Share News

Kangana Ranaut: ఎంపీ కంగనా రనౌత్‌కు ఊహించని షాకిచ్చిన సొంత పార్టీ బీజేపీ

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:55 PM

బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు పార్టీ హైకమాండ్ షాకిచ్చింది. రైతు నిరసనల విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకుంటే మన దేశంలో కూడా బంగ్లాదేశ్ లాంటి సంక్షోభం ఏర్పడవచ్చంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది.

Kangana Ranaut: ఎంపీ కంగనా రనౌత్‌కు ఊహించని షాకిచ్చిన సొంత పార్టీ బీజేపీ

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు పార్టీ హైకమాండ్ షాకిచ్చింది. రైతు నిరసనల విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకుంటే మన దేశంలో కూడా బంగ్లాదేశ్ లాంటి సంక్షోభం ఏర్పడవచ్చంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించబోదని స్పష్టం చేసింది. పార్టీ తరపున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనా రనౌత్‌కు లేదని, అందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటనలో బీజేపీ క్లారిటీ ఇచ్చింది.

కంగనాను సున్నితంగా మందలించిన అధిష్ఠానం వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించింది. సమ్మిళిత అభివృద్ధికి కంగనా కట్టుబడి ఉండాలని సూచించింది. సామాజిక సామరస్య విధానాల విషయంలో పార్టీ నిబద్ధతతో ఉందని పునరుద్ఘాటించింది.


కాగా రైతుల ఉద్యమంపై కంగనా రనౌత్ నిన్న (ఆదివారం) సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంలో విదేశాల కుట్ర ఉందని అన్నారు. రైతు నిరసలను అదుపు చేయకపోతే బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు వస్తాయని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో బీజేపీ అధిష్టానం ఈ దిద్దుబాటు చర్యలకు దిగింది.


కాగా కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2020లో రైతుల నిరసనల సమయంలో పంజాబ్‌కు చెందిన ఒక మహిళా రైతును ‘బిల్కిస్ బానో’గా అభివర్ణించింది. అంతకుముందు ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఒక వృద్ధురాలిని ఉద్దేశిస్తూ... ఆ మహిళ రూ.100కు అందుబాటులో ఉంటుందని, నిరసనల కోసం ఆమెను తీసుకెళ్లవచ్చునని పేర్కొన్నారు.

Updated Date - Aug 26 , 2024 | 06:10 PM