Tantex: ఘనంగా నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు.. ఈసారి ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Mar 29 , 2025 | 08:38 AM
అమెరికా దేశం డల్లాస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 212వ సాహిత్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈసారి డయాస్పోరా కథల పరిణామం అనే అంశంపై నిర్వహించిన సభ ఆద్యంతం ఉత్సహ భరితంగా సాగింది.

అమెరికా: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ప్రతి నెలా నిర్వహించే 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు ఆద్యంతం రసభరితంగా సాగింది. మార్చి 23న "డయాస్పోరా కథల పరిణామం" అనే అంశంపై 212వ సాహిత్య సదస్సును డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై వక్తల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. స్వాతంత్ర్య పోరాటయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లను స్పర్శించుకున్నారు. వారి వీర గాథలు, స్వాతంత్ర్య పోరాటం నాటి రోజులను గుర్తు చేసుకుని తరించారు.
ముందుగా పురందర దాసు కీర్తన "వేంకటా చల నిలయం" గేయాన్ని ఆలపించి సమన్విత మాడా సాహిత్య సదస్సును ప్రారంభించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు దివంగత శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టాంటెక్స్ తదుపరి సమన్వయ కర్త దయాకర్ మాడా సూచన మేరకు కార్యక్రమానికి వచ్చిన సాహితీ ప్రియులంతా నిమిషం పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ముఖ్య అతిథి, తెలుగులో అనేక కథలను వ్రాసి సాహిత్య సేవలందించిన భాస్కర్ పులికల్‌ను దయాకర్ మాడా సాహితీ ప్రియులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా సాగింది.
‘నిర్మలాదిత్య’ కలం పేరుతో తాను 30 ఏళ్లుగా తెలుగులో కథలు రాస్తున్న తీరు, "డయాస్పోరా కథల పరిణామం"పై ప్రసంగించారు భాస్కర్ పులికల్. 1998లో అమెరికా వలస రావడంతో తన కథలు ఏ విధంగా డయాస్పోరా కథలయ్యాయో అద్భుతంగా వివరించారు. అదే విధంగా డయాస్పోరా కథ నిర్వచనం సహా అనేక విషయాలను సాహితీ ప్రియులకు ఆయన చక్కగా తెలియజేశారు. అలాగే ఇదివరకే అమెరికా దేశానికి వలస వచ్చిన ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, ఐరిష్, ఇటాలియన్ భాషల చరిత్ర, ప్రగతిని వర్ణిస్తూ, తెలుగు భాష భవిష్యత్తు వెలుగొందేందుకు పలు సూచనలు సైతం చేశారు. ఆ తర్వాత అరగంటపాటు ప్రశ్నలు, సమాధానాల కార్యక్రమం ఆసక్తికరంగా జరిగింది.
అనంతరం భాస్కర్ పులికల్ ప్రసంగాన్ని మెచ్చుకుంటూ డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, డాక్టర్ పుదూరు జగదీశ్వరన్, లెనిన్ వేముల, దయాకర్ మాడా, కాశీనాధుని రాధ, హరి చరణ్ ప్రసాద్, విజయ మామునూరి, పృథ్వీ తేజా, నవీన్ గొడవర్తి, నిడిగంటి గోవర్ధనరావు తమ స్పందన తెలియజేశారు. అనంతరం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రశేఖర్ పొట్టిపాటి తరఫున సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా ముఖ్య అతిథి భాస్కర్ పులికల్‌ని సన్మానించారు. ఆయనకు టాంటెక్స్ తరఫున జ్ఞాపిక, సన్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టాంటెక్స్ సంస్థ ద్వారా తెలుగు భాషా సాహిత్యానికి చేస్తున్న సేవ చాలా గొప్పదంటూ భాస్కర్ ప్రశంసించారు. సాహితీ ప్రియులను భాగస్వాములుగా చేస్తూ 82 నెలలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక "మన తెలుగు సిరి సంపదలు" చాలా బాగుందంటూ కొనియాడారు.
అనంతరం భారత స్వాతంత్య్ర కోసం పోరాడి ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ అంశాన్ని లెనిన్ వేముల ప్రస్తావించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో 94 ఏళ్ల క్రితం అంటే 1931, మార్చి 23 చీకటి రోజుగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. శ్వేత జాతి అహంకారంతో విప్లవ వీరుల గొంతుకలు పైశాచికంగా మూయించిందని మండిపడ్డారు. భగత్ సింగ్ సహ రాజ్ గురు, సుఖ్ దేవ్‌కు ఇదే రోజు ఉరిశిక్ష అమలు చేసి స్వాతంత్య్ర సాధన కాంక్షను శ్వేత జాతి చెరిపేసే ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు. కానీ, వారి త్యాగాలు తరాలు గడచినా ఉత్తేజాన్ని కలుగిస్తూనే ఉంటాయని చెప్పుకొచ్చారు. అనంతరం కవి ఏనుగు లక్ష్మణ రచించిన పద్యాలను పాడారు డాక్టర్ పుదూరు జగదీశ్వరన్.
ఈ కార్యక్రమానికి సంస్థ పూర్వాధ్యక్షులు సతీశ్ బండారు, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి.. సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ పుదూరు జగదీశ్వరన్, సంస్థ ఉత్తరాధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, శ్రీహరి సింగం, శ్రీహరి చరణ్ ప్రసాద్, శ్రీమతి కాశీనాధుని రాధ, నగేశ్ పులిపాటి, శ్యామల, విజయ మాములూరి, లెనిన్ తాళ్లూరి, లెనిన్ బంద, లెనిన్ వేముల, మాధవరావు గోవిందరాజు, శివ, నవీన్ గొడవర్తి, పృథ్వీ తేజా, గోవర్ధనరావు నిడిగంటి సహా పలువురు సాహితీ ప్రియులు హాజరయ్యారు. టాంటెక్స్ పాలక మండలి ఉపాధిపతి, వేదిక సమన్వయ కర్త దయాకర్ మాడా.. సంస్థ కార్యవర్గానికి, ఆర్థికంగా తోడ్పడుతున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన టాంటెక్స్ అధ్యక్షుడు చంద్రశేఖర్ పొట్టిపాటి, ఉత్తరాధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడాను సంస్థ పాలకమండలి, అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందించారు.