Students: జనవరి 22న పబ్లిక్ హాలిడే ఇవ్వడంపై కోర్టుకెక్కిన విద్యార్థులు..కోర్టు క్లారిటీ
ABN , Publish Date - Jan 21 , 2024 | 01:47 PM
యూపీలోని అయోధ్యలో రేపు(జనవరి 22న) రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 22ని మహారాష్ట్ర ప్రభుత్వం సెలవురోజుగా తీసుకున్న నిర్ణయాన్ని నలుగురు న్యాయ విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య(ayodhya)లో రేపు(జనవరి 22న) రామ మందిర్(ram mandir) ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు హాఫ్ డే మాత్రమే కొనసాగుతాయని ప్రకటించారు. ఈ క్రమంలోనే జనవరి 22న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ మహారాష్ట్ర(maharashtra) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నలుగురు న్యాయ విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాలు చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసిన విద్యార్థులలో ముంబైలోని MNLU, GLC నిర్మా లా స్కూల్‌లో న్యాయశాస్త్రం చదువుతున్న శివంగి అగర్వాల్, సత్యజిత్ సిద్ధార్థ్ సాల్వే, వేదాంత్ గౌరవ్ అగర్వాల్, ఖుషీ సందీప్ బంగియా ఉన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ram Mandir: రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ.. ఈ 6 మంత్రాలు జపించండి
జస్టిస్ జేఎల్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆదివారం ఈ కేసును విచారించింది. అయితే నలుగురు న్యాయ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) బాంబే హైకోర్టు(bombay court) ఈరోజు కొట్టివేసింది. విభిన్న మతాలున్న దేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాస్తవానికి లౌకికవాదాన్ని పెంపొందిస్తుందని జస్టిస్ జిఎస్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ప్రత్యేక బెంచ్ తెలిపింది. ప్రభుత్వ సెలవుల విషయంపై పూర్వాపరాలను ప్రస్తావిస్తూ ఈ మేరకు బెంచ్ విద్యార్థులను వాదనలను తొసిపుచ్చింది.
ఏదైనా మతపరమైన కార్యక్రమాన్ని జరుపుకోవడానికి సెలవు దినంగా ప్రకటించడం రాజ్యాంగంలోని లౌకికవాద సూత్రాలను ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ మతంతోనూ సహవాసం చేయదని, ప్రోత్సహించదని విద్యార్థులు వాదించారు. ప్రభుత్వ సెలవుల ప్రకటనకు సంబంధించి అధికార రాజకీయ పార్టీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండదని విద్యార్థులు అంటున్నారు. దేశభక్తి లేదా చారిత్రాత్మక వ్యక్తి జ్ఞాపకార్థం సెలవు దినాన్ని ప్రకటించవచ్చు.
కానీ రామ్ లల్లా పవిత్రోత్సవ కార్యక్రమం ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా మతానికి చెందినదని అంటున్నారు. అటువంటి కార్యక్రమం వల్ల విద్యాసంస్థలు, బ్యాంకింగ్, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సేవలను మూసివేయడంతో ఆర్థికంగా నష్టంతోపాటు ప్రజా విధులకు అంతరాయం కలుగుతుందని పిటిషన్‌లో విద్యార్థులు పేర్కొన్నారు.