అనిల్ అంబానీపై సెబీ వేటు
ABN , Publish Date - Aug 24 , 2024 | 06:27 AM
పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీతో పాటు మరో 24 మందికి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ పెద్ద షాకిచ్చింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్) నిధుల మళ్లింపు వ్యవహారంలో ఆయనపై ఏకంగా రూ.25 కోట్ల జరిమానా
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు వ్యవహారంలో కఠిన చర్యలు
ఐదేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో
పాల్గొనకుండా నిషేధం
కుప్పకూలిన రిలయన్స్ గ్రూప్ షేర్లు
మరో 24 సంస్థలపైనా చర్యలు
రూ.25 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీతో పాటు మరో 24 మందికి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ పెద్ద షాకిచ్చింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్) నిధుల మళ్లింపు వ్యవహారంలో ఆయనపై ఏకంగా రూ.25 కోట్ల జరిమానా విధించింది. దీనికి తోడు ఆయన ఐదేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ కాలంలో అనిల్ ఏ లిస్టెడ్ కంపెనీలో గానీ, సెబీ వద్ద నమోదైన సంస్థల్లో గానీ ఎటువంటి డైరెక్టర్ లేదా కీలక మేనేజ్మెంట్ పదవులు (కేఎంపీ) చేపట్టకూడదని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు సమస్యల్లో ఉన్న అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం కథ ముగిసినట్టేనని భావిస్తున్నారు. భారత కార్పొరేట్ చరిత్రలో సెబీ ఒక పారిశ్రామికవేత్తపై ఇంత భారీగా జరిమానా విధించడం ఇదే మొదటిసారి. కాగా ఈ విషయంపై అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఇంతవరకు స్పందించలేదు.
ఇదీ కథ
అనిల్ అంబానీ.. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మన్‌గా తన పరపతిని ఉపయోగించి రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ బోర్డు పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, కంపెనీ నిధులను రుణాల పేరుతో తన నిర్వహణలోని అల్లాటప్పా కంపెనీలకు రూ.14,577.68 కోట్లు దారి మళ్లించినందుకు సెబీ ఈ చర్య తీసుకుంది. ఇందులో రూ.12,487.56 కోట్ల మొత్తాన్ని ఊరూ పేరు లేని 47 డొల్ల కంపెనీలకు మళ్లించారని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది. ఈ విషయంలో అనిల్ అంబానీకి సహకరించిన 24 సంస్థలపైనా ఐదేళ్ల నిషేధంతో పాటు రూ.21 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున మొత్తం రూ.625 కోట్ల భారీ జరిమానాలు విధించింది. ఆర్హెచ్ఎఫ్ఎల్పైనా ఆరు నెలల నిషేధంతో పాటు రూ.6 లక్షల జరిమానా విధించింది. మరోవైపు సెబీ కూడా 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ ఖాతాలను పరిశీలించి నిధుల మళ్లింపు నిజమేనని నిర్ధారించుకుంది. ఈ విషయంలో అనిల్ అంబానీకి అమిత్ బప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షా అనే వ్యక్తులు సహకరించినట్టు విచారణలో తేలింది.
గ్రూప్ షేర్లు ఢమాల్
తాజా పరిణామాలతో రిలయన్స్ గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. బీఎస్ఈలో రిలయన్స్ ఇన్ఫ్రా షేరు 10.07 శాతం నష్టంతో రూ.211.70 వద్ద ముగియగా ఎన్ఎస్ఈలో 10.91 శాతం నష్టంతో రూ.209.99 వద్ద క్లోజైంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేరు కూడా బీఎస్ఈ, ఎన్ఎసీల్లో 5 శాతం నష్టంతో రూ.4.46 వద్ద ముగిసింది. రిలయన్స్ పవర్ షేరు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఏకంగా లోయర్ సర్క్యూట్ బ్రేకర్‌ను తాకి వరుసగా రూ.34.48, రూ.34.45 వద్ద ముగిశాయి.
ఇతర సమస్యలు
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు తన నిర్వహణలోని రిలయన్స్ క్యాపిటల్‌తోనూ అనిల్ అంబానీ నిండా మునిగారు. రూ.24,000 కోట్ల విలువైన రుణ పత్రాలు చెల్లించలేక 2021లో ఈ కంపెనీ కూడా దివాలా తీసింది. ముంబైలో తొలి మెట్రో లైన్‌ను నిర్మించిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా ప్రస్తుతం రుణ పత్రాల బకాయిలు చెల్లించలేక ఆపసోపాలు పడుతోంది.
మసకబారిన చరిత్ర
తండ్రి ధీరూబాయ్ అంబానీ మరణానంతరం ఆస్తుల పంపకం దగ్గర అన్న ముకేశ్ అంబానీతో అనిల్ అంబానీ బాగానే గొడవ పడ్డారు. చివరికి కొంతమంది పెద్దల మధ్యవర్తిత్వంతో 2005లో ఇద్దరి మధ్య ఆస్తుల పంపకం ఒప్పందం కుదిరింది. టెలికాం, ఇంధనం, ఫైనాన్స్ రంగాలను అనిల్ తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ముకేశ్ అంబానీ పెట్రో రసాయనాలతో సరిపుచ్చుకున్నారు. ఆస్తుల పంపకం తర్వాత అనిల్ అంబానీ పెద్దఎత్తున తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇవేవీ కలిసి రాక చివరికి దాదాపు అన్ని సంస్థలు దివాలా తీశాయి. దీంతో 2008లో 4,200 కోట్ల డాలర్ల ఆస్తులతో ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న అనిల్ అంబానీ ఇప్పుడు కనీసం సోదిలో కూడా లేకుండా పోయారు. మరోవైపు అన్న ముకేశ్ అంబానీ మాత్రం టెలికాం, ఫైనాన్స్, రిటైల్ రంగాల్లోకి ప్రవేశించి ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగారు. రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్) కోసం ఎరిక్సన్ ఏబీ ఇండియా నుంచి తీసుకున్న రూ.550 కోట్ల అప్పు చెల్లించలేక పోవడంతో 2019లో సుప్రీంకోర్టు.. అప్పు చెల్లిస్తారా? లేక జైలుకు వెళతారా? అని అనిల్ అంబానీని హెచ్చరించింది. దాంతో తమ్ముడిని జైలు శిక్ష నుంచి రక్షించేందుకు, ముకేశ్ అంబానీ ఆ అప్పు తీర్చి అనిల్ అంబానీని ఆదుకున్నారు.