ED Raids: కేంద్ర మంత్రి సన్నిహితుడిపై ఈడీ ఫోకస్
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:54 PM
ED Raids: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడు హులాస్ పాండేపై ఈడీ ఫోకస్ చేసింది. ఆయన నివాసంతోపాటు సంస్థల్లో ఏక కాలంలో సోదాలు చేపట్టింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: కేంద్ర మంత్రి, లోక్ జన శక్తి (రామ్ విలాస్ పాశ్వాన్) అధినేత చిరాగ్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడైన హులాస్ పాండే నివాసం, సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తనిఖీలు నిర్వహించింది. అందులోభాగంగా పాట్నా, బెంగళూరు, న్యూఢిల్లీలో సోదాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్ధిక అవకతవకలు నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
అయితే ఈడీ మాత్రం ఎందుకోసం ఈ సోదాలు చేపట్టిందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు.. ఇంకా కొనసాగతోన్నాయి. మూడు నగరాల్లోని ఆయనకు చెందని సంస్థల్లోని పత్రాలను ఈడీ అధికారులు క్షణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడుగా కొనసాగుతోన్న హులాస్ పాండేపై ఈడీ దాడులు చేసి సోదాలు చేపట్టడంతో.. బిహార్‌లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఇక 2012లో ప్రైవేట్ మిలటరీ రణవీర్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా హత్య కేసులో హులాస్ పాండేపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీబీఐ ఆయనపై ఛార్జి షీట్ దాఖలు చేసింది. దీంతో 2023 డిసెంబర్‌లో పార్టీ పార్లమెంటరీ బోర్డ్ చైర్మన్ పదవికి పాండే రాజీనామా చేశారు. అంతేకాకుండా.. ఈ హత్య కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండిచారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని పాండే ఆరోపించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ చార్జిషీట్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో ఈ హత్య కేసులో పాండేకు ఉపశమనం లభించినట్లు అయింది.
2012, జూన్ 1వ తేదీన బిహార్‌లోని బోజ్‌పూర్ జిల్లాలో రణవీర్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియాను ఆగంతకులు కాల్చి చంపారు. బిహార్‌లోని పలు జిల్లాల్లో అగ్రవర్ణ రైతుల్లో ఉన్న రాజకీయ ప్రాబల్యం బ్రహ్మేశ్వర్ సింగ్ వల్ల పోతుందనే భయంతో ఆయన హత్యకు పాండే కుట్ర పన్నారంటూ సీబీఐ తన ఛార్జీ షిట్‌లో పేర్కొంది.
Also Read: జాక్ పాట్ కొట్టిన ట్రాఫిక్ పోలీసులు
మరోవైపు మాజీ ఎమ్మెల్సీ పాండే.. లోక్‌జన శక్తి పార్టీలో చేరక ముందు బిహార్ సీఎం, జనతాదళ్ (యు) అధినేత నితీష్ కుమార్ పార్టీలో సభ్యుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే.
Also Read: మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది
ఇంకోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఏడాది చివర్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి జేడీ (యూ) అధినేత నీతిష్ కుమార్ పాలన పగ్గాలు చేపడతారంటూ.. ఆ పార్టీ అగ్రనేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలో బిహార్ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందంటూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆ క్రమంలో సీఎం నితీష్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేసిన విషయం విధితమే.
For National News And Telugu News