Share News

RK Kothapaluku : తీతువు పిట్టల్లా లొల్లి..!

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:16 AM

అమంగళం ప్రతిహతం అవుగాక! మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా సిద్ధమే అని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పడంతో వైసీపీకి చెందిన పలువురు ‘మాయాబజార్‌’ చిత్రంలో శకుని చెప్పిన ఈ...

RK Kothapaluku : తీతువు పిట్టల్లా లొల్లి..!

అమంగళం ప్రతిహతం అవుగాక! మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా సిద్ధమే అని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పడంతో వైసీపీకి చెందిన పలువురు ‘మాయాబజార్‌’ చిత్రంలో శకుని చెప్పిన ఈ డైలాగ్‌ను గుర్తు చేసుకున్నారు. జగన్‌రెడ్డి మాటల్లో ఈ మధ్య తడబాటు కనిపిస్తోంది. తాను మళ్లీ అబద్ధాలు చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవాడినని ఆయన చెప్పుకోవడంతో వైసీపీ నాయకులు ఆశ్చర్యపోయారు. ఈ మాటకు అర్థాలు తీస్తే 2019 ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పడం వల్లనే అధికారంలోకి వచ్చామని ఆయన చెప్పకనే చెప్పారని సరిపెట్టుకున్నారు. రాజకీయాల్లో అబద్ధాలు చెప్పడం సహజమేగానీ ఇలా అసంకల్పితంగా నిజాలు చెప్పుకొంటే ఎలా అని విస్తుపోతున్నారు. ఆడిన మాట తప్పని సత్య హరిశ్చంద్రుడిని అని చెప్పుకోవడానికి జగన్‌రెడ్డి ఈ మాట అని ఉండవచ్చుగానీ, ఫలితంగా అతడి అంతరంగం ఆవిష్కృతమైంది. వాస్తవానికి జగన్‌రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు అలవోకగా ప్రవహిస్తాయి. 2019 ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసత్యాలే పునాదులుగా ఆయన రాజకీయాలు సాగాయి. తాజా వ్యాఖ్యలతో ఆయన గతంలో చెప్పిన అబద్ధాలను ప్రజలు మళ్లీ గుర్తు చేసుకున్నారు. దీంతో తలలు పట్టుకోవడం వైసీపీ నాయకుల వంతైంది. ‘‘వచ్చే ఎన్నికల తర్వాత కూడా ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధమే కానీ అబద్ధాలు మాత్రం చెప్పను’’ అని జగన్‌రెడ్డి చెప్పుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా విస్తుపోయారు.


మరి... నిజం చెప్పాలి కదా!

వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమకూర్చుకున్న ఆస్తులలో తన కుమార్తె షర్మిలకు కూడా సమాన వాటా ఉండాలని, తన భార్య విజయలక్ష్మికి వాటా అవసరం లేదని ఆడిటర్లకు ఆయన సూచించడం వాస్తవమో కాదో జగన్‌రెడ్డి స్పష్టం చేయాలి. వాస్తవమే అయితే ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారో చెప్పాలి కదా! తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వందల, వేల కోట్ల పెట్టుబడులను సేకరించి, సొంత మీడియాను ఏర్పాటు చేసుకొని కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు మీడియా లేదని చెప్పుకోవడం అబద్ధం కాదా? రోత మీడియా తనది కాకపోతే తన భార్య భారతీరెడ్డి దానికి చైర్‌పర్సన్‌ ఎలా అవుతారో, మెజారిటీ షేర్లు తన పేరిట, తన కంపెనీల పేరిట ఎలా ఉంటాయో వివరించాలి కదా! సొంత బాబాయ్‌ వివేకానందరెడ్డిని హత్య చేసింది, చేయించిందీ ఎవరో తెలిసి కూడా ఆ నెపాన్ని చంద్రబాబు మీదకు నెట్టడానికి ప్రయత్నించింది నిజం కాదా? 2019కి ముందు కోడి కత్తితో దాడి చేయించుకొని, అది కూడా చంద్రబాబు పనేనని ప్రచారం చేయించి రాజకీయ లబ్ధి పొందడం నిజం కాదని చెప్పగలరా? అవినీతి కేసులలో తండ్రి రాజశేఖర రెడ్డి పేరు చేర్పించి తాను తప్పించుకోవాలని ప్రయత్నించడం నిజం కాదా? అమరావతిలోనే రాజధాని ఉంటుందని, అందుకే అక్కడ ఇల్లు కట్టుకున్నానని ఎన్నికలకు ముందు చెప్పడం నిజం కాదా? ఎన్నికల తర్వాత మూడు రాజధానులు అని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్యాలెస్‌లు నిర్మించుకోవాలనుకోవడంలో నిజం లేదా? అధికారం ఇస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి... అత్యంత నాసిరకం మద్యాన్ని ప్రజలకు విక్రయించి అక్కడ కూడా డబ్బు సంపాదించుకొనే నీచానికి ఒడిగట్టింది ఎవరో జగన్‌రెడ్డి చెప్పగలరా? ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో! ‘నువ్వు అబద్ధమాడితే బాగుండు అని ఎవరైనా చెబితే... లేదు, ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా సిద్ధమే. కానీ, అబద్ధం మాత్రం చెప్పలేను’ అని చెప్పడమే పెద్ద అబద్ధం కదా?


మరవగలమా మీ పాలన...

అబద్ధాల విషయం అలా ఉంచితే, ప్రజలు తన పాలనను ఎక్కడ మరచిపోతారోనని జగన్‌రెడ్డి గుర్తు చేస్తున్నారు. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువని అంటారు. అందుకే తాము ఓడించిన పార్టీలనే ఐదేళ్ల తర్వాత ఆశీర్వదిస్తుంటారు. అయితే 2029 ఎన్నికల తర్వాత కూడా ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధమైనందునే జగన్‌రెడ్డి తన రాక్షస పాలనను తానే ప్రజలకు పదే పదే గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక, మద్యం వ్యవహారాల్లో ఏదో జరిగిపోతోందని చెబుతూ తన దోపిడీని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులు, వేధింపులు పరాకాష్ఠకు చేరాయని, నాలుగు నెలలకే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని చెబుతూ తన పాలనను మళ్లీ మళ్లీ ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ వేధింపులే అజెండాగా పాలన సాగించి చంద్రబాబును జైల్లో పెట్టే వరకు శాంతించని తనను ప్రజలు ఎక్కడ మరచిపోతారోనని గుర్తు చేస్తూనే ఉన్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో సరికొత్త రికార్డులు నెలకొల్పడం ద్వారా తన ప్రత్యర్థులపైకి ఉసిగొల్పిన జగన్‌రెడ్డి అప్పుడు ఏం జరిగిందో గుర్తు చేస్తున్నారు. జగన్‌రెడ్డి గతంలో చెప్పినవన్నీ అబద్ధాలని తెలుసుకోవడం వల్లనే ప్రజలు తాజా ఎన్నికల్లో ఆయన పార్టీని పదకొండు సీట్లకే పరిమితం చేయడం మాత్రం సత్యం. చంద్రబాబు ప్రభుత్వం జగన్‌రెడ్డి అడుగుజాడల్లో నడవడం లేదు. అయినా అధికారంలో ఉన్నప్పుడు తానేం చేశానో, ఎంత అరాచకంగా ప్రవర్తించానో గుర్తు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారా అన్నట్టుగా జగన్‌రెడ్డి వ్యాఖ్యలు ఉంటున్నాయి. అబద్ధాలే పునాదులుగా అధికారంలోకి వచ్చిన వ్యక్తి తాను అబద్ధాలే ఆడనని చెప్పుకోవడం వింతగా ఉన్నప్పటికీ... అతగాడి మనస్తత్వానికి ఆ మాటలు అద్దం పట్టడం లేదా? ప్రజల జ్ఞాపకశక్తి తక్కువే అయివుండవచ్చునుగానీ తమరి పాలనను ప్రజలు అంత తొందరగా ఎలా మరచిపోగలరు? జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనను ఒక పీడ కలగా ప్రజలు గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. ఆ రాక్షస పాలనను మరచిపోదామన్నా మరచిపోలేని పరిస్థితి! ప్రతిపక్ష నాయకుడి స్థాయి నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరికీ స్వేచ్ఛ లేకుండా జగన్‌రెడ్డి పాలన సాగింది. అప్పట్లో ఎవరైనా స్వేచ్ఛగా ఫోన్లలో మాట్లాడుకోగలిగారా? జగన్‌రెడ్డి సొంత మనుషులు, కలెక్షన్‌ ఏజెంట్లు కూడా ఫోన్లలో స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగారా? లేదే! ‘మీరు ఎవరెవరితో మాట్లాడేదీ, మీకు వచ్చే మెసేజులు అన్నీ నాకు తెలుస్తాయి’ అని తన అంతరంగికులలో ఒకరిని జగన్‌రెడ్డి హెచ్చరించడం నిజం కాదా? ఇప్పుడు చంద్రబాబు పాలన ఎలా ఉన్నది, ఎలా ఉండబోతున్నది అన్న విషయం పక్కన పెడితే... ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారు. ఫేస్‌ టైం, సిగ్నల్‌ వంటి యాప్‌ల అవసరం లేకుండా ఫోన్లలో మామూలుగా మాట్లాడుకోగలుగుతున్నారు. ప్రజలకు కనీస స్వేచ్ఛ లేకుండా సాగించిన పాలన కూడా పాలన అవుతుందా? కాదు.. కాజాలదు!


హవ్వ... ఆ నోట ఈ మాటా!

అధికారం ఉన్నది సొంత ఆదాయం పెంచుకోవడానికి మాత్రమే అని నమ్మి ప్రభుత్వ వనరులను కొల్లగొట్టి, నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జగన్‌రెడ్డి ఇప్పుడు ప్రవచనాలు చెబుతున్నారు. సత్యహరిశ్చంద్రుడే జీవించి ఉంటే... ‘నేను అబద్ధాలు చెప్పను’ అనే జగన్‌ మాటలు విని సిగ్గుతో చచ్చిపోయేవారేమో! పురాణాల్లో పౌండ్రక వాసుదేవుడి గురించి చెప్పారుగానీ ఇలాంటి అపర సత్యహరిశ్చంద్రుడి గురించి చెప్పలేదు. నోరు తెరిస్తే అబద్ధాలు మాత్రమే చెప్పే జగన్‌రెడ్డి వంటి కేరెక్టర్లు కూడా ఉంటాయని ఎవరూ ఊహించి ఉండరు. కొంత మంది నోటి వెంట కొన్ని మాటలు వింటే వినసొంపుగా ఉంటాయి. జగన్‌రెడ్డి వంటి వారు నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయత వంటి మాటలు వల్లెవేస్తే వినడానికే రోతగా ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి ప్రజలను అడుక్కునే వారి స్థాయికి దిగజార్చడం ద్వారా అధికారాన్ని అంటిపెట్టుకోవాలని చూసిన జగన్‌రెడ్డి కుయుక్తులను ప్రజలే తిప్పికొట్టారు. సంక్షేమం పేరిట ప్రజలకు డబ్బు పంచిపెట్టినా ఎన్నికల్లో తనకు ఓటమి ఎందుకు ఎదురైందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా ‘నేను అబద్ధం చెప్పను’ అని చెప్పుకోవడం ఆత్మవంచన కాదా? ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా సిద్ధమేగానీ అబద్ధాలు మాత్రం చెప్పనని జగన్‌రెడ్డి అన్నప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంత మంది చప్పట్లు కొట్టడం చూస్తే వైసీపీలో ఇంకా ఉన్మాదుల సంఖ్య తగ్గలేదనిపిస్తోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో నివసించడమేమిటి? అని ప్రశ్నించిన జగన్‌రెడ్డి ఇప్పుడు తాను బెంగళూరులోని ప్యాలెస్‌లో ఎందుకు సేదదీరుతున్నారో చెప్పాలి. ఇదంతా కాదుగానీ నిత్యం బైబిల్‌ పఠనం చేస్తానని చెప్పే జగన్‌రెడ్డి... బైబిల్‌ చేత పట్టి ఏసు ప్రభువు సమక్షంలో ఆత్మపరిశీలన చేసుకుంటే తత్వం బోధపడుతుంది. అయినా మన పిచ్చిగానీ ఏసుప్రభువును కూడా తన స్వార్థానికి వాడుకుంటున్న విషయం అతనికి తెలియదా? అలాంటి వారిలో పరివర్తన రావాలనుకోవడం అమాయకత్వమే అవుతుంది. అరాచక మనస్తత్వంతో పాలించడం దైవ ప్రేరణ ఎలా అవుతుంది? ఇతరులను ప్రేమించడం గురించి చెప్పిన బైబిల్‌ పైశాచికంగా ప్రవర్తించమని బోధించలేదే?


గతం మరిచిపోయి కథలు

అధికారంలో ఉన్నప్పుడు చెయ్యాల్సిన దురాగతాలన్నీ చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి, పోలీసుల వేధింపుల గురించి వైసీపీ మూక మాట్లాడటం జుగుప్సాకరంగా ఉంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి బోసడీకే అని తిట్టడం వల్ల తమ కార్యకర్తల రక్తం మరిగి, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే చేసి ఉండవచ్చునని సజ్జల రామకృష్ణారెడ్డి అనే మాజీ జర్నలిస్టు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు తనను విచారణకు పిలవడం ఏమిటి? అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. బోసడీకే అన్న పదం వాడినందుకే రక్తం మరిగి దాడులు చేసే పరిస్థితి ఉంటే, చంద్రబాబు ధర్మపత్నిని నిండు సభలో దారుణంగా అవమానించి వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు అవతలి వారి రక్తం ఇంకెంత మరగాలి? తన సతీమణిని అవమానించడంతో తట్టుకోలేక చంద్రబాబు బోరున విలపించారేగానీ కత్తులు, కర్రలు తీసుకొని వెళ్లమని కార్యకర్తలను ఉసిగొల్పలేదే? బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి తిట్టిన తిట్లను ఎవరైనా మరచిపోగలరా? ఇళ్లలోని ఆడవాళ్లకు కూడా మినహాయింపు లేకుండా దారుణంగా దూషించినా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అభిమానులుగానీ రెచ్చిపోలేదే? అది వారి సంస్కారం. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, జోగి రమేశ్‌, రోజా వంటి వారి మాటలు, వాడిన భాష విన్నప్పుడు రక్తం మరగదా? ఇళ్లలోని ఆడవాళ్లను సైతం బజారుకు ఈడ్చిన వాళ్లను ఏం చేయాలి? జగన్‌రెడ్డిలో ఉన్న లక్షణాల్లో పదోవంతు చంద్రబాబులో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పోలీసు విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి గంటల వ్యవధిలోనే బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని సమర్థించుకోగలిగేవారా? ఎంపీ అని కూడా చూడకుండా రఘురామకృష్ణ రాజును పోలీసులతో చితగ్గొట్టించిన విషయం మరచిపోతే ఎలా? పోలీసు ఉన్నతాధికారులైన పి.సునీల్‌ కుమార్‌, పీఎస్సార్‌ ఆంజనేయులు, రఘురామిరెడ్డి కిరాయి సైనికులుగా మారి చేసిన దురాగతాలను సజ్జల మరచిపోయినా ప్రజలు మరచిపోతారా? జగన్‌రెడ్డి రోత మీడియాపై పోలీసులు ఒక కేసు పెట్టినందుకే ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ అంటూ పెడబొబ్బలు పెడుతున్నారే? నిన్నటిదాకా మీరు చేసిందేమిటి? రఘురామకృష్ణరాజుతోపాటు నాపైనా, మా సహచరులపైనా దేశద్రోహం కేసు పెట్టిన విషయం మరిచారా? ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలపై సీఐడీ అధికారులు ఎన్నో కేసులు పెట్టారు కదా! ఆ కేసులలో మా సిబ్బంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదా? రోత పత్రికపై కేసు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని... జగన్‌రెడ్డి దయవల్ల ఐదేళ్ల పాటు మీడియా సలహాదారు పదవిలో కొనసాగిన దేవులపల్లి అమర్‌ అనే జర్నలిస్టు నాయకుడు ఇప్పుడు అంటున్నారు. ఆయనకు అప్పుడు పత్రికా స్వేచ్ఛ కనిపించలేదా? ‘ప్రచురించిన వార్తల విషయమై ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే వివరణ ఇవ్వాలి! సదరు వివరణను ప్రచురించకపోతే పరువు నష్టం దావా వేసుకోవచ్చునుగానీ కేసులు పెట్టడం ఏమిటి?’ అని ఇప్పుడు ప్రవచనాలు చెప్పడం ఏమిటి? ఇదే సలహా జగన్‌రెడ్డి ప్రభుత్వానికి మీడియా సలహాదారుడిగా ఎందుకివ్వలేదు? మాపై కేసులు పెట్టినప్పుడు ప్రభుభక్తి మత్తులో దేవులపల్లి అమర్‌ నిద్రపోయారా? ఐదేళ్ల పాటు శాసనసభ కార్యక్రమాలను ప్రసారం చేయకుండా ఏబీఎన్‌పై నిషేధం విధించడాన్ని మరచిపోతే ఎలా? ముఖ్యమంత్రి కార్యాలయానికి, నివాసానికి వెళ్లకుండా ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులపై నిషేధం విధించడాన్ని ఏమనాలి? రోత మీడియాతోపాటు మరో రెండు కూలి మీడియా చానళ్ల ప్రసారాలను ఇప్పుడు అడ్డుకోవడంపై పెడబొబ్బలు పెడుతున్నారే! మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏబీఎన్‌తో పాటు టీవీ5 ప్రసారాలను ఐదేళ్లపాటు అడ్డుకోలేదా? కర్మ మనల్ని వదలదు– తప్పు ఎవరు చేసినా తప్పే! జగన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన ఈ దురాగతాలను అప్పుడు ఖండించి ఉంటే ఇప్పుడు ఎవరికైనా ఏడ్చే అర్హత, హక్కు వచ్చి ఉండేవి. అప్పుడు ప్రభువు కళ్లలో ఆనందం చూసి నోళ్లకు తాళం వేసుకున్న వాళ్లు ఇప్పుడు తీతువు పిట్టల్లా లొల్లి చేసినా లాభం లేదు. మీరు ఏం చేశారో ప్రజలు మరచిపోలేదు కనుకే ఇప్పుడు జరుగుతున్న దాన్ని కూడా పట్టించుకోవడం లేదు.

తగిన శాస్తి జరిగిందని సరిపెట్టుకుంటున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇప్పుడు కూలి మీడియాగా మారిన ఒక చానల్‌ ప్రసారాలను కొద్ది రోజులు ఆపించడంతో అలా చేయడం తప్పు అని నేను స్వయంగా ముఖ్యమంత్రికి చెప్పగలిగాను. ఏబీఎన్‌, టీవీ5 ప్రసారాలను ఐదేళ్లపాటు నిలిపివేసినా మాట్లాడని వారు ఇప్పుడు తమకు అన్యాయం జరిగిందని రోదించే అర్హత కోల్పోయారు. దుష్ట సంప్రదాయాలకు తలపడితే దాని పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. మీడియాపై పోలీసు కేసు పెట్టడమేమిటి? అని రోత మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ‘ఐదేళ్లుగా ఏం జరిగిందో నేను చూశాను. అప్పుడు ఎలా ఏం చేశారో ఇప్పుడు అలాగే చేశాం. అంతా చట్టప్రకారమే జరుగుతోంది. ఇందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు’ అని డీజీపీ ద్వారకా తిరుమలరావు కూల్‌గా బదులిచ్చారు.


అందుకు సంతోషించండి...

ఇప్పుడు పోలీసు కేసులు, వేధింపులు, పత్రికా స్వేచ్ఛ అంటూ జగన్‌ అండ్‌ కోతో పాటు కొంత మంది వారి తాబేదార్లు గగ్గోలు పెట్టడం చూస్తే కౌరవ మూక హాహాకారాలను వింటూ ‘ఆర్తనాదాలు శ్రవణానందకరంగా ఉన్నాయి’ అని మాయాబజార్‌ చిత్రంలో ఘటోత్కచుడు చెప్పిన డైలాగ్‌ గుర్తుకొస్తుంది. జగన్‌రెడ్డి సాగించిన అరాచకాల ప్రభావం ఇప్పట్లో తొలగిపోదు. జగన్‌రెడ్డికి 2019లో లభించిన మెజారిటీ కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎక్కువ మెజారిటీ వచ్చింది. అయినా గతంలో జరిగిన వాటిని, రెడ్‌ బుక్‌లో రాసుకున్న వాటిని గుర్తుకు తెచ్చుకొని తాడూ బొంగరం లేని కేసులు పెట్టి వేధించనందుకు సంతోషించకుండా గగ్గోలు పెట్టడం అస్సలు బాగోలేదు. చంద్రబాబుకు జగన్‌ పూనితే పరిస్థితి ఏమిటో మీకే తెలుస్తుంది. అలా జరగడం లేదు కనుకే స్వేచ్ఛగా ప్రవచనాలు చెప్పుకోగలుగుతున్నారు. సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సంయమనం కోల్పోవడం లేదు. తప్పులు చేయడంలో కూడా హద్దులు మీరిన వారిని కూడా చట్టప్రకారమే శిక్షించాలనుకుంటున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి అవాకులు చవాకులు పేలినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రక్తం ఎంత మరగాలి? ప్రజలు అధికారం ఇచ్చింది కక్ష సాధింపులకు కాదు కదా అని అటు చంద్రబాబు, ఇటు పవన్‌ కల్యాణ్‌ నమ్ముతున్నందున వైసీపీ మూక స్వేచ్ఛగా తిరగగలుగుతోంది. కొంత మంది వ్యక్తులపై కేసులు పెడుతున్నా, పాత కేసులలో దర్యాప్తు వేగం పెరుగుతున్నా అదంతా చట్ట పరిధిలోనే జరగాలనుకుంటున్నారు. అనాగరికంగా ఆలోచించేవారే అయితే బూతులకు పేటెంట్‌ తీసుకున్న కొడాలి నాని వంటి వారికి పోలీస్‌ ట్రీట్‌మెంట్‌ చేయించడం ఎంత సేపు? పోలీసులు తనను దారుణంగా కొడుతున్నప్పుడు బాధతో రఘురామకృష్ణ రాజు అరచిన అరుపులు జగన్‌ అండ్‌ కోకు శ్రవణానందకరంగా అనిపించి ఉండవచ్చునుగానీ ప్రస్తుత ప్రభుత్వంలో అటువంటి పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్లు లేరనే చెప్పవచ్చు. అయితే గతంలో హద్దులు మీరి ప్రవర్తించిన వారిపై చర్యలు ఉండాల్సిందే. లేనిపక్షంలో అలాంటి వారిలో లెక్కలేనితనం వస్తుంది. అది రాజకీయాలకే కాదు– రాష్ర్టానికీ మంచిది కాదు. దుష్టశిక్షణ ధర్మసమ్మతం, న్యాయ సమ్మతం అని దేవుడే చెప్పాడు. ఇందులో శషభిషలకు తావు ఉండకూడదు. అబద్ధాలు చెప్పడం అలవాటు లేదని అబద్ధం చెబుతున్న జగన్‌రెడ్డిని ప్రజలు ఇప్పట్లో విశ్వసించరు. సొంత పార్టీ వారే ఆయనను విశ్వసించడం లేదు. త్వరలోనే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు జగన్‌కు బైబై చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నప్పటికీ వారు పార్టీని వీడితే మాత్రం మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా సిద్ధమే అన్న జగన్‌ మాటలు నిజమవుతాయి. తథాస్తు దేవతలు ఉండరా మరి! అభినవ సత్యహరిశ్చంద్రుడి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో వేచి చూద్దాం!

ఆర్కే

Updated Date - Oct 20 , 2024 | 05:18 AM