Sikkim: కొనసాగుతున్న సహాయక చర్యలు.. చిక్కుకున్న 1,200 మంది
ABN , Publish Date - Jun 17 , 2024 | 07:27 AM
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో 6 మంది మృతి చెందారు. 2 వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో 800 మందిని అధికారులు రక్షించారు.
గ్యాంగ్‌టక్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో 6 మంది మృతి చెందారు. 2 వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో 800 మందిని అధికారులు రక్షించారు. ఇంకా 1200 మంది చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. భీకర వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అన్నారు.
వాతావరణం అనుకూలించకపోవడంతో ఆదివారం తరలింపు ప్రక్రియ కొనసాగలేదని, అనుకూలిస్తే గాలి లేదా రోడ్డు మార్గంలో తరలింపు చేపడతామని చుంగ్తాంగ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) కిరణ్ థాటల్ తెలిపారు. రక్షించిన పర్యాటకులకు లాచుంగ్ పట్టణంలోని వివిధ హోటళ్లలో వసతి కల్పిస్తున్నారు.
అసౌకర్యం కలిగితే, పర్యాటకులు లాచుంగ్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. పర్యాటకుల తరలింపు ప్రక్రియపై చర్చించేందుకు SDM థాటల్ చుంగ్తాంగ్ BDO పిపాన్ లాచుంగ్.. హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించారు. తరలింపు పూర్తయ్యే వరకు పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేయవద్దని సూచించారు.
రంగంలోకి మంత్రి..
సిక్కింలో ఆకస్మిక వరదలు, చిక్కుకున్న పర్యాటకుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మంత్రి దహల్ లాచుంగ్ పర్యాటకులతో మాట్లాడారు. చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా వారిని సురక్షితంగా తరలిస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాహ్యప్రపంచంతో ఆ ప్రాంతాల ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగి పడటంతో15 మంది విదేశీయులతో సహా 1,200 మందికి పైగా పర్యాటకులు లాచుంగ్ పట్టణంలో చిక్కుకుపోయారు.