అయ్యో.. రొయ్యో!
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:40 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆక్వా రైతుల్లో వణుకు పుట్టిస్తున్నాడు. భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి సుంకాలు భారీగా పెంచుతున్నట్టు చేసిన ప్రకటనతో రొయ్యల ఎగుమతిదారులు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. దాని ఫలితంగా ఆక్వా రైతులు పండించే ఉత్పత్తులపై తీవ్రమైన ప్రభావం పడింది.

ఆక్వా రంగంలో వణుకు పుట్టిస్తున్న ట్రంప్ ప్రకటన
ఆక్వా రైతు నెత్తిన ఎగుమతి సుంకం పిడుగు
ఆ సాకుతో రొయ్యల కొనుగోళ్లు ఆపేసిన ఎగుమతిదారులు
కొన్ని రోజులపాటు కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయం
విలవిల్లాడుతున్న రైతులు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆక్వా రైతుల్లో వణుకు పుట్టిస్తున్నాడు. భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి సుంకాలు భారీగా పెంచుతున్నట్టు చేసిన ప్రకటనతో రొయ్యల ఎగుమతిదారులు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. దాని ఫలితంగా ఆక్వా రైతులు పండించే ఉత్పత్తులపై తీవ్రమైన ప్రభావం పడింది. ఉత్పత్తి అయ్యే రొయ్యలను సైతం ఎగుమతిదారులు ధరలు తగ్గించి కొనుగోలు చేసే ప్రతిపాదనలు రైతులకు శరాఘాతంగా మారింది. ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఎగుమతి సుంకాలు పెంచేశారన్న ప్రచారం ప్రభావంతో భారత్‌లోనే అత్య ధిక ఆక్వా ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల ధరలు గణనీయంగా తగ్గిపోయి రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. 50 కౌంట్ నుంచే అమెరికాకు రొయ్యల ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతుంటాయి. దీన్ని సాకుగా తీసుకుని వంద కౌంట్ రొయ్యల ధరను భారీగా తగ్గించేశారు. కొన్ని రోజులపాటు ఆక్వా రైతులు, ఉత్పత్తులను పట్టుబడులు చేయడం నిలిపివేయాలంటూ కంపెనీలు ఆదేశించడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. అమెరికా సుంకాల భారాన్ని మోపడంపై వారంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
(అమలాపురం/మలికిపురం-ఆంధ్రజ్యోతి)
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ముఖ్యంగా వనామీ రొయ్యపై ఎగుమతి సుంకం విధించడంతో ఆక్వా రైతులు పండించే రొయ్యల ఉత్పత్తులను కొన్నిరోజులపాటు నిలిపివేయాలన్న ఎగుమతిదారుల నిర్ణయం రైతులకు తీవ్ర ఆందోళన కలిగించింది. దాంతో కిలో రొయ్యలకు రూ.40 వరకు ఎగుమతి సుంకం పడుతుందనే పేరుతో రొయ్యల కొనుగోళ్లు నిలిపివేశారు. ఏప్రిల్ 15 నుంచి రొయ్యల ధరలు మరింత తగ్గుతాయనే ప్రచారానికి తెర లేపారు. దాంతో రొయ్యల రైతులు ఉత్పత్తి అయిన వాటిని అయిన కాడికి అమ్ముకోవడానికి సిద్ధమయ్యారు. వ్యాపారులు మాత్రం సిండికేట్ అయి నోరు మెదపడం లేదు. ఆర్డర్లు చెప్పడం లేదు. దాంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొంది. అధిక సాగు ఉన్న కోనసీమలో తీరప్రాంత మండలాల నుంచి ప్రతీ రోజు వేలాది టన్నుల రొయ్యలు వివిధ కంపెనీలకు ఎగుమతి అవుతాయి. రాష్ట్రంలోనే పేరొందిన ప్రముఖ కంపెనీలు ఈ ప్రాంతం నుంచి రొయ్యల కొనుగోలు చేస్తాయి. ట్రంప్ పేరుతో తమపై ఎగుమతి సుంకం పడుతుందనే నెపంతో ఎగుమతిదారులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని, ప్రస్తుతానికి కొనుగోలు నిలిపివేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతానికి కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గించి రొయ్యలు కొనుగోలు చేస్తున్నారు. ధరలు మరింత తగ్గుతాయని ప్రచారం చేస్తూ రైతులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. 30 నుంచి 50 పైకౌంటు రొయ్యలు మాత్రమే అమెరికా, జపాన్ వంటి ఇతర దేశాలకు ఎక్కువగా ఎగుమతులు అవుతాయి. అయితే 80 నుంచి వంద కౌంటు వరకు రొయ్యలు ఎగుమతులకు పనికిరావని సాకుచూపి రేటు భారీగా తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వంద కౌంటు రొయ్యలు రూ.220 ధరకు కొనుగోలు చేస్తుండగా, 90 కౌంట్ రూ. 230, 80 కౌంట్ రూ.250, 70 కౌంట్ రూ.270, 60 కౌంట్ రూ.300, 50 కౌంట్ రూ.330, 40 కౌంట్ రూ.360, 30కౌంట్ రూ.450 ధరలు ఉండగా ఇవి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయని రైతులు తెలుపుతున్నారు. ప్రభుత్వం రొయ్యల రైతులకు భరోసా కల్పించాలని, అత్యధిక విదేశీ మారకద్రవ్యం ఆర్జించే పెద్ద రంగం ఆక్వా కాబట్టి ప్రభుత్వం ఆక్వా రైతులకు బాసటగా నిలబడాలని ఆక్వా అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు త్సవటపల్లి నాగభూషణం పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న విద్యుత్ రాయితీలు వర్తింపచేయాలని, గత ప్రభుత్వంలో దారుణంగా పెంచిన రొయ్య ఫీడు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కొనుగోలుదారులతో చర్చించి రొయ్యలు కొనే ఏర్పాట్లు చేయాలని కోరారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతుల్లోనూ ఇదే ఆందోళన నెలకొంది.