BJP Candidates List: బీజేపీ 17వ జాబితా విడుదల.. బ్రిజ్‌భూషణ్ తనయుడికి టికెట్
ABN , Publish Date - May 02 , 2024 | 05:48 PM
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా.. భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల 17వ జాబితాను గురువారం విడుదల చేసింది. రాయ్‌బరేలీ స్థానం నుంచి దినేష్ ప్రతాప్ సింగ్‌కు, కైసర్‌గంజ్ స్థానం నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్‌కు..
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా.. భారతీయ జనతా పార్టీ (BJP) తన అభ్యర్థుల 17వ జాబితాను గురువారం విడుదల చేసింది. రాయ్‌బరేలీ స్థానం నుంచి దినేష్ ప్రతాప్ సింగ్‌కు, కైసర్‌గంజ్ స్థానం నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) కుమారుడు కరణ్ భూషణ్‌కు (Karan Bhushan) టికెట్లు ఇచ్చింది. మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం, ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో.. బ్రిజ్ భూషణ్‌కు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. అయితే.. ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
రాహుల్‌పై పాకిస్తాన్ ప్రశంసలు.. తీవ్రంగా మండిపడ్డ ప్రధాని మోదీ
ఎవరు ఈ కరణ్ భూషణ్ సింగ్?
కరణ్ భూషణ్ సింగ్.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ చిన్న కుమారుడు. 1990 డిసెంబర్ 13వ తేదీన జన్మించిన ఆయనకు పెళ్లయి.. ఒక కుమార్తె, ఓ కొడుకు ఉన్నారు. డబుల్ ట్రాప్ షూటింగ్‌లో జాతీయ క్రీడాకారుడు అయిన కరణ్.. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం నుండి బీబీఏ, ఎల్ఎల్‌బీ డిగ్రీలను పొందారు. ఆస్ట్రేలియా నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కూడా చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు కరణ్ తొలిసారి ఎన్నికల బరిలో నిల్చున్నారు.
భానుడి ప్రతాపం వేళ.. పోలింగ్ సమయాల్లో మార్పులు చేయాలని..
ఏడు దశల్లో ఎన్నికలు
గతంలో మాదిరిగానే ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. మూడో దశలో మే 7వ తేదీన 94 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన నాల్గవ దశలో 96 లోక్‌సభ స్థానాలపై ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఐదో దశ మే 20వ తేదీన (49 లోక్‌సభ స్థానాలకు), ఆరో దశ మే 25వ తేదీన, ఏడో దశ జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనున్నాయి. చివరి రెండు దశల్లో కలుపుకుని 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Read Latest National News and Telugu News