Chandrababu: ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనది..
ABN , Publish Date - Aug 15 , 2024 | 08:34 AM
దేశమంతా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. గల్లీ గల్లీలో తిరంగా జెండా ఎగురుతోంది. దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటీష్ వారి చెరలోనే మగ్గిపోయిన భారత జాతికి ఇవాళే విముక్తి లభించింది.
అమరావతి: దేశమంతా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. గల్లీ గల్లీలో తిరంగా జెండా ఎగురుతోంది. దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటీష్ వారి చెరలోనే మగ్గిపోయిన భారత జాతికి ఇవాళే విముక్తి లభించింది. బ్రిటీషర్లు పెట్టిన చిత్ర హింసల నుంచి బయటకు రావాలనే ధృఢ సంకల్పంతో 1857లో సిపాయిల తిరుగుబాటుతో స్వాతంత్ర్యోద్యమ పోరాటం ప్రారంభమైంది. 90 ఏళ్ల పాటు అలుపెరగక భారతీయులంతా పోరాటం సాగించారు. ఎక్కడికక్కడ ఉద్యమాలు, ఆందోళనలు, హర్తాళ్లతో జనం తమ పవరేంటో చూపించారు. నాయకులు సైతం ఎవరికి వారు తమకు తోచినట్టుగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. తద్వారా జనాలను నడిపించారు. మొత్తానికి 1947 ఆగస్ట్ 15న మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. నేడు నాయకులంతా దేశ ప్రజానీకానికి స్వాతంత్ర్య శుభాకాంక్షలు చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ప్రజానీకానికి ట్విటర్ వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రమని ఆయన పేర్కొన్నారు. వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనదన్నారు. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో సాగుతున్న మన దేశం, ప్రపంచానికే ఆదర్శమన్నారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంటూ, తాడితపీడిత ప్రజలకు అండగా నిలుస్తూ, బలహీనులకు ధైర్యాన్నిస్తూ ముందుకు సాగాలనేది పెద్దలు మనకు నేర్పిన పాఠమని చంద్రబాబు అన్నారు.
అందుకు అనుగుణంగానే మనం అడుగులు వేస్తున్నామన్నారు. అభివృద్ధి ఫలాలను అందరికి అందించే బృహత్ బాధ్యతతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ స్వాతంత్య్ర దినోత్సవం జనజీవితాలకు కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక చంద్రబాబు మరికాసేపట్లో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. దీని కోసం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లన్నింటినీ అధికారులు పూర్తి చేశారు.