Share News

Bangladesh Clashes: భారత్ - బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్.. అదనపు బలగాలను మోహరిస్తున్న బీఎస్ఎఫ్

ABN , Publish Date - Aug 05 , 2024 | 05:38 PM

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌ (Bangladesh Clashes)లో తీవ్ర అల్లర్లకు కారణమైంది. ఇప్పటికే ఆ దేశంలో వందల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు. ఆదివారం ఒక్క రోజే పోలీసులు జరిపిన కాల్పుల్లో 100 మంది నిరసనకారులు చనిపోయారు.

Bangladesh Clashes: భారత్ -  బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్.. అదనపు బలగాలను మోహరిస్తున్న బీఎస్ఎఫ్

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌ (Bangladesh Clashes)లో తీవ్ర అల్లర్లకు కారణమైంది. ఇప్పటికే ఆ దేశంలో వందల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు. ఆదివారం ఒక్క రోజే పోలీసులు జరిపిన కాల్పుల్లో 100 మంది నిరసనకారులు చనిపోయారు. దీంతో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.

షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేయాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. దేశం అట్టుడుకుతున్న వేళ.. సోమవారం మధ్యాహ్నం ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా సమర్పించారు. అనంతరం రక్షణ నిమిత్తం ఆమె సీ-130 మిలటరీ విమానంలో భారత్‌కి పయనమయ్యారు. కాగా పొరుగుదేశంలో ఉద్రికత్తల నడుమ భారత్ కూడా అప్రమత్తం అయింది. షేక్ హసీనా భారత్‌కి వస్తున్నారని తెలుసుకున్న నిరసనకారులు మన దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉండటంతో భారత్‌- బంగ్లా సరిహద్దులో బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) హైఅలర్ట్‌ ప్రకటించింది.


దాదాపు 4,096 కిలోమీటర్ల మేర ఉన్న భారత్‌- బంగ్లా సరిహద్దులో అదనపు బలగాలను వెంటనే మోహరించాలని బీఎస్ఎఫ్ అధికారులను ఆదేశించింది. అందరూ కమాండర్లు బార్డర్లోనే ఉండాలని సూచించింది. బంగ్లాదేశ్‌లో హింస పెచ్చుమీరుతున్న వేళ, సైన్యం ప్రభుత్వ బాధ్యతలు చేపట్టడంతో నిరసనకారులు భారత్‌లోకి వచ్చే అవకాశం ఉందని అందుకే ఈ చర్యలు చేపట్టినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునేందుకు సైన్యం సిద్ధంగా ఉందని బీఎస్ఎఫ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో కూచ్‌బెహార్, పెట్రాపోల్ సరిహద్దుల్లో భద్రత భారీగా పెంచారు. పరిస్థితులను సమీక్షించేందుకు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌ సింగ్‌ ఛౌదరి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చేరుకున్నారు.


ఢిల్లీలో నల్లటి వస్త్రాలతో నిరసనలు..

ఓ వైపు బంగ్లాదేశ్‌లో నిరసనలు జరుగుతుండగా.. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఉద్యోగులంతా తమ జేబులకు నల్లటి వస్త్రాలను చుట్టుకుని ఆఫీసులకు వచ్చారు. అయితే ఇది బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికా లేదా నిరసనలకు మద్దతు తెలపడానికా అనేది స్పష్టంగా తెలియరాలేదు.

సైనిక పాలన.. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం

షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ దేశ ఆర్మీ చీఫ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటించారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పార్టీలతో చర్చించి ఆందోళనలను అదుపులోకి తీసుకొస్తామని వివరించారు. భద్రత కోసం ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారని, దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. బంగ్లాదేశ్‌లో త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది.

విమానాల రద్దు..

బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళే ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లుఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.

Sheikh Hasina Resigns: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా!.. దేశం విడిచి వెళ్లిపోయిన షేక్ హసీనా


For Latest News and National News click here

Updated Date - Aug 05 , 2024 | 06:11 PM