ఇద్దరు గిరిజనుల ఆత్మహత్య
ABN , Publish Date - Jul 20 , 2024 | 11:44 PM
చిన్నబగ్గ పంచాయతీ జరడకాలనీకి చెందిన బిడ్డిక అన్నపూర్ణ (35), తాడంగి వెంకటరావు (37) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివాహేతర సంబంధమే వీరి ఆత్మహత్యకు కారణమని అన్నపూర్ణ చిన్నాన్న బిడ్డిక నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు
సీతంపేట: చిన్నబగ్గ పంచాయతీ జరడకాలనీకి చెందిన బిడ్డిక అన్నపూర్ణ (35), తాడంగి వెంకటరావు (37) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివాహేతర సంబంధమే వీరి ఆత్మహత్యకు కారణమని అన్నపూర్ణ చిన్నాన్న బిడ్డిక నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాల మేరకు.. జరడకాలనీకి చెందిన తాడంగి కృష్ణారావు, నీలకంఠాపురం పంచాయతీ శాలిడాంగూడకు చెందిన అన్నపూర్ణ 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి వీరికి నలుగురు పిల్లలు కాగా ఇద్దరు మృతి చెందారు. అయితే, అన్నపూర్ణకు జరడకాలనీకి చెందిన వెంకటరావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 3న రాత్రి భోజనం చేసిన అనంతరం అన్నపూర్ణ తన భర్త కృష్ణారావు, పిల్లలతో కలిసి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం కృష్ణారావు నిద్రలేచి చూడగా భార్య కనిపించలేదు. అదే గ్రామానికి చెందిన వెంకటరావు కూడా కనిపించకపోవడంతో అనుమానం ఏర్పడింది. దీనిపై 8న సీతంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 14న హైదరాబాద్‌లో ఉంటున్న తుంబలి గ్రామానికి చెందిన కొండగొర్రె సుమంత్ తన స్నేహితుడు జరడకాలనీకి చెందిన మీనక సూర్యారావుకు ఫోన్ చేసి వెంకటరావు, అన్నపూర్ణ హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పాడు. ఈ విషయాన్ని సూర్యారావు.. అన్నపూర్ణ భర్త కృష్ణారావుకు తెలియజేశాడు. దీంతో 16న జరడకాలనీకి చెందిన బిడ్డిక నీలయ్య, మీనక గోపాల్, తాడంగి శివకుమార్ తదితరులు హైదరాబాద్‌కు కారులో వెళ్లారు. వెంకటరావు, అన్నపూర్ణకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని కారులో ఎక్కించుకుని 18వ తేదీ మధ్యాహం గ్రామానికి బయలుదేరారు. 19న సీతంపేట మండలం కుశిమి గ్రామ సమీపంలో అన్నపూర్ణ మూత్రవిసర్జన కోసం కారు ఆపమని చెప్పింది. దీంతో వాహనం ఆపడంతో ఆమె కిందకు దిగి ఓ చోటకు వెళ్లింది. కొంతసేపటి తరువాత వెంకటరావు కూడా దిగి అక్కడకు వెళ్లాడు. ఇద్దరూ పురుగు మందు తాగి వచ్చి కారు ఎక్కారు. అయితే, కొద్దిసేపటి తరువాత వారు వాంతులు చేసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అదే కారులో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. దీనిపై అన్నపూర్ణ చిన్నాన్న బిడ్డిక నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జగదీష్‌నాయుడు తెలిపారు.