Loksabha Elections 2024: సౌత్‌లో బీజేపీ బలపడిందా..?
ABN , Publish Date - May 14 , 2024 | 03:30 AM
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిన భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు.
నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం దిశగా పార్టీ.. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా షేర్లు కొనేయండి
తర్వాత స్టాక్‌మార్కెట్ పుంజుకుంటుంది: అమిత్ షా
పాక్ బాంబు అంటే ఇండియా కూటమికి బెదురు : మోదీ
వారాణసీలో నేడు నామినేషన్
న్యూఢిల్లీ, మే 13: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిన భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఘన విజయం దిశగా అడుగులు వేస్తున్నామని సోమవారం ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 109 లోక్‌సభ సీట్లు ఉండగా, గత ఎన్నికల్లో బీజేపీ 29 స్థానాలు (కర్ణాటక-25, తెలంగాణ-4) గెలుచుకుంది. ఏపీ, తెలంగాణల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అలాగే 20 లోక్‌సభ స్థానాలున్న కేరళలో కూడా బీజేపీ బోణీ చేయలేదు. కాగా, స్టాక్ మార్కెట్ పతనాలను ఎన్నికలతో ముడిపెట్టకూడదని అమిత్ షా అన్నారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్లు మళ్లీ పుంజుకుంటాయని, ఈలోపే షేర్లు కొనుగోలు చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చని ఇన్వెస్టర్లకు ఆయన సూచించారు. సెన్సెక్స్ లక్ష మార్కును దాటుతుందో, లేదో వ్యాఖ్యానించడానికి అమిత్ షా నిరాకరించారు. అయితే కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటే స్టాక్ మార్కెట్ సహజంగానే మెరుగైన పనితీరు కనబరుస్తుందని వ్యాఖ్యానించారు. ఈసారి తాము 400 సీట్లు గెలుస్తున్నామని, కేంద్రంలో స్థిరమైన మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఓటు బ్యాంకును కోల్పోతామనే భయంతోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అయోధ్య రామమందిరాన్ని సందర్శించలేదని అమిత్ షా ఆరోపించారు. మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును బుజ్జగింపు రాజకీయాల కారణంగానే ఆయన వ్యతిరేకించారని, దీనిపై శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే రాహుల్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని అమిత్ షా సూచించారు.
కూటమి నేతలు పిరికిపందలు
పాకిస్థాన్ చేతిలోని ఆటంబాంబు అంటే ఇండియా కూటమి నేతలు భీతిల్లిపోతున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. పిరికిపందలు అంటూ కూటమి నేతలను విమర్శించారు. పాక్ వద్ద ఆటంబాంబు ఉన్నదనే విషయం గుర్తుపెట్టుకోవాలంటూ ‘ఇండియా’ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ నేత మణిశంకర్ అయ్యర్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఐదో విడత ఎన్నికలు జరిగే బిహార్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం జరిగిన ప్రచార సభల్లో దీనిపైనే మోదీ వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్థాన్ అంటేనే బెదిరిపోయే నేతలను ఇండియా కూటమి కలిగి ఉన్నట్టు కనిపిస్తోంది. పాక్ ఆటంబాంబు గురించి వారంతా పీడకలలు కంటున్నారు. ఈ నేతలు పాకిస్థాన్‌కు ఒకచేత్తో క్లీన్‌చిట్ ఇస్తారు. మరో చేత్తో, ఆ దేశంపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఆ కూటమిలోని లెఫ్ట్ మిత్రులు భారత్ వద్ద ఉన్న ఆటంబాంబులు నిర్వీర్యం కావాలని కోరుకుంటారు’’ అని దుయ్యబట్టారు. యూపీఏ పదేళ్ల పాలనలో ఈడీ స్కూలు బ్యాగులో దాచిన రూ.35 లక్షలను పట్టుకుంటే, ఎన్డీయే అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లలో ఏకంగా రూ.2200 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నదని, దానివల్లే ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయన్నారు. తనకు వారసులు లేరని, సామాన్యుడే తన వారసుడు అని వ్యాఖ్యానించారు.
నెహ్రూ తప్పులకు బాధ్యత మోదీదా?
దేశ సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ హయాంలోనే జరిగాయని, ఆయన చేసిన తప్పులకు మోదీ ఎందుకు బాధ్యత వహిస్తారని విదేశాంగమంత్రి జైశంకర్ మండిపడ్డారు. చైనా విషయంలో ప్రధాని నరేంద్రమోదీనే బాద్యత వహించాలని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం జైశంకర్ స్పందిచారు. 1958- 1962 మధ్య కాలంలోనే భారత భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించుకుందని, 1958కి ముందు కూడా కొంత భూమిని ఆక్రమించుకుందని ఆయన పేర్కొన్నారు.