ధాన్యం సేకరణకు సన్నద్ధం కావాలి
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:11 PM
2024-25 యాసంగి ధాన్యం మార్కెట్‌కు రానున్న నేపథ్యంలో సన్నద్ధం కావాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : 2024-25 యాసంగి ధాన్యం మార్కెట్‌కు రానున్న నేపథ్యంలో సన్నద్ధం కావాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం కొనుగోలు 2024-25 సన్నాహక సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఈ యాసంగిలో వరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రేడ్-ఏ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి ప్రోత్సాహకంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ సంవంత్సరం రబీఓ జిల్లా వ్యాప్తంగా లక్ష 25వేల ఎకరాల్లో ధాన్యం సాగైందని, 3,01,748 మెట్రిక్ టన్నుట దాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అంచనా ఉండగా, మార్కెట్ 2,86,660 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో మిళ్లర్లు 1,38,804 మెట్రిక్ టన్నులు, సివిల్ సప్లైయిస్ కార్పొరేషన్ ద్వారా 1,47,856 మెట్రిక్ టన్నులు దాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో 176 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 91,885 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని సూచించారు. సన్న ధాన్యం రూ.31 కోట్ల బోనస్ రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఈ రబీలో ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం ఐకేపీ ద్వారా 102, సహకార శాఖ పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 82, డీసీఎంఎస్ ద్వారా 4 కొనుగోలు కేంద్రాలతో కలిపి 188 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రబీ ధాన్యం కొనుగోలుకు 37 లక్షల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు పాల్గొన్నారు.