Governor: కేంద్రం నిధులు ఏం చేస్తున్నారు...? రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించిన గవర్నర్
ABN , Publish Date - Jan 19 , 2024 | 11:22 AM
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రప్రభుత్వం అందజేస్తున్న నిధులు ఏం చేస్తున్నారో చెప్పాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
- వివరాలు పంపాలంటూ లేఖ
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రప్రభుత్వం అందజేస్తున్న నిధులు ఏం చేస్తున్నారో చెప్పాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల కార్యదర్శులకు పంపించారు. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలుచేస్తుండగా, వాటిల్లో పలు పథకాలకు కేంద్రం నిధులందిస్తోంది. ఈ పథకాల అమలుకు కేంద్రం వాటా అధికమే. ఈ నేపథ్యంలో, డీఎంకే అధికారం చేపట్టినప్పటి నుంచి, కేంద్రప్రభుత్వం తగిన నిధులు ఇవ్వకుండా పక్షపాతం చూపుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. వాటిపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి సహా పలువురు మంత్రులు కేంద్రం అందిస్తున్న నిధుల వివరాలను లెక్కలతో సహా వెల్లడిస్తున్నారు. అదే సమయంలో, డీఎంకే నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పిస్తూ, రాష్ట్రప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రప్రభుత్వం అందిస్తున్న నిధులపై గవర్నర్ దృష్టి సారించారు. ఆ క్రమంలో, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అమలుచేస్తున్న పథకాలు, వాటికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వాటా వివరాలు, పథకానికి అందించిన నిధులు, ఖర్చుపెట్టినది తదితర వివరాలు తెలపాలని రాష్ట్రప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి కిర్లోష్ కుమార్ ద్వారా ఈ నెల 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదా్‌సమీనాకు పంపించారు. ప్రస్తుతం పథకాల అమలుతీరును తెలియజేయాలని ఆయా శాఖల కార్యదర్శులకు సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ వివరాలు అత్యవసరంగా పరిగణించి అధికారులు త్వరితగతిన వివరాలు పంపించాలని సీఎస్ పేర్కొన్నారు. ఇదిలా వుండగా మద్రాస్ ఐఐటీలో ఏర్పాటు చేసిన ‘ఎంటర్‌ప్రిన్యూర్షిప్ అండ్ రూరల్ డెవల్‌పమెంట్ కాంక్లేవ్’కు గురువారం వెళ్లిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు.