YS Jagan: బెంగుళూరులో ఏం పోగొట్టుకున్నావ్ జగన్ రెడ్డీ?
ABN , Publish Date - Aug 09 , 2024 | 08:21 AM
క్షవరమైనా వివరం రాదు కొందరికి.. అలాంటి వారి లిస్ట్‌లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందుంటారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా పార్టీ ఓటమి పాలైంది. అసలు ఎందుకు ఇంత దారుణంగా ఓటమి పాలైంది?
క్షవరమైనా వివరం రాదు కొందరికి.. అలాంటి వారి లిస్ట్‌లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందుంటారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా పార్టీ ఓటమి పాలైంది. అసలు ఎందుకు ఇంత దారుణంగా ఓటమి పాలైంది? అంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు పరిచినా.. పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టినా ఎందుకు గెలవలేదన్న ఆలోచనే లేదు. కనీసం ఇప్పుడైనా నేతలతో మాట్లాడుదాం.. కార్యకర్తలతో మాట్లాడుదామన్న కనీస ఇంగితం లేదు. ఏదో పోగొట్టుకున్న వాడి మాదిరిగా ఊ అంటే ఆ అంటే ఛలో ఎలహంక అనేస్తున్నారు. అదేంటంటారా? బెంగుళూరులోని ఆయన ప్యాలెస్. ఎలహంక ప్యాలెస్‌లోనే ప్రస్తుతం జగన్ అత్యధిక కాలం వెళ్లదీస్తున్నారు. ఏపీకి గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు.
ఇవాళ జగన్ బెంగుళూరులోని ఎలహంక ప్యాలెస్‌కు వెళుతున్నారు. గెలిచిన తర్వాత ఆయన ఏపీలో ఉంటున్నదే లేదు. కేవలం గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే. అసలు ఈయనగారేంటో.. ఈయన విధానాలేంటో పార్టీ నేతలు, కేడర్‌కే అంతుపట్టట్లే. ఏపీ సీఎం చంద్రబాబు చూశారా? అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలను అంటిపెట్టుకుని ఉంటున్నారు. మొన్నటికి మొన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు వెళ్లి అక్కడి వారందరితో ఒక సామాన్యుడిలా మాట్లాడి తన సతీమణి కోసం రెండు చీరలు కొన్నారు. ఇక నిన్న ప్రకాశం బ్యారేజ్ వద్ద తన కాన్వాయ్‌ను ఆపి అక్కడ ఉన్న వారందరితో సరదాగా మాట్లాడి.. సెల్ఫీలు కూడా దిగారు. పైగా అంతకు ముందు ఇంటింటికీ తనే స్వయంగా తిరిగి పెన్షన్లు ఇచ్చారు. ఇవన్నీ జనాల్లోకి ఎంత బాగా వెళ్లిపోయాయి. ఇలాంటి వ్యవహార శైలి ఒక నేతను జనాల్లో భగవంతుడిని చేస్తుంది. కానీ జగన్ అధికారంలో ఉన్నంత కాలం జనాల మధ్యకు వెళ్లిందే లేదు. పరదాల మాటునే జీవితాన్ని వెళ్లదీశారు. పోనీ పార్టీ నేతలతో ఏమైనా మాట్లాడారా? అంటే అదీ లేదు. కోటరీ గుప్పిట్లో ఉండిపోయారు. ఇప్పటికైనా ఏం జరిగిందో తెలుసుకుని జనాల్లోకి రావాలి కదా?
ప్యాలెస్‌ల్లో గడిపితే సామాన్యుడి పరిస్థితి.. వాళ్లసలు ఏమనుకుంటున్నారో ఎలా తెలుస్తుంది. ఏపీలో ఏదో జరుగుతోందంటూ ఢిల్లీలో ధర్నా చేసినట్టే ఉంటుంది. గెలిచినప్పటి నుంచి జగన్ ఎలహంకను వీడుతున్నదే లేదు. వినుకొండ ఘటన తర్వాత ఇంకేముంది.. జగన్ జనాల్లోకి వచ్చేస్తున్నారు. ఇక దబిడి దిబిడే.. అదీ ఇదీ అంటూ వైసీపీ నేతలు నానా హంగామా చేశారు. ఆ ఒక్క ఘటనపై ఏదో హడావుడి చేసేసి తర్వాత కూల్ అయ్యారు. అంటే జగన్ రావాలంటే మరో ఘటన ఏదైనా జరగాలన్నమాట. శవం కనిపిస్తే తప్ప ప్యాలెస్ వీడరన్న మాట. ఇక ప్యాలెస్‌లో కూర్చొని ఈయన వెలగబెట్టే రాచకార్యం ఏంటంటే.. తనకు సీఎంకు ఇచ్చేటువంటి భద్రత కావాలి.. ప్రతిపక్ష నేత హోదా కావాలి.. ఇంకా అది కావాలి.. ఇది కావాలంటూ గొంతెమ్మ కోరికలు కోరడం. ఇలాంటి అధినేతను నమ్ముకుని పార్టీ నేతలు, కేడర్ మాత్రం ఏం చేస్తారు. అందుకే అంతా సైలెంట్ అయిపోయారు. జగన్ కథ ఎలహంక ప్యాలెస్‌కు.. ఆయనను నమ్ముకున్న జనం కథ అంతేనన్నమాట.