Share News

వాణిజ్య లోటు రూ.1.76 లక్షల కోట్లు

ABN , Publish Date - Jul 16 , 2024 | 05:24 AM

ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో సైతం దేశీయ ఎగుమతుల రంగం జూన్‌ నెలలో 2.56 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూన్‌ నెల ఎగుమతులు 3,520 కోట్ల డాలర్లుగా (రూ. 2.95 లక్షల కోట్లు) నమోదు కాగా...

వాణిజ్య లోటు రూ.1.76 లక్షల కోట్లు

ఎగుమతుల్లో వృద్ధి 2.5 శాతం

దిగుమతుల్లో వృద్ధి 5 శాతం

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో సైతం దేశీయ ఎగుమతుల రంగం జూన్‌ నెలలో 2.56 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూన్‌ నెల ఎగుమతులు 3,520 కోట్ల డాలర్లుగా (రూ. 2.95 లక్షల కోట్లు) నమోదు కాగా వాణిజ్య లోటు 2,098 కోట్ల డాలర్లకు (రూ.1.76 లక్షల కోట్లు) పెరిగింది. గత ఏడాది జూన్‌లో వాణిజ్య లోటు 1,919 కోట్ల డాలర్లుంది (రూ.1.61 లక్షల కోట్లు). కాగా దిగుమతులు 5 శాతం పెరిగి 5,618 కోట్ల డాలర్లకు (రూ.4.72 లక్షల కోట్లు) చేరాయి. సోమవారం వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్‌ నెలలో క్రూడాయిల్‌, పప్పులు, ఎలక్ర్టానిక్‌ వస్తువుల దిగుమతులు పెరిగాయి. ఇదిలా ఉండగా ఏప్రిల్‌-జూన్‌ నెలల మధ్య కాలంలో ఎగుమతులు 5.84 శాతం వృద్ధితో 10,996 కోట్ల డాలర్లకు (రూ.9.24 లక్షల కోట్లు) చేరుకోగా దిగుమతులు 7.6 శాతం పెరిగి 17,223 కోట్ల డాలర్లకు (రూ.14.47 లక్షల కోట్లు) చేరాయి. ఈ మూడు నెలల వాణిజ్య లోటు 5,616 కోట్ల డాలర్ల (రూ.4.72 లక్షల కోట్లు) నుంచి 6,226 కోట్ల డాలర్లకు (రూ.5.23 లక్షల కోట్లు) పెరిగింది.


ప్రస్తుత ధోరణిని చూసినట్టయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 80 వేల కోట్ల డాలర్ల (రూ.67.20 లక్షల కోట్లు) స్థాయిని దాటవచ్చని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ భర్త్వాల్‌ అంచనా వేశారు. ఇదిలా ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వస్తు సేవల మొత్తం ఎగుమతులు 20 వేల కోట్ల డాలర్లుగా (రూ.16.80 లక్షల కోట్లు) ఉన్నాయని ఆయన చెప్పారు. ఇంజనీరింగ్‌, ఎలక్ర్టానిక్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, కాఫీ, రసాయనాలు ప్రధానంగా ఎగుమతుల వృద్ధికి దోహదపడినట్టు తెలిపారు.


16 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

ఆహార వస్తువులు ప్రత్యేకించి కూరగాయలు, తయారీ వస్తువుల ధరలు పెరగడంతో జూన్‌ నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 3.36 శాతానికి దూసుకుపోయింది. ఇది 16 నెలల గరిష్ఠ స్థాయి. ద్రవ్యోల్బణం పెరగడం వరుసగా ఇది నాలుగో నెల. మే నెలలో ఇది 2.61 శాతం ఉండగా గత ఏడాది జూన్‌లో మైనస్‌ 4.18 శాతం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార వస్తువుల ధరలు 10.87 శాతం, కూరగాయల ధరలు 38.76 శాతం పెరిగాయి. ప్రత్యేకించి ఉల్లిపాయల ధర 93.35 శాతం, బంగాళాదుంప ధర 66.37 శాతం పెరిగింది. పప్పుల ధరల్లో 21.64 శాతం వృద్ధి చోటు చేసుకుంది. ఇవి కాకుండా పళ్ల ధర 10.14 శాతం, తృణధాన్యాల ధర 9.27 శాతం, పాల ధర 3.37 శాతం పెరిగాయి.

Updated Date - Jul 16 , 2024 | 05:24 AM