Ecuador Gunmen: టీవీ స్టూడియోలో బీభత్సం.. లైవ్ నడుస్తుండగా తుపాకులతో దూసుకొచ్చిన దుండగులు
ABN , Publish Date - Jan 10 , 2024 | 04:34 PM
లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక టీవీ స్టూడియోలో లైవ్ నడుస్తుండగా.. కొందరు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. కాసేపు అక్కడ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు..

లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక టీవీ స్టూడియోలో లైవ్ నడుస్తుండగా.. కొందరు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. కాసేపు అక్కడ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. అంతేకాదు.. కాల్పులు జరపడంతో పాటు బాంబులు కూడా వేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. తాము చెప్పినట్టు చేయకపోతే.. ప్రాణాలు తీసేస్తామని హెచ్చరించారు. దీంతో.. స్టూడియోలోని సభ్యులు బెంబేలెత్తిపోయారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగడంతో.. ఈ వ్యవహారం అదుపులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
మంగళవారం ఈక్వెడార్ పోర్ట్ సిటీ గుయాక్విల్‌లోని టీసీ టెలివిజన్ నెట్‌వర్క్ సెట్‌లోకి 13 మంది దుండగులు తుపాకీలతో ప్రవేశించారు. ఆ సమయంలో సెట్‌లో లైవ్ షో నడుస్తోంది. ముసుగులు ధరించిన ఆ వ్యక్తులు.. సెట్‌లో ఉన్న వాళ్లందరినీ తుపాకులతో బెదిరింపులకు పాల్పడ్డారు. అందరూ సైలెంట్‌గా ఉండాలని, తాము చెప్పినట్టే వినాలని, లేకపోతే బాంబులు వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కాల్పులు సైతం జరిపారు. ఈ మొత్తం సంఘటన లైవ్ టీవీ షో సందర్భంగా.. కనీసం 15 నిమిషాల పాటు కొనసాగింది. మొదట్లో అక్కడున్న వాళ్లకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఇదేమైనా ప్రాంక్ వ్యవహారమా? లేకపోతే నిజంగానే ముష్కరులు వచ్చారా? అనేది తెలియరాలేదు. ఆ తర్వాత వాళ్లు నిజమైన దుండగులేనని తెలుసుకొని, అందరూ భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, ఎంతో చాకచక్యంగా ఆ దుండుగుల్ని పట్టుకున్నారు.
ఈక్వెడార్ జాతీయ పోలీసు చీఫ్ మాట్లాడుతూ.. ఆ చొరబాటుదారులను అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి తుపాకులతో పాటు పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అంతేకాదు.. ఆ 13 మందిపై తీవ్రవాద అభియోగాలు నమోదు చేయనున్నట్టు స్పష్టం చేశారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ ఘటన తర్వాత 7 మంది పోలీసులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో.. దేశంలోని పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని అధ్యక్షుడు డేనియల్ నోబోవా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. జైళ్లకు సైన్యం రక్షణ కల్పించాలని, 20 డ్రగ్స్ ట్రాఫికింగ్ ముఠాలను ఉగ్రవాద గ్రూపులుగా గుర్తించాలని డిక్రీ జారీ చేశారు.