Share News

RK Kotha Paluku : మరీ ఇంత నీచమా

ABN , Publish Date - Nov 03 , 2024 | 12:16 AM

దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...

RK Kotha Paluku : మరీ ఇంత నీచమా
RK Kotha Paluku

దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి మినహా మిగతా అందరికీ పిల్లలు ఉన్నారు. చాలా మంది ముఖ్యమంత్రుల పిల్లలు ఎవరో, ఇప్పుడేం చేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో కూడా చాలా మందికి తెలియదు. మాజీ ముఖ్యమంత్రుల పిల్లల్లో ఒక్క జగన్మోహన్‌రెడ్డి మాత్రమే రాజశేఖర రెడ్డి వారసత్వంతో ముఖ్యమంత్రి కాగలిగారు. అదే సమయంలో రాజశేఖర రెడ్డి కుటుంబంలో మరే ఇతర మాజీ ముఖ్యమంత్రుల ఇళ్లలో జరగని విధంగా గొడవలు కూడా తార స్థాయికి చేరాయి. అధికారంతో పాటు సంపద కూడా పోగవడంతో పంపకాల్లో వివాదం ఏర్పడింది. అటు అధికారంలోనూ, ఇటు సంపద పంపిణీలోనూ అన్న జగన్మోహన్‌రెడ్డి తనకు న్యాయం చేయలేదన్న ఆవేదనతో చెల్లి షర్మిల రాజకీయంగా వేరు కుంపటి పెట్టుకున్నారు. ఏ పార్టీని అంటిపెట్టుకొని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో ఆ పార్టీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని ఆగ్రహించి జగన్‌రెడ్డి సొంత పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి కాగా, చెల్లి షర్మిల తన తండ్రి నమ్ముకున్న కాంగ్రెస్‌ పార్టీకే రాష్ట్ర అధ్యక్షురాలిగా ఇప్పుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఉన్న ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. తాను ఆశించిన రాజ్యసభ పదవి లభించి ఉంటే అన్నతో షర్మిల విభేదించి ఉండేవారు కాదు. వైసీపీలో తన పాత్ర లేకుండా పోవడానికి వదిన భారతి కారణం అన్నది షర్మిల భావన! అదే సమయంలో రాజశేఖర రెడ్డి సొంత తమ్ముడైన వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్‌ రెడ్డికి జగన్‌ దంపతులు వత్తాసు పలకడం కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంలో విభేదాలు భగ్గుమనడానికి ప్రధాన కారణమైంది. ఇప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం కూడా వచ్చిపడింది. దీంతో రాజశేఖర రెడ్డి భార్య శ్రీమతి విజయలక్ష్మి నోరు విప్పాల్సి వచ్చింది. కుటుంబ ఆస్తులలో జగన్‌, షర్మిలకు సమాన హక్కు ఉందని, అలా ఉండాలన్నది రాజశేఖర రెడ్డి ఆజ్ఞ అని ఆమె బహిరంగ లేఖ ద్వారా తేల్చి చెప్పారు. రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆస్తుల విషయంలో గానీ, మరే విషయంలో గానీ ఏమనుకున్నదీ చెప్పగలిగే సజీవ సాక్ష్యం విజయలక్ష్మి మాత్రమే. అయితే విజయలక్ష్మి చెప్పిన విషయాలతో జగన్మోహన్‌రెడ్డితో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్న వారు విభేదిస్తున్నారు. సోషల్‌ మీడియాలో పలువురు పోస్టులు, వీడియోల రూపంలో జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆస్తుల్లో వాటా ఉన్న మాట నిజమైతే షర్మిలపై కేసులు ఎందుకు లేవు? ఉమ్మడి ఆస్తులైతే ఎంఓయూ అవసరం ఏమిటి? వంటి ప్రశ్నలను లేవనెత్తడంతో పాటు షర్మిలను విలన్‌గా ప్రొజెక్ట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తర్వాత కూడా జగన్‌రెడ్డికి మద్దతుగా సోషల్‌ మీడియాలో అంతమంది నిలబడడం ఆశ్చర్యంగా ఉంది. దీన్నిబట్టి వారందరినీ జగన్‌రెడ్డి బాగా సంతృప్తిపరుస్తున్నట్టు భావించాలి. రాజశేఖర రెడ్డి భార్యగా, కుటుంబ పెద్దగా విజయలక్ష్మి చెప్పిన అంశాలతో కూడా జగన్‌ మద్దతుదారులు విభేదించడం ఆశ్చర్యం కలిగించింది.

అప్పట్లో ఏమి జరిగిందో చెప్పగలిగే అర్హత విజయలక్ష్మికి కాక మరెవరికి ఉంటుంది? రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు, తర్వాతా ఏం జరిగిందో ఆమెకు తెలియకుండా ఎలా ఉంటుంది? అయినా విజయలక్ష్మి చెబుతున్న దాంట్లో వాస్తవం లేనట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఆస్తులు ఎలా వచ్చాయి? అవి అక్రమ ఆస్తులా? సక్రమ ఆస్తులా? అన్న అంశాలు మరుగున పడిపోయాయి. అన్న, చెల్లెలు ఏ ఆస్తుల కోసం గొడవ పడుతున్నారో ఆ ఆస్తులన్నీ అక్రమ సంపాదన అంటూ సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా చార్జిషీట్లు కూడా దాఖలు చేశాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే క్విడ్‌ ప్రో కో అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్‌రెడ్డి అంతులేని సంపదను పోగేసుకున్నారని, పలు కంపెనీలు ఏర్పాటు చేశారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇందులో నిజం ఉందా? లేదా? అన్నది న్యాయస్థానంలో తేలాల్సి ఉంది. వ్యవస్థలను, వ్యక్తులను ప్రభావితం చేస్తుండటం వల్ల సదరు కేసులు విచారణకు నోచుకోకుండా మూలుగుతున్నాయి. జగన్‌రెడ్డి నిజంగానే అనితర సాధ్యమైన తెలివితేటలతో సదరు ఆస్తులను సమకూర్చుకొని ఉంటే విచారణలో జాప్యం జరగకుండా సహకరించి తాను నిర్దోషినని రుజువు చేసుకుంటే ఏ గొడవా ఉండదు. అలా జరగడం లేదంటేనే అనుమానాలు బలపడుతున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ కేసు విచారణ జరిగే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదని హైకోర్టు న్యాయమూర్తి స్వయంగా వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్రమాస్తులో, సక్రమాస్తులో నిర్ధారణ కాని ఆస్తుల పంపకాలపై అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఆస్తి పంపకాలలో కూతురికి అన్యాయం జరగడాన్ని జీర్ణించుకోలేని విజయలక్ష్మి నోరు విప్పారు.


అపార్థం చేసుకోవద్దు పెద్దమ్మా..

ఇప్పుడు విజయలక్ష్మి లేఖలోని అంశాల విషయానికి వద్దాం. ఆస్తులు ఎలా పంచుకోవాలో రాజశేఖర రెడ్డి స్పష్టంచేశారని విజయలక్ష్మి చెబుతున్నందున అలా ఎలా? అని అడిగే అర్హత ఇతరులకు, ముఖ్యంగా జగన్‌ మద్దతుదారులకు ఉండదు. షర్మిల వాదనలో పస లేదని రాజశేఖర రెడ్డి తోడల్లుడైన వైవీ సుబ్బారెడ్డి, అప్పటి ఆడిటర్‌, అవినీతి కేసుల్లో ఏ–2గా ఉన్న విజయసాయి రెడ్డితో జగన్‌రెడ్డి చెప్పించడంతో విజయలక్ష్మి రంగప్రవేశం చేశారు. ఇదీ నిజం అంటూ బహిరంగ లేఖ రాశారు. అయినా సోషల్‌ మీడియాలో జగన్‌ మద్దతుదారులు విజయలక్ష్మిపై కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి పిల్లలు ఎవరూ కూడా ఇలా ఆస్తుల కోసం కొట్టుకోలేదన్న విషయాన్ని జగన్‌ మద్దతుదారులు విస్మరిస్తున్నారు. విజయలక్ష్మి లేఖ తర్వాత ఆస్తుల్లో షర్మిలకు సమాన హక్కు ఉన్న పక్షంలో ఎంఓయూ రాసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందని వైసీపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. మామూలుగా అయితే ఇందులో లాజిక్‌ ఉంది. ఎంఓయూ అవసరం ఏమిటో తెలియాలంటే రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఏమనుకున్నారో, ఏం జరిగిందో తెలుసుకోవాలి. ముందుగా విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్న విషయాలు నిజం కాని పక్షంలో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వాటిని ఎందుకు ఖండించలేదో చెప్పాలి. ఎందుకంటే విజయలక్ష్మి చెప్పినవన్నీ అక్షర సత్యాలని ఆ ఇద్దరికీ తెలుసు. అందుకే వారు అబద్ధాలు చెప్పారని విజయలక్ష్మి అన్నప్పటికీ నోరు మెదపడం లేదు. షర్మిలకు వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా వైవీ సుబ్బారెడ్డి విలేఖరుల సమావేశం పెట్టిన తర్వాత.. ఆయన కుమారుడు విజయలక్ష్మి వద్దకు వెళ్లి ‘మా నాన్నను అపార్థం చేసుకోవద్దు పెద్దమ్మా. జగన్‌ వద్ద మేం జీతగాళ్లం మాత్రమే. మమ్మల్ని అర్థం చేసుకోండి’ అని చెప్పుకొన్నారు. ఇది నిజమో కాదో జగన్‌ మద్దతుదారులు తెలుసుకోవాలి. దీన్నిబట్టి ఎవరు చెబుతున్నది నిజమో? ఎవరి పక్షాన ధర్మం ఉందో? ఎవరు న్యాయం చేయాలనుకుంటున్నారో? ఎవరు అన్యాయం చేస్తున్నారో స్పష్టమవుతుంది.


సాయీ.. బిడ్డకు అన్యాయం జరగొద్దు!

రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం ఎందుకు జరగలేదన్నది ఇప్పుడు కీలకం. వాస్తవానికి 2004కు ముందు రాజశేఖర రెడ్డికి ఉన్న ఆస్తులను జగన్‌, షర్మిల మధ్య పంచారు. తంటా అంతా 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సమకూరిన ఆస్తుల విషయంలోనే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నెలకొల్పిన కంపెనీలు, సమకూర్చుకున్న ఆస్తులు జగన్‌రెడ్డి పేరు మీదనే ఎందుకున్నాయో ఆడిటర్‌గా ఉన్న విజయసాయి రెడ్డికి తెలుసు. ఒక దశలో విజయసాయి రెడ్డిని రాజశేఖర రెడ్డి పిలిపించుకొని ‘సాయీ.. ఆస్తులు, కంపెనీలు అన్నీ జగన్‌రెడ్డి పేరు మీదనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నావు? మా షర్మిల పరిస్థితి ఏమిటి? ఆమెకు కూడా సమానంగా వాటా ఉండాలి. నా భార్య విజయలక్ష్మి పేరిట ఆస్తులు ఏమీ వద్దు’ అని ఆయన స్పష్టంచేశారు. దీనికి విజయసాయి రెడ్డి బదులిస్తూ ‘ఇప్పుడు ఆస్తులు, కంపెనీలు షర్మిల పేరు మీదకు బదిలీ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. మొత్తం ఆస్తులు జగన్‌ పేరిట ఉన్నప్పటికీ అన్న జగన్‌ తన చెల్లి షర్మిలకు గిఫ్ట్‌గా ఎప్పుడైనా ఇవ్వవచ్చు’ అని చెప్పడంతో ‘అదేదో జాగ్రత్తగా చూడు. నా బిడ్డకు అన్యాయం జరగకూడదు’ అని రాజశేఖర రెడ్డి స్పష్టంచేశారు. ఇది నిజమో కాదో విజయసాయి రెడ్డి, జగన్‌రెడ్డి చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆస్తుల్లో పిల్లలు ఇద్దరికీ సమాన హక్కు ఉండాలన్నది రాజశేఖర రెడ్డి ఆజ్ఞ అని విజయలక్ష్మి తన లేఖలో స్పష్టంచేశారు. మనవళ్లు, మనవరాళ్లకు కూడా ఆస్తుల్లో సమాన హక్కు ఉండాలని రాజశేఖర రెడ్డి భావించేవారు. 2019లో అధికారంలోకి వచ్చే వరకు తల్లీ చెల్లితో జగన్‌రెడ్డి సఖ్యతగానే ఉన్నారు. ఆస్తుల పంపకాల ప్రస్తావన తేలేదు. ముఖ్యమంత్రి కాగానే ఆస్తులు పంచుకుందాం అన్న ప్రతిపాదన జగన్‌రెడ్డి తెర మీదకు తెచ్చారు. సదరు ఆస్తుల్లో షర్మిలకు వాటా లేని పక్షంలో పంపకాల ప్రస్తావనను జగన్‌ ఎందుకు తెచ్చారో, ఎంఓయూ ఎందుకు రాశారో చెప్పాలి కదా! రాజశేఖర రెడ్డి ఆజ్ఞ మేరకు షర్మిలకు సమాన హక్కు ఉన్నప్పటికీ ఆస్తుల్లో 40 శాతం మాత్రమే ఇస్తానని జగన్‌ ఎందుకు అడ్డం తిరిగారు? ఆస్తులను 55:45 శాతం నిష్పత్తిలోనైనా పంచమని విజయలక్ష్మి ప్రతిపాదించినా జగన్‌రెడ్డి అంగీకరించలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో 40 శాతం వాటాకే షర్మిల అంగీకరించాల్సి వచ్చింది. అప్పట్లో ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలుసుకొనే ప్రయత్నం చేయకుండానే పేటీయం బ్యాచ్‌తో పాటు జగన్‌రెడ్డి మద్దతుదారులుగా ఉంటున్న ఉన్మాద మూక విజయలక్ష్మి, షర్మిలను సోషల్‌ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు. జగన్‌రెడ్డి అతి మంచితనం వల్ల ఈ సమస్య వచ్చిందని విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు చెప్పడం వినడానికి కూడా రోతగా ఉంది.


ఆ రెంటిపైనే ప్రేమ!

జగన్‌రెడ్డికి నిజంగానే అంత వ్యాపార దక్షత ఉండి ఉంటే 2004కు ముందు కొత్త కంపెనీలు ఎందుకు ప్రారంభించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా! ఇబ్బడిముబ్బడిగా కంపెనీలు ఏర్పాటు కావడం, వాటిల్లోకి ఎవరెవరో పెట్టుబడులు పెట్టడం వెనుక చిదంబర రహస్యం చిత్రగుప్తుడు విజయసాయి రెడ్డికి తెలియదా? ఆస్తుల్లో వాటా ఉండి ఉంటే షర్మిలపై కేసులు ఎందుకు లేవో చెప్పాలి? అని ప్రశ్నిస్తున్న వారికి విజయసాయి రెడ్డే సమాధానం చెప్పగలరు. రాజశేఖర రెడ్డి కోరుకున్నట్టు సగం ఆస్తులను షర్మిల పేరిట విజయసాయి రెడ్డి ఏర్పాటు చేసి ఉంటే ఆమెపై కూడా కేసులు పెట్టి ఉండేవారు. జగన్‌రెడ్డి నిజంగా అంత మంచివాడైతే తుచ్ఛమైన ఆస్తుల కోసం రక్తం పంచుకుపుట్టిన చెల్లితో గొడవలకు దిగుతారా? సొంత తల్లి పైనే కోర్టుకు ఎక్కుతారా? కనీస వాస్తవాలు తెలుసుకోకుండా జగన్‌రెడ్డికి మద్దతుగా మాట్లాడిన వారు ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకుంటారు? సొంత తల్లి, చెల్లికి వ్యతిరేకంగా రోత మీడియాలో అడ్డమైన రాతలు రాయిస్తున్న జగన్‌రెడ్డి మంచివాడా? తన భార్యను కూడా బజారుకు ఈడుస్తారని తెలిస్తే రాజశేఖర రెడ్డి రోత మీడియా ఏర్పాటుకు అంగీకరించి ఉండేవారు కారు. జగన్‌రెడ్డికి రెండు విషయాల మీదనే ప్రేమ ఉంటోంది. ఒకటి అధికారం, రెండవది సంపద. ఇప్పుడు భార్య భారతి మీద కూడా అపరిమితమైన అనురాగం ఏర్పడింది. తల్లీ చెల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న జగన్‌రెడ్డిలో అతి మంచితనం ఉందంటే నమ్మేవారు ఉంటారా? ఉంటారులెండి.. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఒక వర్గం ప్రజలను విచక్షణతో ఆలోచించలేని స్థితికి తీసుకువెళ్లిన ఘనత జగన్‌రెడ్డి సొంతం. రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆయనకు కుడి భుజంగా మెలిగిన వారందరూ ఇప్పుడు జగన్‌రెడ్డితో ఎందుకు లేరు? అని ఆలోచించగలిగే శక్తి వారికి లేకుండా చేశారు. జగన్మాయతో రాష్ట్రంలో కొత్తగా ఉన్మాద మూక పుట్టుకొచ్చింది. పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నప్పుడల్లా తండ్రి రాజశేఖర రెడ్డి అవసరాన్ని జగన్‌రెడ్డి గుర్తిస్తారు. అందుకే తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజశేఖర రెడ్డి బొమ్మను వాడుతున్నారు. తన బిడ్డ జగన్‌ను ఆశీర్వదించమంటూ గతంలో విజయలక్ష్మి విడుదల చేసిన వీడియోలను తాజాగా సోషల్‌ మీడియాలో వదులుతున్నారు. రాజకీయంగా ఉపయోగపడినంత వరకే తల్లీ, తండ్రీ, చెల్లీ ఎవరైనా జగన్‌కు గుర్తుకువస్తారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తర్వాత కూడా జగన్‌రెడ్డి వైఖరిలో మార్పు రాకపోవడం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.


అదీ వైఎస్‌ స్థాయి.. మరి జగనెక్కడ?

జగన్‌ మనస్తత్వాన్ని విశ్లేషిస్తే ఆయన ఎలాంటి వారో తెలుస్తుంది. అలాంటి లక్షణాలు ఉన్న వారెవరూ మారరు. ఈ కారణంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కూడా గడవక ముందే ఉన్మాద మూకను ఉసిగొల్పారు. తుచ్ఛమైన ఆస్తుల కోసం తల్లీ చెల్లీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న జగన్‌రెడ్డి, ఆయన మద్దతుదారుల విషయంలో ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఇంకా ఎవరైనా జగన్‌రెడ్డిని అభిమానిస్తుంటే వారికంటే అమాయకులు ఎవరూ ఉండరు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను ఇక్కడ గుర్తుచేసుకుందాం. రాజకీయంగా అండగా ఉన్న మరో పార్టీకి చెందిన నాయకుడికి ఇంత డబ్బు పంపు అని రాజశేఖర రెడ్డి తన ఆత్మబంధువు కేవీపీకి సూచించారు. ఆ మొత్తం ఎంతో విని కేవీపీ రామచంద్రరావు అంతెందుకు అని ప్రశ్నించగా ‘మనమేమైనా మట్టి పని చేసి సంపాదించామా? అధికారంలో ఉన్నందుకు డబ్బు వచ్చి పడుతోంది. చెప్పినట్టు చెయ్యి’ అని స్పష్టంచేశారు. మరో సందర్భంలో ఒకాయన తన కుమార్తె వివాహ పత్రికను అందించడానికి రాజశేఖర రెడ్డిని కలిశారు. శుభలేఖ అందించి బయటకు వచ్చిన కొద్దిసేపటికి ఆయనను కేవీపీ కలిసి ‘మీ అమ్మాయి అయినా మా అమ్మాయి అయినా ఒకటే. పెళ్లి ఘనంగా జరిపించడానికి ఎంత కావాలో చెప్పండి’ అని రాజశేఖర రెడ్డి తరఫున అడిగారు. దీనికి ఆయన ఉబ్బితబ్బిబ్బైనప్పటికీ మృదువుగా తిరస్కరించారు. అలాంటి రాజశేఖర రెడ్డి ఎక్కడ? ఆస్తుల కోసం తల్లీ చెల్లీ అని కూడా చూడకుండా వారిని బూతులు తిట్టిస్తున్న జగన్‌రెడ్డి ఎక్కడ? తమాషా ఏమిటంటే తమ కుటుంబంలో ఆస్తుల వివాదం ఏర్పడటానికి చంద్రబాబు కారణమని జగన్‌ అండ్‌ కో తాజాగా ప్రచారం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి మరణానికి కారణమైన చంద్రబాబుతో తల్లీ చెల్లీ చేతులు కలిపారని బురద చల్లిస్తున్నారు.


చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తారని విమర్శించేవారు ఉన్నారు కానీ హత్యా రాజకీయాలు చేస్తారని ఆయన ప్రత్యర్థులు కూడా చెప్పలేరు. రాజశేఖర రెడ్డి మరణానికి సోనియాగాంధీ కారణమని కొంతకాలం, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కారణం అని మరికొంత కాలం ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందిన జగన్‌రెడ్డి ఇప్పుడు చంద్రబాబును ఎంచుకున్నారు. చంద్రబాబుతో షర్మిల, విజయలక్ష్మి చేతులు కలిపారని నిందించడానికి కూడా జగన్‌రెడ్డి వెనుకాడటం లేదు. రాజశేఖర రెడ్డి కుటుంబంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకు దివంగత నేత ఆత్మబంధువులు, ఆయన అంటే పడి చచ్చేవారు తీవ్రంగా కలత చెందుతున్నారు. జగన్‌రెడ్డి నైజం తెలుసు కనుకే వారెప్పుడూ జగన్‌ అధికారంలో ఉండగా దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడలేదు. జగన్‌రెడ్డి ఎలాంటి వాడో తెలుసు కనుకే రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఏర్పడిన విభేదాలలో మధ్యవర్తిత్వం నెరపడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తే చాలు అని అంటారు. అలాంటిది జగన్‌ మనస్తత్వం ఎలాంటిదో చెప్పే సంఘటనలు ఇన్ని జరిగినా, జరుగుతున్నా మేధావులుగా, విశ్లేషకులుగా ప్రచారం చేసుకుంటున్న కొందరు ఇప్పటికీ అతనికి మద్దతుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం వింతగానే ఉంది. ఇలాంటి వారి వల్ల చంద్రబాబుకు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలియదు గానీ, రాష్ట్రానికి మాత్రం కచ్చితంగా ఎంతో కొంత నష్టం జరిగి తీరుతుంది. ప్రజా జీవితంలో ఉండే అర్హత లేని వ్యక్తులకు బాసటగా నిలవడం చరిత్రాత్మక తప్పిదం అవుతుంది. జగన్‌రెడ్డి వంటి వారు ప్రజా జీవితంలో ఉండటానికి అర్హులా? అన్న విషయమై ఇప్పుడు చర్చ జరగాలి. విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నట్టు అన్నా చెల్లెళ్ల మధ్య వివాదాలు సమసిపోయి సామరస్యం నెలకొనవచ్చు. అయితే ప్రస్తుతానికి రాజశేఖర రెడ్డి కుటుంబం పరువు బజారున పడింది. జగన్‌రెడ్డి ఎలాంటివారో తెలుసుకొనే అవకాశం ప్రజలకు మరో మారు వచ్చింది. అప్పనంగా వచ్చిపడిన ఆస్తుల కోసం జగన్‌రెడ్డి ఇంత దిగజారాలా? కుటుంబ సభ్యుల మధ్య ఇంత రాద్ధాంతం అవసరమా? అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడకుండా ఉంటుందా? తన బెయిల్‌ రద్దు కావడం కోసం చంద్రబాబుతో షర్మిల, విజయలక్ష్మి చేతులు కలిపారని దిక్కుమాలిన ప్రచారం చేసే బదులు తల్లి సమక్షంలో అంగీకరించి సంతకాలు చేసిన 40 శాతం ఆస్తులను సక్రమంగా పంపిణీ చేస్తే ఏ గొడవా ఉండదు కదా? బెంగళూరులోని యలహంక ఆస్తిని చెల్లికి ఇస్తున్నట్టు ఎంఓయూలో అంగీకరించిన జగన్‌రెడ్డి అక్కడ నిర్మితమైన ప్యాలెస్‌లో ఎందుకు ఉంటున్నారో చెప్పాలి. ఇదంతా నా కష్టార్జితం అని జగన్‌రెడ్డి భావిస్తే అది సక్రమమా? అక్రమమా? అన్నది ఇవాళ కాకపోయినా రేపైనా న్యాయస్థానాలు నిర్ణయించకపోవు. నిజానికి జగన్‌ అనుభవిస్తున్న ఆస్తులు ఆయన స్వార్జితం కావు. అవి ప్రజల సొత్తు. ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. ఈ ఆస్తుల వివాదం చినికి చినికి గాలివానగా మారి అసలుకే మోసం తేవొచ్చు. అందుకే జగన్‌రెడ్డి ఇప్పటికైనా దురాశకు పోకుండా చెల్లి షర్మిలకు న్యాయం చేస్తే మంచిది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే రాజశేఖర రెడ్డి ఆత్మ కచ్చితంగా ఘోషిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి కూడా లభించదు. జయంతి, వర్ధంతికి సమాధిని ఘనంగా అలంకరించి నివాళులు అర్పించడం కాదు.. రాజశేఖర రెడ్డి పరువు తీస్తున్నానన్న స్పృహతో జగన్‌రెడ్డి వ్యవహరించడం కుమారుడిగా ఆయన బాధ్యత. భౌతిక సంపదను పోయేటప్పుడు ఎవరూ తమతో తీసుకెళ్లరు. కొడుకు ప్రవర్తన చూసి రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి తాను ఎందుకు జీవించి ఉన్నానా? అని చింతించే పరిస్థితి ఏర్పడకూడదని ఆశిద్దాం. అయితే తోటకూర దొంగిలించిన నాడే దండించి ఉంటే జగన్‌రెడ్డి ఇప్పుడు ఇలా తయారై ఉండేవారు కాదు. సంపద కోసం రక్తసంబంధాలను తెగదెంపులు చేసుకోవడానికి కూడా వెనుకాడని జగన్‌రెడ్డి ప్రజా జీవితంలో కొనసాగడానికి అర్హుడా? తల్లీ చెల్లిని కూడా ఆస్తుల కోసం వదులుకున్న జగన్‌కు ప్రజా జీవితంలో కొనసాగే అర్హత ఉంటుందా? ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ కఠోర సత్యాన్ని మరచిపోరని ఆశిద్దాం!

ఆర్కే


2-Ed.jpg

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - Nov 03 , 2024 | 08:47 AM