Share News

New York: స్వామినారాయణ్ ఆలయంపై దాడి: ఖండించిన భారత్

ABN , Publish Date - Sep 17 , 2024 | 08:45 AM

న్యూయార్క్‌‌లోని మెల్‌విల్లేలోని స్వామి నారాయణ్ ఆలయంపై దాడి ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ తరహా ఘటనలు ఆమోదయోగ్యమైనవి కావని స్పష్టం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది.

 New York: స్వామినారాయణ్ ఆలయంపై దాడి: ఖండించిన భారత్

వాషింగ్టన్, సెప్టెంబర్ 17: న్యూయార్క్‌‌లోని మెల్‌విల్లేలోని స్వామి నారాయణ్ ఆలయంపై దాడి ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ తరహా ఘటనలు ఆమోదయోగ్యమైనవి కావని స్పష్టం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు న్యూయార్క్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని యూఎస్ ప్రభుత్వ అధికారులను కలిసి సూచించనున్నట్లు తెలిపింది. అందుకోసం స్థానిక భారతీయ సమాజంతో చర్చిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు భారతీయ రాయబార కార్యాలయం తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.


మరోవైపు హిందూ అమెరికన్ సమాజం సైతం ఈ ఆలయంపై దాడి ఘటనను ఖండించింది. దీనిపై విచారణ జరపాలని యూఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హిందూ సంస్థలపై ఇటీవల కాలంలో దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వారాంతంలో నాజు కౌంటీ వద్ద అమెరికాలోని భారతీయులంతా భారీ సంఖ్యలో నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు హిందూ అమెరికన్ సమాజం స్పష్టం చేసింది.


ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ఈ ఘటనపై హిందూ అమెరికన్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా సైతం స్పందించారు. బెదిరింపులో భాగంగా ఈ దాడి చేసినట్లుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో హిందూ, భారతీయ సంస్థలపై దాడులు అధికమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


సఫ్లోక్ కౌంటీలోని మెల్‌విల్లే ఓ పట్టణం. సెప్టెంబర్ 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే ఈ సదస్సు జరిగే ప్రాంతానికి 28 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉండడం గమనార్హం.

For More international News and Telugu News

Updated Date - Sep 17 , 2024 | 09:38 AM