Share News

Myanmar Crisis Deepens: మయన్మార్‌పై మరో పిడుగు

ABN , Publish Date - Apr 01 , 2025 | 05:07 AM

భూకంపం వల్ల మయన్మార్‌ బాధితుల పరిస్థితి చాలా గోరైంది. ఇప్పుడు అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, సహాయక చర్యలకు మిలటరీ అడ్డంకులు ఇబ్బందులు కలుగుతున్నాయి

Myanmar Crisis Deepens: మయన్మార్‌పై మరో పిడుగు

  • నేటి నుంచి భారీ వర్షాలు

  • భూకంప ప్రభావిత ప్రాంతాల్లో

    ఇళ్లు కోల్పోయిన వారికి ఇక్కట్లే

  • సహాయక చర్యలకూ ఆటంకాలు

నేపిదా(మయన్మార్‌), మార్చి 31: భూప్రకోపానికి గురైన మయన్మార్‌పై ఇప్పుడు మరో పిడుగు పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.. బంగాళాఖాతంలో గల్ఫ్‌ ఆఫ్‌ మర్తబాన్‌కు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఏప్రిల్‌ 1 నుంచి మయన్మార్‌ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. ఇప్పటికే భూకంపం ప్రభావం దేశవ్యాప్తంగా ఉండడం.. 60-70ు ఇళ్లు, ఆస్పత్రులు, ప్రార్థన మందిరాలు, మఠాలు దెబ్బతినగా.. పునరావాస కేంద్రాలు లేక.. పౌరులు ఆరుబయటే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో భారీ వర్షాలు కురిస్తే.. భూకంప బాధితుల పరిస్థితి గోరుచుట్టుపై రోకటిపోటుగా మారే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సహాయక చర్యలకు కూడా భారీ వర్షాలు ఆటంకంగా మారే ప్రమాదముంది. భూకంప ప్రభావిత ప్రాంతాలైన ముయి, ఖోట్సాంగ్‌ మినహా.. సికాయ్‌, మాంటాలే, నాంగ్‌, పఖో, షామ్‌ ప్రావిన్సుల్లో సోమవారం సాయంత్రం నుంచే వర్షాల ప్రభావం మొదలైందని మయన్మార్‌ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ 4-6 తేదీల్లోనూ మరో అల్పపీడన సూచన ఉందని, అప్పుడు గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మర్తబాన్‌ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని మయన్మార్‌ వాతావరణ విభాగం అధికారి ఓవెన్‌ నై హెచ్చరించారు.


సహాయానికి.. మిలటరీ అడ్డంకులు

భూకంప విధ్వంసం కవరేజీకి వచ్చే అంతర్జాతీయ మీడియాను నిషేధిస్తూ మయన్మార్‌ మిలటరీ సర్కారు(సైనిక మండలి) ప్రతినిధి జనరల్‌ ఝావో మ్యుంగ్‌థాంగ్‌ ఉత్తర్వులు జారీ జారీచేశారు. పలు అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి మిలటరీ ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయని, అయితే.. విదేశీ మీడియా ప్రతినిధులకు ప్రస్తుతం సౌకర్యవంతమైన వసతులు లేవని, దాంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. కాగా.. రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించిన మిలటరీ సర్కారు.. రెబల్స్‌ ప్రాంతాల్లో వైమానిక దాడులను యథావిధిగా కొనసాగిస్తోంది. హెలికాప్టర్లు, డ్రోన్లతో జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో రెబల్స్‌ చనిపోయారని థాయ్‌లాండ్‌ కేంద్రంగా పనిచేస్తున్న మయన్మార్‌ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఆస్పత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోగా.. మిలటరీ సర్కారు ఆంక్షలను విధిస్తోందని.. ఈ విధానం సరికాదంటూ ఐక్య రాజ్య సమితి(ఐరాస) ఆగ్రహం వ్యక్తం చేసింది. సహాయక బృందాలను అడ్డుకోవొద్దని కోరింది.

fdsz.jpg


మృత్యువుతో గర్భిణి పోరాటం

స్కైవిల్లాలో భూకంప శిథిలాల కింద చిక్కుకున్న 29 ఏళ్ల ఓ గర్భిణి.. 12 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. చైనా రెస్క్యూ బృందాలు ఈ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టగా.. శనివారం రాత్రి ఆ గర్భిణి మూలుగు వినిపించడంతో జాగ్రత్తగా స్లాబును కట్‌ చేసి, ఆమెను కాపాడారు. మాండలేలోని ‘గ్రేట్‌వాల్‌’ హోటల్‌లో మరో గర్భిణిని మయన్మార్‌ అగ్నిమాపకశాఖ కాపాడింది. మరోవైపు, మాండలే సమీపంలోని బంగారు గనిలో 27 మృతదేహాలను వెలికి తీశామని పియర్స్‌ టౌన్‌షిప్‌ మిలటరీ కౌన్సిల్‌ అధికారులు చెప్పారు. భూకంప మరణాల సంఖ్య 3,034కు చేరుకుందని, థాయ్‌లాండ్‌ కేంద్రంగా పనిచేస్తున్న డెమోక్రాటిక్‌ వాయిస్‌ ఆఫ్‌ బర్మీ్‌స(డీవీబీ) వెల్లడించింది.

ముగ్గురు మనవరాళ్లను కాపాడిన బామ్మ

మాండలేలోని 11అంతస్తుల స్కైవిల్లా భవనం ఆరో అంతస్తులో 75 ఏళ్ల వయసున్న ఓ బామ్మ తన కొడుకు, కోడలు, ముగ్గురు మనవరాళ్లతో ఉంటోంది. శుక్రవారం నాటి భూకంపంతో ఆ భవనం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో బామ్మ, ఆమె మనవరాళ్లు మాత్రమే ఫ్లాట్‌లో ఉన్నారు. శిథిలాలు మీదపడి రక్తపు గాయాలైనా.. ఆ బామ్మ భయపడలేదు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఓ సుత్తి ఆమె చేతికి దొరికింది. దాన్ని మనవరాళ్లకు ఇచ్చి, గోడలను పగులగొట్టి.. బయటపడాలని సూచించింది. ఆ మనవరాళ్లు కష్టపడి ఓ రంధ్రం చేసి, బయటకు రాగలిగారు. అయితే.. ఆ రంధ్రం చిన్నదిగా ఉండడంతో బామ్మ మాత్రం బయటకు రాలేకపోయారు. అంతలో తదనంతర ప్రకంపనలతో శిథిలాలు మరింత కుంగాయి. అయితే.. బయటకు వచ్చిన ముగ్గురు మనవరాళ్లు సోమవారం రెస్క్యూ బృందాలను వెంట తీసుకొచ్చి, తమ బామ్మను కాపాడుకున్నారు.


మసీదుల్లో 700 మంది మృతి

భూకంపం సంభవించిన రోజు రంజాన్‌ మాసంలో చివరి శుక్రవారం(జుమాతుల్‌విధా) కావడంతో ముస్లింలు పెద్ద సంఖ్యలో మసీదులకు వెళ్లారు. భూకంపం కారణంగా దేశంలోని 60కి పైగా మసీదులు కూలిపోగా.. వాటిల్లో ప్రార్థనలు చేస్తున్న 700 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క రఖై మసీదులోనే 59 మంది మృతిచెందారని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

మరణం గుట్టు విప్పిన డాక్టర్.. చనిపోయిన వాళ్లను బతికించొచ్చట.

Credit Score: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఏమౌతుంది.. రికవరీకి ఎంత టైం పడుతుంది

Updated Date - Apr 01 , 2025 | 05:50 AM