Share News

పన్నూ హత్యకు భారతీయుల కుట్ర

ABN , Publish Date - Oct 19 , 2024 | 04:09 AM

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ పన్నూ హత్యకు భారత్‌కు చెందిన పరిశోధన, విశ్లేషణ విభాగం (రా) మాజీ అధికారి వికాస్‌ యాదవ్‌ కుట్ర పన్నారని, అతనే ప్రథమ నిందితుడు అని అమెరికా న్యాయశాఖ తాజాగా అభియోగాలు మోపింది.

పన్నూ హత్యకు భారతీయుల కుట్ర

  • డబ్బులిచ్చి అంతమొందించాలని చూశారు

  • రా మాజీ అధికారి వికాస్‌ యాదవ్‌ ప్రథమ నిందితుడు.. ఆయనకు నిఖిల్‌ గుప్తా సహకారం

  • ఇద్దరూ కలసి ‘హిట్‌మ్యాన్‌’తో బేరం

  • అమెరికా న్యాయశాఖ అభియోగాలు

న్యూఢిల్లీ, అక్టోబరు, 18: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ పన్నూ హత్యకు భారత్‌కు చెందిన పరిశోధన, విశ్లేషణ విభాగం (రా) మాజీ అధికారి వికాస్‌ యాదవ్‌ కుట్ర పన్నారని, అతనే ప్రథమ నిందితుడు అని అమెరికా న్యాయశాఖ తాజాగా అభియోగాలు మోపింది. గతంలో న్యూయార్క్‌ కోర్టుకు సమర్పించిన అభియోగపత్రంలో వికాస్‌ యాదవ్‌ను సీసీ-1గా పేర్కొంది. తాజాగా కోర్టుకు సమర్పించిన అభియోగపత్రంలో వికా్‌సకు మరో భారతీయుడు నిఖిల్‌ గుప్తా కూడా సహకరించారని తెలిపింది. వీరిపై కిరాయికి హత్య, కిరాయి హత్యకు కుట్ర, మనీ లాండరింగ్‌ కింద అభియోగాలు నమోదు చేసింది. నేరారోపణ రుజువైతే వీరికి నలభై ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో వికాస్‌ యాదవ్‌ ఉనికిని గురువారం బహిర్గతం చేసిన యూఎస్‌ న్యాయశాఖ అతడు పరారీలో ఉన్నాడని పేర్కొంది. వికాస్‌, నిఖిల్‌ కలసి భారత మూలాలు కలిగిన అమెరికా పౌరుడిని ఈ నేలపై హత్య చేయడానికి కుట్ర పన్నారని అభియోగాలు మోపింది.


హత్య కోసం నిఖిల్‌ గుప్తాను వికాస్‌ యాదవ్‌ గత ఏడాది మే నెలలో నియమించుకున్నట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు. ఆ అభియోగపత్రంలో వికాస్‌ యాదవ్‌ భారత విదేశాంగ నిఘా సర్వీస్‌ ఉద్యోగినని, సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ హోదాలో సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, ఇంటెలిజెన్స్‌ విభాగాలను పర్యవేక్షించేవాడినని, సీఆర్‌పీఎ్‌ఫలో కూడా పనిచేశానని, యుద్ధ విమానాల శిక్షణ కూడా తీసుకున్నానని చెప్పుకొన్నాడని పేర్కొన్నారు. అయితే దీనిని భారత ప్రభుత్వం మాత్రం నిర్ధారించలేదు. కానీ వికాస్‌ యాదవ్‌ మిలిటరీ డ్రస్‌లో ఉన్న ఫొటోను ఒకదానిని అభియోగపత్రానికి జత చేశారు.

అలాగే ఒక కారులో కూర్చుని ఇద్దరు వ్యక్తులు అమెరికా డాలర్లు మార్చుకుంటున్న మరో ఫొటోను కూడా కోర్టుకు సమర్పించారు. నిఖిల్‌ గుప్తా, వికాస్‌ యాదవ్‌ తరఫున పనిచేసే మూడో నిందితుడు, ఇంకా గుర్తించాల్సిన ‘హిట్‌మ్యాన్‌’కు కారులో ఆ డబ్బు ఇస్తున్నట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. పన్నూను అంతమొందిస్తే గుజరాత్‌ కోర్టులో గుప్తాపై ఉన్న క్రిమినల్‌ కేసును విత్‌డ్రా చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రాసిక్యూషన్‌ పేర్కొంది.


ఈ హత్యకు సంబంధించి వికాస్‌, నిఖిల్‌ కలసి అండర్‌ కవర్‌ ఫెడరల్‌ ఏజెంట్‌ ‘హిట్‌మ్యాన్‌’ను కలిసి లక్ష డాలర్లకు బేరం కుదుర్చుకున్నారని, దానిలో భాగంగా గతేడాది జూన్‌లో 15 వేల డాలర్లు అడ్వాన్స్‌గా ఇచ్చారని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వస్తారనగా ఈ డీల్‌ జరిగిందని, ఆ తర్వాత కొద్ది రోజులకే కెనడాలో మరో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య జరిగిందని తెలిపారు. జూన్‌లోనే పన్నూపై హత్యాయత్నం జరిగిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు. మోదీ పర్యటన సమయంలో కానీ, పర్యటన ముగిసిన వెంటనే కానీ హత్య చేయవద్దని హిట్‌మ్యాన్‌కు గుప్తా సూచించాడని, అయితే జూన్‌ 18న నిజ్జర్‌ హత్య తర్వాత వారి ప్లాన్‌ మారిపోయిందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఇక నిరీక్షించాల్సిన అవసరం లేదని జూన్‌ 20న హిట్‌మ్యాన్‌కు గుప్తా చెప్పినట్లు యూఎస్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గుప్తా న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో అమెరికా కస్టడీలో ఉన్నాడు.

  • వికాస్‌ ప్రభుత్వ ఉద్యోగి కాదు

అభియోగాలు నమోదైన వెంటనే భారత ప్రభుత్వం ప్రతిస్పందించిందని, వికాస్‌ యాదవ్‌ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి కాదని, ఈ కేసు విషయంలో భారత సహకారానికి ప్రాసిక్యూటర్లు సంతృప్తిగా ఉన్నారని అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ పేర్కొన్నారు. అమెరికా అభియోగాలను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుందని, సంబంధిత శాఖలు దీనిని ఇప్పటికే పర్యవేక్షిస్తున్నాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated Date - Oct 19 , 2024 | 04:09 AM