Share News

వైసీపీ వాళ్లు.. ఏ పాపమూ ఎరుగరట!

ABN , Publish Date - May 18 , 2024 | 04:55 AM

చంద్రగిరిలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండ పాపమెవరిది..? వైఫల్యం ఎవరిది.. దోషులు ఎవరు.. అన్యాయంగా దాడులకు గురైంది ఎవరు..

వైసీపీ వాళ్లు.. ఏ పాపమూ ఎరుగరట!

తప్పంతా టీడీపీ నేతలదేనట

చంద్రగిరి గొడవలపై ప్రభుత్వానికి తిరుపతి కలెక్టర్‌ నివేదిక

టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీ కారుపై కర్రలతోనే దాడి చేశారట

అది కూడా ఐదుగురు మాత్రమే.. నివేదికలో కానరాని సమ్మెట

నానీ భార్య సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టారని ఉద్ఘాటన

వాస్తవాలు తెలుసుకునేందుకే చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వెళ్లారట!

సత్యదూర ంగా ఆర్డీవో నిశాంత్‌రెడ్డి నివేదిక.. దానికే కలెక్టర్‌ ‘ఎస్‌’

అక్కడ అడుగడుగునా నిఘా వైఫల్యం.. గొడవ జరగొచ్చని

తెలిసినా కట్టడి లేదు.. అయినా వైసీపీకి అనుకూలంగా నివేదిక

దేశంలో ఎక్కడా లేని రీతిలో హింసాత్మక ఘటనలు జరిగి ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించినా.. కొందరు ఐఏఎస్‌ అధికారుల తీరు ఏ మాత్రం మారడం లేదు. ఇంకా అధికార పార్టీ సేవలో తరిస్తూనే ఉన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో.. పోలీసుల సమక్షంలోనే టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పులివర్తి నానిని వైసీపీ మూకలు హత్య చేయడానికి తెగబడి.. అడ్డుకోబోయిన గన్‌మన్‌ను కూడా తీవ్రంగా గాయపరిస్తే.. తప్పంతా నానిదేనని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తేల్చేశారు. వైసీపీ నేతలు ఏరికోరి తెచ్చుకున్న ఆర్డీవో నిశాంత్‌రెడ్డి ఇలా ఇచ్చిన నివేదికను గుడ్డిగా ఆమోదించి ప్రభుత్వానికి పంపించేశారు. అధికార, పోలీసు మంత్రాంగాల నిష్ర్కియాపరత్వాన్ని కప్పిపుచ్చుకుని వైసీపీ ప్రత్యర్థులపై నిందలేశారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

చంద్రగిరిలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండ పాపమెవరిది..? వైఫల్యం ఎవరిది.. దోషులు ఎవరు.. అన్యాయంగా దాడులకు గురైంది ఎవరు.. చట్టాన్ని చేతిలోకి తీసుకుని సుత్తులు, రాడ్లతో దాడులు చేసి హత్యాయత్నాలకు పాల్పడింది ఎవరని అడిగితే.. తిరుపతి, చంద్రగిరి ప్రాంత ప్రజలు ఠక్కున సమాధానం చెబుతారు. రాజకీయ పార్టీలు సొంత వాదనలు వినిపించడం సహజం. కానీ పోలీసు, రెవెన్యూ యంత్రాంగం నిష్పాక్షికంగా వాస్తవాలే చెప్పాలి. కలెక్టర్‌ సత్యశోధన నివేదిక ఇవ్వాలి. కానీ చంద్రగిరిలో పోలింగ్‌ అనంతర హింస, తిరుపతి మహిళా వర్సిటీ ఆవరణలో జరిగిన దాడులు, ఆందోళనలపై తిరుపతి ఆర్డీవో నిశాంత్‌రెడ్డి ఇచ్చిన నివేదిక పూర్తి సత్యదూరంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులోని అంశాలేమిటో తిరుపతి కలెక్టర్‌ చూసుకున్నారో లేదో గాని.. దానిని యథాతథంగా ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకొన్నారు. పోలింగ్‌ అనంతర గొడవల్లో తప్పు టీడీపీదేనని పరోక్షంగా తేల్చారు. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తదితర వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవడానికే గ్రామాలకు మందీమార్బలంతో వెళ్లారని.


టీడీపీ శ్రేణులే దాడులకు తెగబడ్డాయని ఆర్డోవో నిర్ధారించారు. మహిళా వర్సిటీలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌రూంలకు వెళ్లి తిరిగొస్తున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై అదే వ ర్సిటీ ఆవరణలో పోలీసులు చూస్తుండగా ఇనుప రాడ్లు, సమ్మెట, రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఆయన్ను రక్షించేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన గన్‌మన్‌నూ తీవ్రంగా గాయపరిచారు. కానీ నానిపై ఐదుగురు మాత్రమే దాడిచేశారని.. అదికూడా కేవలం కర్రలతోనే అని.. ఈ దాడి జరిగిన తర్వాత నాని భార్య పులివర్తి సుధ సోషల్‌మీడియాలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వర్సిటీకి రప్పించారని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గందరగోళం సృష్టించారని.. వైసీపీ నేతలు ఏ తప్పూ చేయలేదని ప్రభుత్వానికి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పంపిన నివేదికలోని సారాంశం. ఈ నివేదికను నిశిత పరిశీలన చేస్తే రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాథమిక నివేదిక ఇచ్చిన ఆర్డీవో నిశాంత్‌రెడ్డి వైసీపీకి కొమ్ముకాసి అనుకూల నివేదిక ఇచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సమస్యాత్మక ప్రాంతంలో గొడవలు జరుగుతాయని తెలిసినా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, నిఘావైఫల్యం భారీగా ఉందని స్పష్టమవుతోంది. చంద్రగిరి నియోజవర్గం పరిధిలో పోలింగ్‌ రోజు 13న, మర్నాడు 14న జరిగిన గొడవలపై ఆర్డీవో నిశాంత్‌రెడ్డితో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రాథమిక విచారణ చేయించి నివేదిక తెప్పించుకున్నారు. దీంతోపాటు తిరుపతి ఎస్పీ ఇచ్చిన నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. కలెక్టర్‌ ఏం చెప్పారంటే...

13న జరిగింది ఇదీ..

‘చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో రామిరెడ్డిపల్లె పంచాయతీ ఉంది. ఇందులో కూచివారిపల్లి, నాగయ్యగారిపల్లి, ఆంజనేయపురం, కాటమరాజుమిట్ట గ్రామాలున్నాయి. రామిరెడ్డిపల్లి పోలింగ్‌ కేంద్రం (119) సమస్యాత్మక జాబితాలో ఉంది. పోలింగ్‌ రోజున మధ్యాహ్నం 3 గంటలకు గొడవ జరిగింది. టీడీపీ ఏజెంట్‌ మురళినాయుడిని దుర్భాషలాడారు. పోలీసులు, పోలింగ్‌ అధికారులు వివాదం ముదరకుండా చేశారు. పోలింగ్‌ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఆ తర్వాత ఏ గొడవలూ లేవు. పోలింగ్‌ ముగిశాక మురళినాయుడు, ముఖేశ్‌ రోడ్డుపై వెళ్తుండగా అక్కడే మకాం వేసిన వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఇందులో వైసీపీ నేత కోటాల చంద్రశేఖర్‌రెడ్డి ఆలియాస్‌ చందు పాల్గొన్నారు. దాడి విషయం తెలుసుకున్న కూచివారిపల్లి టీడీపీ కార్యకర్తలు అక్కడకు వచ్చి గాయపడిన ముర ళినాయుడు, ముఖేశ్‌ను తిరిగి గ్రామానికి తీసుకెళ్లారు. తమపై మురళి ప్రతిదాడి చేస్తారన్న సమాచారం తెలుసుకున్న కోటాల చంద్రశేఖర్‌రెడ్డి, వైసీపీ కార్యకర్తలు కూచినపల్లి వెళ్లి టీడీపీ సానుభూతిపరులపై దాడులుచేయగా పదిమంది గాయపడ్డారు. ఇది తెలుసుకున్న మురళి బంధువులు, సమీప గ్రామాల టీడీపీ కార్యకర్తలు భారీగా కూచివారిపల్లికి చేరుకున్నారు. చంద్రశేఖర్‌రెడ్డిని టార్గెట్‌ చేయాలనుకున్నారు. దీంతో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తన అనుచరులతో.. కూచివారిపల్లి గ్రామ సమీపానికి వెళ్లారు. గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు వాహనాలను గ్రామం శివారులో ఉంచి ఊర్లోకి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడకు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కుమారుడు వినీల్‌ కూడా వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. మోహిత్‌ను రామిరెడ్డిపల్లికి తీసుకెళ్లారు. కూచివారిపల్లి శివారులో ఉన్న వాహనాలను తీసుకొచ్చేందుకు మోహిత్‌ తన డ్రైవర్‌, గన్‌మన్‌ను పంపించారు. ఆ సమయంలో ఓ గ్రూపు మోహిత్‌రెడ్డి వాహనాలను అడ్డుకుని తగలబెట్టింది. తర్వాత నాని నాయకత్వంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు, అనుచరులు భారీగా కూచివారిపల్లికి చేరుకున్నారు. కోటాల చంద్రశేఖరరెడ్డి ఇంటిపై దాడిచేసి తగులబెట్టారు. మరో రెండు వైసీపీ కార్యకర్తల వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసు బలగాలు వెళ్లి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం రామిరెడ్డిపల్లి, కూచివారిపల్లిలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి.’


14వ తేదీన ఏం జరిగిందంటే..

‘14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పులివర్తి నాని పద్మావతి మహిళా యూనివర్సిటీకి వచ్చారు. అక్కడ ఐదుగురు వ్యక్తులు ఆయన కారుపై కర్రలతో దాడిచేశారు. నాని గన్‌మన్‌పై కూడా దాడిచేశారు. అనంతరం పులివర్తి నాని భార్య సుధ సోషల్‌ మీడియాలో ఓ పిలుపిచ్చారు. దాంతో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, అనుచరులు వర్సిటీ మెయిన్‌ గేట్‌ వద్దకు వచ్చి ధర్నాకు దిగారు. ఓ గుంపు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ రెండు వాహనాలకు నిప్పుపెట్టింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రంగారెడ్డి అనే సీఐ తన వాహనంలో వర్సిటీలోకి వస్తుంటే 30 మంది అడ్డుకొని, ఇనుపరాడ్లతో ఆయన వాహనంపై దాడిచేశారు. ఆయన విధులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేశాం’.

ఇదేం సత్యశోధన..?

ఆర్డీవో నివేదికలోని ఇవే అంశాలను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ తన రిపోర్టులో నిర్ధారించారు. అయితే.. టీడీపీ ఏజెంట్‌ మురళిపై ఒకసారి పోలింగ్‌ కేంద్రం వద్ద, మరోసారి ఆయన స్వగ్రామం కూచివారిపల్లిలో వైసీపీ నేతలు దాడిచేశారు. కానీ ఆ గ్రామానికి మోహిత్‌రెడ్డి తన మనుషులతో ఎందుకు వెళ్లారన్నదే అసలు ప్రశ్న. తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న సమయంలో ఆ గ్రామానికి టీడీపీ అభ్యర్థి వెళ్తే అది జన సమీకరణగా.. వైసీపీ అభ్యర్థి వెళ్తే నిజాలను తెలుసుకునేందుకు వెళ్లినట్లుగా చూపడం.. అధికార పార్టీపై ఆయా అధికారులకున్న అవ్యాజ ప్రేమను తెలియజేస్తోంది. నిజానికి మోహిత్‌రెడ్డి వెళ్లారన్న సమాచారంతోనే నాని ఆ గ్రామానికి చేరుకున్నారు. మహిళా వర్సిటీలో నానిపై దారుణమైన దాడి జరిగింది. భారీ ఇనుపరాడ్లు, సుత్తులతో, బీరు బాటిళ్లతో, రాళ్లతో కారుపై దాడిచేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సమ్మెటతో నాని గన్‌మన్‌పైనా దాడిచేసి గాయపరిచారు. వాస్తవాలు ఇలా ఉంటే.. కేవలం ఐదుగురు నాని కారుపై కర్రలతో దాడిచేసినట్లుగా నివేదించడం సత్యశోధనే సిగ్గుపడేలా ఉంది. దాడి జరిగిన రోజే ఓ కార్‌ డా్‌షకామ్‌లో రికార్డయిన వీడియో బయటకొచ్చింది. అందులో వైసీపీ మూకల స్వైరవిహారం ఆర్డీవోకు, కలెక్టర్‌కు కనిపించలేదా? దాడి ఘటనపై పోలీసులు అరెస్టు చేసినవారు వైసీపీ నేతలే కదా! మరి ఐదుగురే దాడిచేసినట్లు కలెక్టర్‌ చెప్పడమేంటి? ఈ దాడితో వైసీపీకి సంబంధం లేదని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం కాదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పోలీసు వైఫల్యమే అసలు కారణం..

రామిరెడ్డిపల్లి పోలింగ్‌ కేంద్రం అత్యంత సమస్యాత్మక జాబితా లో ఉంది. పోలింగ్‌ రోజు గొడవ తర్వాత పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే.. ఇన్ని దారుణాలు జరిగి ఉండేవి కావు. టీడీపీ ఏజెంట్‌పై వైసీపీ నేతలు రెండుసార్లు దాడులు చేసింది చాలక.. వైసీపీ అభ్యర్థి దర్జాగా తన అనుచరుల్ని వెంటేసుకుని ఆ గ్రామానికి వెళ్లారు. ఇవన్నీ గొడవలను ప్రేరేపించే పరిణామాలేనని ఎస్పీకి కనిపించలేదా? దాడులు జరగొచ్చని, ఆ ప్రాంతం లో మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచనే రాలేదా? నిఘా విభాగం ఏమైంది? సమస్యాత్మక గ్రామమైన కూచివారిపల్లిలో దాడులు, ప్రతిదాడులు జరుగుతాయని, ఇరు పార్టీల అభ్యర్థులు అక్కడకు వెళ్తారని ముందుగా ఊహించలేకపోవడం పోలీసు వైఫల్యం కాదా? ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ దారుణాలు జరిగేవే కావని ఎన్నికల కమిషన్‌ కూడా అభిప్రాయపడింది. అందుకే ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ను బదిలీ చేసింది.

Updated Date - May 18 , 2024 | 04:55 AM