పశ్చిమం అతలాకుతలం
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:42 AM
జిల్లాలోని పశ్చిమప్రాం తంలో గురువారం రాత్రి గాలులతో కూడిన వర్షం పడింది. కొన్ని మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా కురిసింది. అలా ఒకవైపు గాలులు, మరోవైపు అకాల వర్షంతో పశ్చిమ ప్రాంతంలోని చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయంతోపాటు పొలాల్లో ఉన్న పంటలకు నష్టం వాటిల్లింది.

అకాల వర్షం, గాలులతో పలుచోట్ల నష్టం
నేలకొరిగిన వివిధ రకాల పైర్లు, తోటలు
మిర్చిని కాపాడుకునేందుకు రైతుల పాట్లు
గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఒంగోలు, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పశ్చిమప్రాం తంలో గురువారం రాత్రి గాలులతో కూడిన వర్షం పడింది. కొన్ని మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా కురిసింది. అలా ఒకవైపు గాలులు, మరోవైపు అకాల వర్షంతో పశ్చిమ ప్రాంతంలోని చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయంతోపాటు పొలాల్లో ఉన్న పంటలకు నష్టం వాటిల్లింది. అక్కడక్కడా కోత దశలో ఉన్న మొక్కజొన్న, అరటి, బొప్పాయి తోటలు నేలవాలాయి. కల్లాల్లో ఉన్న మిర్చి తడిసిపోతుండటంతో వాటిని రక్షించుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. పశ్చిమాన వివిధ గ్రా మాల్లో వెయ్యి ఎకరాలలో మొక్కజొన్న, అరటి, బొప్పా యి తోటలు దెబ్బతిని రూ.2కోట్ల మేర రైతులు నష్టపోయారు.
అకాలంలో గాలివాన
జిల్లాలో రెండు వారాలుగా ఎండల తీవ్రత పెరిగింది. ప్రత్యేకించి పశ్చిమప్రాంత మండలాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ తరుణంలో గురువారం సాయంత్రం ఆ ప్రాంతంలో వాతావరణంలో మార్పు చోటుచేసుకొంది. దీంతో కాస్తంత ఊరట పొందుతామనుకున్న ప్రజానీకానికి కొద్దిసేపటికే వర్షం అధికం కావడంతోపాటు గాలుల తీవ్రత పెరగడం తీవ్రంగా ఇబ్బందిపెట్టింది. జిల్లావ్యాప్తంగా చూస్తే అధిక ప్రాంతాల్లో జల్లులు ఉన్నప్పటికీ పశ్చిమంలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు గాలివాన ప్రభావం కనిపించింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడా కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో జిల్లాలో సగటున 9.4 మీ.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఎర్రగొండపాలెం మండలంలో 66.2 మి.మీ కురిసింది. పెద్దారవీడు మండలం సానికవరంలో 60.0, పుల్లలచెరువు మండలంలో 46.0, కొమరోలులో 25.8, త్రిపురాంతంలో 23.40, బేస్తవారపేటలో 20.4, దోర్నాలలో 17.8 దొనకొండలో 18.8, అర్థవీడులో 16.8, కేకేమిట్లలో 15.20 మి.మీ నమోదైంది. ఇతర పలు మండలాల్లోనూ జల్లులు పడ్డాయి.
పొంగిన వాగు.. తెగిన చెరువు కట్ట
గాలివానకు బేస్తవారపేట మండలంలో దాదాపు 500 ఎకరాల్లో కోత దశలో ఉన్న మొక్కజొన్న నేలవాలింది. ఆ మండలంలోని సోమవారపుపేటలో అరటి తోటలు పడిపోగా పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగాయి. ఎర్రగొండపాలెం మండలం గుడిపాడు గ్రామ సమీపంలోని వాగు పొంగి రాత్రి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోయలపల్లి, అమానిగుడిపాడు, ఎర్రగొండపాలెం గ్రామాల్లో బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. కొమరోలు మండలం ఇడమకల్లులో పిడుగుపడి రెండు గేదెలు మృతిచెందగా పలు గ్రామాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. పెద్దారవీడు మండలం పోతంపల్లిలో వర్షపు నీటితో చెరువు నిండి కట్టకు గండిపడింది. మార్కాపురం మండలం గజ్జలకొండలో బర్లీ పొగాకు పందిళ్లు లేచిపోయాయి. ఇక దొనకొండ, దోర్నాల, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, పెద్దారవీడు తదితర మండలాల్లో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి వర్షపు జల్లులకు తడిసిపోయే పరిస్థితి ఏర్పడగా వాటిని కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు.