‘ఉపాధి’తో ప్రగతి
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:41 AM
జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 96 శాతం ప్రగతిని సాధించారు. 4.42 లక్షల కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యం కాగా 1.29లక్షల పనిదినాలు కల్పించారు.

జిల్లాలో 96శాతం పనుల కల్పన
5.06 లక్షల మందికి రూ.272 కోట్ల వేతనం చెల్లింపు
వచ్చే మూడు నెలల్లో 2.95లక్షల కుటుంబాలకు పనులు
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 96 శాతం ప్రగతిని సాధించారు. 4.42 లక్షల కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యం కాగా 1.29లక్షల పనిదినాలు కల్పించారు. జిల్లాలో 2.95 లక్షల కుటుంబాల్లోని 5.06 లక్షల మంది వేతనదారులకు పనులు కల్పించి వేతన రూపంలో రూ.272 కోట్లు చెల్లించారు. ఉపాధి అనుసంధానంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.180.70 కోట్ల అంచనాతో సీసీరోడ్లు, డ్రైన్లు, బీటీరోడ్లు, టూరిజం రోడ్లు, ఎస్సీ, ఎస్టీ కాలనీలకు అనుసంధానం చేసేందుకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం 1,369 పనులకు అనుమతులు ఇచ్చారు. వాటిలో ఇప్పటివరకు 1,180 పనులు పూర్తిచేయగా 141 పురోగతిలో ఉన్నాయి. ఆ పనులకు రూ.132.02 కోట్లు ఖర్చు చేశారు. 2025-26లో ఉపాధి ద్వారా పనులు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రానున్న మూడు నెలలకు కూలీలకు 1.11 కోట్ల పనిదినాలు కల్పించి 2.95లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. పశువుల నీటి కుంటలు, సేద్యపు నీటి కుంటలు, పంట కాలువలు, సాగునీటి చెరువుల్లో పూడికతీత పనులతో పాటు సగటున కనీస వేతనం రోజుకు రూ.290 నుంచి రూ.300 తగ్గకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో రూ.4.72 కోట్ల వ్యయంతో 1,475 పశువుల నీటితొట్లు, రూ.47.50 కోట్ల వ్యయంతో 9,500 నీటి కుంటలు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించారు. రూ.101.70 కోట్ల వ్యయంతో ఫీల్డ్/ఫీడర్ చానల్స్‌లో పూడికతీత పనులు చేయాలని, 546 చెరువుల్లో పూడికతీత పనులను రూ.54.60 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. కోనేరుల పునరుద్ధరణ పనులను కూడా చేపట్టి నీటి నిల్వలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రానున్న మూడు నెలల కాలంలో చేయాల్సిన పనులపై కలెక్టర్ అన్సారియా డ్వామా అధికారులకు దిశానిర్దేశం చేశారు.