Share News

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్‌!

ABN , Publish Date - Oct 01 , 2024 | 05:53 AM

హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్‌ సేనలు.. సోమవారం అర్ధరాత్రి దాటాక లెబనాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి. సోమవారం ఉదయం నుంచే అమెరికా వార్తా సంస్థలు సీఎన్‌ఎన్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ తమ వెబ్‌ ఎడిషన్లలో భూతల దాడులకు సర్వం

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్‌!
Israel Into Lebanon

అమెరికాకు సమాచారం.. సరిహద్దుల్లో వైదొలగిన లెబనాన్‌ ఆర్మీ

యుద్ధ ట్యాంకులతో అల్‌-వజానీ, అల్‌-ఖియామ్‌ వైపు ఐడీఎఫ్‌

డమాస్కస్‌పై దాడులు.. లెబనాన్‌లో పదుల సంఖ్యలో మరణాలు

ఇజ్రాయెల్‌పై ఇరాక్‌, ఇరాన్‌, సిరియా దాడులకు అవకాశం

లెబనాన్‌కు ఐఆర్‌జీసీ.. సిరియాకు హిజ్బుల్లా నాయకులు

ఇరాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టుబెడతాం: నెతన్యాహు

నెతన్యాహుకు మోదీ ఫోన్‌.. ఉగ్రవాదానికి చోటు లేదని వ్యాఖ్య

టెల్‌అవీవ్‌, సెప్టెంబరు 30: హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్‌ సేనలు.. సోమవారం అర్ధరాత్రి దాటాక లెబనాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి. సోమవారం ఉదయం నుంచే అమెరికా వార్తా సంస్థలు సీఎన్‌ఎన్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ తమ వెబ్‌ ఎడిషన్లలో భూతల దాడులకు సర్వం సిద్ధం అంటూ కథనాలను అప్‌డేట్‌ చేస్తున్నా.. ఇజ్రాయెల్‌ మాత్రం అర్ధరాత్రి అధికారికంగా నిర్ధారించింది. ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో లెబనాన్‌ సైన్యం సరిహద్దుల్లోని రమిష్‌, అబూషానన్‌ ప్రాంతాల్లోని పోస్టుల్లోంచి వెనక్కి వెళ్లినట్లు లెబనాన్‌ వార్తాపత్రిక అల్‌-నహర్‌ వెల్లడించింది. రాత్రి కడపటి వార్తలందేసరికి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) యుద్ధట్యాంకులతో లెబనాన్‌లోని అల్‌-వజానీ, అల్‌-ఖియామ్‌వైపు దూసుకెళ్తున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతాల్లో యుద్ధట్యాంకులు, ఫిరంగులతో దాడులు జరిగినట్లు అల్‌-మనార్‌ పత్రిక ప్రతినిధి షోఫర్‌ నిర్ధారించినట్లు లెబనాన్‌ వార్తాసంస్థలు పేర్కొన్నాయి.


ఇజ్రాయెల్‌పై.. దాడులకు వ్యూహాలు..!

తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాక్‌, ఇరాన్‌, సిరియాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాల ముఖ్య నాయకులు సోమవారం చేసిన ప్రకటనలు.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఇరాన్‌ ప్రజలను ఉద్దేశించి ఆంగ్లంలో ఇచ్చిన సుదీర్ఘ వీడియో సందేశం కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై ఒకట్రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఇరాక్‌.. నేరుగా కదనరంగంలోకి దిగుతామని సూత్రప్రాయంగా వెల్లడించింది. ఇరాన్‌ వేల మంది రివల్యూషనరీ గార్డ్స్‌, ఫైటర్లను లెబనాన్‌కు తరలించింది. మరోవైపు అమెరికా కూడా పశ్చిమాసియాకు ముందుజాగ్రత్తగా అదనపు బలగాలను పంపుతుంది.


యుద్ధరంగంలోకి ఇరాక్‌?

ఇజ్రాయెల్‌పై యుద్ధానికి సిద్ధమని ఇరాక్‌ ఎంపీ యాసర్‌-అల్‌-హుస్సేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఖతార్‌కు చెందిన బ్రిటన్‌ వార్తాసంస్థ అల్‌-అరబి ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ‘‘ఇరాక్‌ చమురు క్షేత్రాలను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకోనుందని, కీలక ప్రాంతాలపై దాడులకు సిద్ధమవుతోందని నిఘావర్గాలు మా ప్రధాని మహమ్మద్‌ షియా అల్‌-సుడానీకి సమాచారం అందించాయి. మా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మేం యుద్ధానికి సిద్ధమే’’ అని ఆయన వ్యాఖ్యనించినట్లు ఆ కథనంలో పేర్కొంది.


ఫైటర్లను లెబనాన్‌కు తరలించిన ఇరాన్‌

హిజ్బుల్లా చీఫ్‌తోపాటు.. తమ రివల్యూషనరీ గార్డ్స్‌ జనరల్‌ అబ్బా్‌సను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. అంతకు ముందు సిరియాలోని డమాస్క్‌సపై ఇజ్రాయెల్‌ జరిపిన క్షిపణి దాడుల్లోనూ ఇరాన్‌ కమాండర్లు మృతిచెందారు. దీంతో ఇజ్రాయెల్‌పై ప్రతీకారానికి ఇరాన్‌ సిద్ధమైంది. హిజ్బుల్లాకు మద్దతుగా.. ఇరాన్‌ ఫైటర్లను, రివల్యూషనరీ గార్డ్స్‌ను వేల సంఖ్యలో లెబనాన్‌కు పంపినట్లు ఇజ్రాయెల్‌ వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి.


సిరియా కేంద్రంగా..

అగ్ర నాయకత్వాన్ని కోల్పోయిన హిజ్బుల్లా.. హమాస్‌ ఉగ్రవాద సంస్థల ఫీల్డ్‌ కమాండర్లు రెండ్రోజులుగా సిరియా బాట పట్టినట్లు ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ గుర్తించింది. అక్కడ ఉన్న ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) నాయకులతో వీరు భేటీ అవుతున్నారని, కలిసికట్టుగా ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్ధమవుతున్నారని నిర్ధారించినట్లు ఇజ్రాయెల్‌ వార్తా సంస్థ ‘వైనెట్‌’ పేర్కొంది. మరోవైపు సిరియాపై జరుగుతున్న దాడులపై ఐక్య రాజ్య సమితి(ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు హిజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ నయీం కాసీమ్‌ సోమవారం ఓ అరబిక్‌ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఇజ్రాయెల్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తామని, శత్రువు తమ భూభాగంలోకి ప్రవేశిస్తే గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమ మిలటరీ సామర్థ్యాన్ని ఇజ్రాయెల్‌ అంచనా వేయలేదని తెలిపారు. కాగా, ఐడీఎఫ్‌ వైమానిక దళం సోమవారం కూడా లెబనాన్‌పై భీకరదాడులు జరిపింది. ఆదివారం దాడుల్లో 105 మంది చనిపోయారు. ఆదివారం రాత్రి జరిపిన దాడిలో హిజ్బుల్లా మీడియం రేంజ్‌ మిసైల్స్‌ బృందం కమాండర్‌ ఈద్‌-హసన్‌ నెషార్‌ను అంతమొందించినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది.


ఏ దేశంలోనైనా చొరబడతాం

ఇరాన్‌ పౌరులను ఉద్దేశించి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సుదీర్ఘ వీడియో సందేశం, లేఖను విడుదల చేశారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ చొరబడని ప్రదేశమంటూ లేదని చెబుతూనే.. ఇరాన్‌ పౌరులు మతోన్మాద శక్తుల ఉచ్చులో పడొద్దని హితవు పలికారు. ‘‘మతోన్మాదంతో మీ కలలను నాశనం చేసుకోవద్దు. మీలో మతోన్మాద విష బీజాలు నాటే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మా ప్రజలను, మా దేశాన్ని రక్షించుకునేందుకు మేం ఎక్కడిదాకా అయినా వెళ్తాం. మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి. మీ ప్రభుత్వం పాలనను పక్కనబెట్టింది. సంక్షేమానికి కాకుండా.. అనవసర యుద్ధాలకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇరాన్‌కు స్వేచ్ఛ వస్తే.. పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఆ సమయం వచ్చేలోగా.. మీ ప్రభుత్వం ఐదు ఖండాల్లో విస్తరించిన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేస్తాం. అదే జరిగితే.. ప్రపంచ పెట్టుబడులు ఇరాన్‌కు వస్తాయి. ఇరాన్‌ సుభిక్షంగా మారుతుంది. యూదు-పర్షియన్‌ ప్రజలు శాంతియుతంగా ఉంటారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నెతన్యాహు సందేశాన్ని బట్టి.. ఆయన ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయని, అందుకే.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.


తోక ఉగ్ర సంస్థల ఖేల్‌ ఖతం!

హిజ్బుల్లా, హమా్‌సకు అనుబంధంగా పనిచేస్తున్న రెండు ఉగ్రవాద సంస్థలపై మొస్సాద్‌ అందించిన సమాచారంతో ఐడీఎఫ్‌ దాడులు జరిపింది. పాపులర్‌ ఫ్రంట్‌ ఫర్‌ ద లిబరేషన్‌ ఆఫ్‌ పాలస్తీనా(పీఎ్‌ఫఎల్‌పీ) సంస్థ హజ్బుల్లాకు అనుబంధంగా పనిచేస్తోందని ఐడీఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ సంస్థ చీఫ్‌ నిదల్‌ అబ్దుల్‌-అల్‌ను ఆదివారం రాత్రి జరిపిన రాకెట్‌ దాడుల్లో మట్టుబెట్టినట్లు ప్రకటించింది. పీఎ్‌ఫఎల్‌పీ మిలటరీ కమాండర్‌ ఇమాద్‌ ఓదే్‌హను కూడా అంతమొందించినట్లు తెలిపింది. అటు హమాస్‌ అనుబంధ సంస్థ లెబనాన్‌ ఎరీనాను కూడా టార్గెట్‌గా చేసుకున్నట్లు వివరించింది. ఈ సంస్థ హమా్‌స-హిజ్బుల్లా మధ్య సంధానకర్తగా పనిచేస్తోందని పేర్కొంది. సోమవారం జరిపిన దాడుల్లో లెబనాన్‌ ఎరీనా చీఫ్‌ ఫతా షరీ్‌ఫను హతమార్చినట్లు వెల్లడించింది.


modi.jpg


ఉగ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదు: మోదీ

ఉగ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఆయన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, ఉద్రిక్తతలపై చర్చించినట్లు మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. హమాస్‌ చెరలో ఉన్న ఇజ్రాయెల్‌ బందీలు సురక్షితంగా వెనక్కి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. పశ్చిమాసియాలో శాంతికి భారత్‌ కృషిచేస్తుందని పునరుద్ఘాటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Updated Date - Oct 01 , 2024 | 08:30 AM