Share News

EC : 11 చోట్ల ఈవీఎంల తనిఖీలకు దరఖాస్తులు

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:57 AM

దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్‌ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది

EC : 11 చోట్ల ఈవీఎంల తనిఖీలకు దరఖాస్తులు

తెలుగు రాష్ట్రాల్లో 2 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు: ఈసీ

న్యూఢిల్లీ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్‌ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నాలుగు దరఖాస్తులు అందాయని పేర్కొంది.

తెలంగాణలోని జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 20 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి వెరిఫికేషన్‌ చేపట్టాలని బీజేపీ కోరినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలో 2 పోలింగ్‌ కేంద్రాల్లో వెరిఫికేషన్‌ కోసం వైఎస్సార్‌సీపీ దరఖాస్తు చేసినట్లు తెలిపింది. అలాగే, ఒంగోలు అసెంబ్లీ స్థానంలోని 12, గజపతినగరం అసెంబ్లీ స్థానంలోని ఒక పోలింగ్‌ కేంద్రంలో వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తులు అందినట్లు వివరించింది.

అలాగే, ఒడిశాలోని ఝర్సుగూడ అసెంబ్లీ స్థానం పరిధిలో ఉన్న 13 పోలింగ్‌ కేంద్రాలు, ఛత్తీ్‌సగఢ్‌లోని కాంకేర్‌ పరిధిలోని 4 పోలింగ్‌ కేంద్రాలు, హరియాణాలోని కర్నల్‌, ఫరిదాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 6, మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 40 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి దరఖాస్తులు అందినట్లు వెల్లడించింది. తమిళనాడులోని వెల్లూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని 8, విరుధ్‌నగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని 14 పోలింగ్‌ కేంద్రాలకు దరఖాస్తులు అందినట్లు ఈసీ వెల్లడించింది. దరఖాస్తు చేసిన నాలుగు వారాల్లో తనిఖీలు చేపడతామని ఈసీ తెలిపింది.

Updated Date - Jun 21 , 2024 | 03:57 AM