Share News

అబూజ్‌మడ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

ABN , Publish Date - Nov 17 , 2024 | 03:29 AM

మావోయిస్టుల కంచుకోట అబుజ్‌మడ్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు-నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా.. ఇద్దరు జవాన్లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి.

అబూజ్‌మడ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

  • ఐదుగురు నక్సల్స్‌ హతం

  • మృతుల్లో ఇద్దరు మహిళలు

  • డీవీసీ సభ్యుడు రంజిత్‌ కూడా..

చర్ల, నవంబరు 16: మావోయిస్టుల కంచుకోట అబుజ్‌మడ్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు-నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా.. ఇద్దరు జవాన్లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. రాత్రి కడపటి వార్తలందేసరికి ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. బస్తర్‌ ఐజీ సుందర్‌కుమార్‌, కాంకేర్‌ ఎస్పీ ఇందిర కల్యాణ్‌ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని దంతేవాడ, ఛత్తీ్‌సగఢ్‌లోని కాంకేర్‌, నారాయణ్‌పూర్‌ సరిహద్దుల్లోని అబుజ్‌మడ్‌ అడవుల్లో కేంద్ర కమిటీ సభ్యులు సమావేశమైనట్లు సమాచారం అందడంతో.. మూడు జిల్లాల డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ బలగాలు.. మహారాష్ట్ర నుంచి సీ-60 కమాండోలు, బీఎ్‌సఎఫ్‌ జవాన్లు శనివారం తెల్లవారుజామున కూంబింగ్‌ ప్రారంభించారు. ఉదయం 8 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడడంతో.. ఇరువైపులా హోరాహోరీగా కాల్పులు ప్రారంభమయ్యాయి. సుమారు నాలుగు గంటల పాటు కాల్పులు కొనసాగాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో.. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు నిలిచిపోవడంతో.. జవాన్లు ముందుకు సాగారు. ఈ క్రమంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ‘‘మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఐదుగురిలో ఒకరిని డివిజనల్‌ కమిటీ సభ్యుడు రంజిత్‌గా గుర్తించాం. అతని తలపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఘటనాస్థలి నుంచి రెండు ఆటోమెటెడ్‌ తుపాకులు, ఒక ఇన్సాస్‌, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, మరో దేశవాళి తుపాకీని స్వాధీనం చేసుకున్నాం’’ అని కాంకేర్‌ ఎస్పీ ఇందిర కల్యాణ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు గాయపడ్డారు. ఖిలేశ్వర్‌ గావ్డే అనే జవానుకు భుజం, తలపై తూటా గాయాలయ్యాయి.


  • 320 రోజులు.. 194 మంది హతం

ఈ ఏడాది ఆరంభం నుంచి శనివారం వరకు మొత్తం 320 రోజుల్లో జరిగిన 97 ఎన్‌కౌంటర్లు మావోయిస్టు పార్టీని కోలుకోకుండా చేశాయి. ఈ ఎన్‌కౌంటర్లలో 194 మంది నక్సల్స్‌ మృతిచెందారు. వీరిలో 38 మంది మహిళా నక్సల్స్‌ ఉన్నారు. కాగా, ఛత్తీ్‌సగఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని బీజాపూర్‌ జిల్లా కొండపల్లి సీఆర్‌పీఎఫ్‌-151 క్యాంపుపై మావోయిస్టులు గ్రనేడ్‌ లాంచర్లతో దాడులు జరిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పదుల సంఖ్యలో గ్రనేడ్లు, రాకెట్లను ప్రయోగించడంతో.. ఆ ప్రాంతంలో యుద్ధవాతావరణం కనిపించిందని పరిసర గ్రామస్థులు తెలిపారు.

Updated Date - Nov 17 , 2024 | 03:30 AM