Dengue fever: వామ్మో.. పెరుగుతున్న డెంగ్యూ.. 461 మంది అస్వస్థత
ABN , Publish Date - Jan 12 , 2024 | 08:06 AM
రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు అధికమవుతుండటంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలు మరో రెండు వారాలపాటు అప్రమత్తంగా వ్యవహరించి వేడినీళ్లనే తాగాలని సూచించింది.
- 2 వారాలపాటు వేడి నీళ్లే తాగండి
- ఆరోగ్యశాఖ సూచన
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు అధికమవుతుండటంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలు మరో రెండు వారాలపాటు అప్రమత్తంగా వ్యవహరించి వేడినీళ్లనే తాగాలని సూచించింది. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాల ప్రబలాయని, గతేడాది డిసెంబర్ వరకూ 9,121 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ జ్వరాలకు రాష్ట్రవ్యాప్తంగా పదిమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ యేడాది ఈ నెల 8 వరకు రాష్ట్రంలో 461 మంది డెంగ్యూ జ్వరంతో అస్వస్థతకు గురయ్యారని, మరో రెండువారాలపాటు ఈ జ్వరాలు ప్రబలే అవకాశాల ఉన్నాయని వివరించారు. ఈశాన్య రుతుపవనాలు ఇంకా నిష్క్రమించలేదని, ప్రస్తుతం చలిగాలులు అధికమై చల్లటి వాతావరణం నెలకొనడంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయని చెప్పారు. ప్రతిరోజూ పదిమంది దాకా ఈ జ్వరాలతో చికిత్స కోసం ఆసుపత్రులకు వస్తున్నారని వివరించారు. ఈ జ్వరాలతోపాటు విరేచనాలు, వైరల్, టైఫాయిడ్ జ్వరాలు కూడా అధికమవుతున్నాయని హెచ్చరించారు. చిన్నారులు కూడా ఈ జ్వరాల బారినపడుతున్నారని, వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించి చికిత్సలందించాలన్నారు. న్యుమోనియా కూడా అక్కడక్కడా అధికమవుతున్నట్లు సమాచారం అందుతోందన్నారు. బాగా కాచిన వేడినీటిని చల్లార్చి తాగాలని సూచించారు. ఉడకని ఆహార పదార్థాల జోలికి వెళ్ళకూడదని, రోడ్ సైడ్, ఫుట్‌పాత్ టిఫిన్ సెంటర్లలో తినుబండారాలు, ఆహార పదార్థాలను తినకూడదని, కాళ్లుచేతులను తరచూ కడిగి శుభ్రం చేసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.