Pakistan: పాక్ సాయుధుల ఘాతుకం.. వాహనాలను ఆపి 23 మందిని నిలువునా కాల్చేశారు
ABN , Publish Date - Aug 26 , 2024 | 12:29 PM
ఉగ్రవాద ప్రేరిపిత సాయుధులు రెచ్చిపోయారు. వాహనాలను ఆపి మరీ 23 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా వారి వాహనాలకు నిప్పు పెట్టి రాక్షసానందం పొందారు.
ఇస్లామాబాద్: ఉగ్రవాద ప్రేరిపిత సాయుధులు రెచ్చిపోయారు. వాహనాలను ఆపి మరీ 23 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా వారి వాహనాలకు నిప్పు పెట్టి రాక్షసానందం పొందారు. పాకిస్థాన్‌లో(Pakistan) ఈ దారుణ ఘటన జరిగింది. అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బలుచిస్థాన్‌లోని ముసాఖెల్ జిల్లా రరాశమ్ రహదారిపై వాహనాలు వెళ్తుండగా.. కొన్నింటిని సాయుధులు ఆపారు. అనంతరం బస్సులు, ట్రక్కులు, కార్లలో ఉన్న ప్రయాణికులను దింపేసి.. వారిని తనిఖీ చేశారు. అందరినీ వరుసలో నిల్చోబెట్టి అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. తరువాత 10 వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 23 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితుల శరీరాల్లోంచి రక్తం ఏరులై పారింది. దీంతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది.
వారే లక్ష్యం..
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ప్రయాణికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. పోలీసులు కూడా దాడి జరిగిన విషయాన్ని నిర్ధారించారు. కాగా ఈ ఘటనను బలూచిస్థాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్తీ ఖండించారు. అమాయకులను టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, నిందితులను పట్టుకుని కఠిన శిక్షలు పడేలా చేస్తామని తెలిపారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాద బృందం దాడులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదాన్ని సహించం..
సాయుధుల దాడిని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఖండించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని.. వారందరికీ కఠిన శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేస్తామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని షరీఫ్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని సహించమని చెప్పారు.
గతంలోనూ..
పంజాబ్ ప్రావిన్స్‌కి చెందిన వారిపై గతంలోనూ దాడులు జరిగాయి. సరిగ్గా నాలుగు నెలల క్రితం ముసాఖేల్‌లో సాయుధులు దాడులకు పాల్పడ్డారు. ఏప్రిల్‌లో ముష్కరులు నోష్కి సమీపంలో బస్సులో నుంచి తొమ్మిది మంది ప్రయాణికులను దించి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి కాల్చి చంపేశారు. గతేడాది అక్టోబర్‌లో బలూచిస్థాన్‌లోని కెచ్ జిల్లాలో ఉన్న టర్బాత్‌లో పంజాబ్‌కు చెందిన ఆరుగురు కార్మికులను గుర్తుతెలియని ముష్కరులు కాల్చి చంపారు.
బాధితులందరూ దక్షిణ పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. 2015లో టర్బత్ సమీపంలోని శిబిరాలపై ముష్కరులు తెల్లవారుజామున దాడి చేయడంతో 20 మంది నిర్మాణ రంగ కార్మికులు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. బాధితులు సింధ్, పంజాబ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. బలూచిస్థాన్‌లోని వేర్పాటువాదులు దేశంలోని తూర్పు పంజాబ్ ప్రాంతానికి చెందిన కార్మికులపై తరచూ దాడులు చేస్తున్నారు. వారంతా అక్రమంగా తమ ప్రదేశంలోకి వచ్చారని.. వెంటనే తమ ప్రావిన్స్‌ని విడిచిపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
For Latest News click here