Congress: పూర్వవైభవం దిశగా కాంగ్రెస్
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:37 AM
రెండు వందల ఏళ్ళ ఆంగ్లేయుల పాలన నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన, ఆధునిక భావాలు కలిగిన పురాతనమైన కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం నేడు.
రెండు వందల ఏళ్ళ ఆంగ్లేయుల పాలన నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన, ఆధునిక భావాలు కలిగిన పురాతనమైన కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం నేడు. ముంబాయిలో 1885 డిసెంబర్ 28న గోకుల్ దాస్ తేజ్‌పాల్ సంస్కృత కళాశాలలో ఉమేష్ చందర్ బెనర్జీ అధ్యక్షుడిగా విశ్రాంత బ్రిటిష్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారి అలన్ అక్టేవియన్ హ్యూమ్ (ఏఓ హ్యూమ్) ప్రధాన కార్యదర్శిగా, దేశం నలుమూలల నుంచి వచ్చిన 72 మంది ప్రతినిధులతో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. 1920లో మహాత్మాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య పోరాటాన్ని అహింస మార్గంలో ఉధృతం చేసింది. తద్వారా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అధికారంలో ఉన్నా లేకున్నా జాతీయవాద, సామ్యవాద, లౌకికవాద, ప్రజాస్వామ్య భావజాలంతో దేశ సంపదను అందరికీ పంచాలనే లక్ష్యంతో ఇప్పటికీ పనిచేస్తున్న ఏకైక స్వాతంత్ర్యోద్యమ పార్టీ కాంగ్రెస్.
తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌ల వరకు సుస్థిర పాలన చేసింది. ఈ సమయంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా హరిత విప్లవం పేరుతో వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక విప్లవం పేరుతో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేశారు. విజ్ఞాన సమాచార సాంకేతిక విప్లవం పేరుతో దేశ శాస్త్ర విజ్ఞానాన్ని టెలికాం, కంప్యూటర్ పరిజ్ఞానంతో సమాచార సాంకేతిక రంగాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వాలు దోహదపడ్డాయి. దేశంలో గ్రామీణ పేద ప్రజల ఆకలిని తీర్చే ‘పనికి ఆహార పథకం’ వంటివి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. బ్యాంకుల జాతీయకరణ, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, భూసేకరణ చట్టాలు తెచ్చి పాలనలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అన్నది జగమెరిగిన సత్యం.
సామాజిక న్యాయం చేయడంలో దేశంలోని అన్ని పార్టీలకు ఆదర్శంగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి తొలిసారి దళితుడైన దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిని, అనంతరం అఖిల భారత పార్టీ అధ్యక్షునిగా రెండు పర్యాయాలు అవకాశమిచ్చింది. ఆనాటి నుంచి నేటి వరకు అదే సామాజిక స్పృహతో వ్యవహరిస్తూ నేడు దళితుడైన మల్లికార్జున్ ఖర్గేను అధ్యక్షుడిని చేసి రాజకీయాలపై అణగారిన వర్గాలకు ఆత్మవిశ్వాసం కల్పించింది. 140 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి 71 మంది అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియాగాంధీ 19 ఏళ్ళు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంకాగాంధీ కూడా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించడంతో కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు వచ్చాయి.
– కోటూరి మానవతారాయ్, టీపీసీసీ అధికార ప్రతినిధి