయినప్పటి పరిస్థితికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

గ్రామాలకు సిగలో ఉన్నట్టుగా నది ప్రవహిస్తున్నా బోర్లు తవ్వినప్పుడు స్వచ్ఛమైన నీరు రావడం లేదు. పెనమలూరు మండలంలోని గ్రామాలను ఆనుకుని నది.. సముద్రం సరిహద్దు వరకు ప్రవహిస్తుంది. చోడవరం, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బోర్లు తవ్వినప్పుడు వచ్చే జలాల్లో స్వచ్ఛత ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి, అవనిగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి మరోలా ఉంది. పోటు సమయంలో సముద్రపు నీరు నదిలోకి వచ్చి చేరుతుంది.

ఇక అల్పపీడనాల సమయంలోనూ సముద్రపు నీరు రోజుల తరబడి నదిలో ఉంటోంది. ఈ కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లోని భూములు చౌడు బారుతున్నాయి. ఇక్కడ ఏ ప్రదేశంలో బోర్లు వేసిన ఉప్పు నీరు తప్ప స్వచ్ఛమైన నీరు రావడం లేదు. ప్రకాశం, చోడవరం, మోపిదేవి బ్యారేజ్‌ల మధ్య ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండేలా చేస్తే ఈ పరిస్థితులు మారతాయని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.


రాజధానికి ‘వైకుంఠం’

రాజధానిలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి ప్రకాశం బ్యారేజ్‌కి ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు దిగువన వైకుంఠపురం వద్ద నదిపై ఒక బ్యారేజ్‌ నిర్మించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి రూ.3,278.60 కోట్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజ్‌కి 23 కిలోమీటర్ల ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు 60 కిలోమీటర్ల దిగువన వైపుకుంఠపురం వద్ద కొత్త బ్యారేజ్‌ను డిజైన్‌ చేశారు. దీని పొడవు 3.068 కిలోమీటర్లు.

అన్నీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం వైకుంఠపురాన్ని ఎంపిక చేసింది. రాజధానికి నీటి వనరులను తరలించాలంటే ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా కెనాల్‌, గుంటూరు చానల్‌ మీదుగా మళ్లించాలి. దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి తీసుకెళ్లడం కంటే ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి తరలించడం సులభంగా ఉంటుందని వైకుంఠపురం దగ్గర బ్యారేజీని ప్రతిపాదించారు. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన పులిచింతల ప్రాజెక్టు ఉంది.

దీని పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 45 టీఎంసీలు. విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.07 టీఎంసీలు. ఈ రెండింటికీ మించి సుమారుగా 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా వైకుంఠపురం బ్యారేజ్‌ను నిర్మించాలనుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. రాజధాని లేనప్పుడు వైకుంఠపురం బ్యారేజ్‌ ఎందుకన్నట్టుగా వదిలేసింది. కృష్ణా నదిపై వైకుంఠపురంతోపాటు ప్రకాశం బ్యారేజ్‌కి దిగువన రెండు మినీ బ్యారేజ్‌లను పూర్తిచేస్తే జీవనది విజయవాడ సిగలో ఉన్నట్టవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Aug 09 , 2024 | 03:34 AM