Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..
ABN , Publish Date - Mar 29 , 2025 | 09:13 AM
ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి దద్దరిల్లాయి. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో పలువురు మావోలు మృతిచెందారు.

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి దద్దరిల్లాయి. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 20 మంది మావోలు మృతిచెందారు. గోగుండ కొండల్లో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారం అందిన భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోలు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
సుక్మా జిల్లా కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) దళాలు శుక్రవారం రాత్రి కూంబింగ్ చేపట్టాయి. ఇవాళ తెల్లవారుజామున వారికి మావోలు తారస పడడంతో కాల్పులు మెుదలయ్యాయి. ప్రస్తుతం మావోలు ఉన్న ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అలాగే చుట్టుపక్కల అటవీ ప్రాంతాన్ని ముమ్మర తనిఖీ చేస్తున్నారు.
మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(IED) పేలి ఓ జవాన్ గాయపడిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం సదరు జవాన్ నారాయణపూర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ తెలిపారు. బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లా అనేది మావోయిస్టు అత్యంత ప్రభావిత జిల్లాల్లో ఒకటిగా పేరొందింది. ఇప్పటికే అనేకసార్లు ఇక్కడ ఎదురుకాల్పులు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
ఆన్‌లైన్ మోసాలకు ఇక అడ్డుకట్ట..