High Court: ఇద్దరు మంత్రులకు హైకోర్టు షాక్.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Aug 08 , 2024 | 12:43 PM
డీఎంకే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు సీనియర్ మంత్రులకు మద్రాస్ హైకోర్టు(Madras High Court) షాకిచ్చింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారన్న కేసులో వారిద్దరికీ విముక్తి కల్పిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
- అక్రమార్జన కేసులో కిందికోర్టు తీర్పు రద్దు
- రోజువారీ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టీకరణ
చెన్నై: డీఎంకే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు సీనియర్ మంత్రులకు మద్రాస్ హైకోర్టు(Madras High Court) షాకిచ్చింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారన్న కేసులో వారిద్దరికీ విముక్తి కల్పిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. పైగా ఈ కేసులో ఆ ఇద్దరు మంత్రులు రోజువారీ విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశన్(High Court Judge Anand Venkatesan) బుధవారం తీర్పు వెల్లడించారు.
ఇదికూడా చదవండి: State Govt: కేంద్రమంత్రి క్షమాపణలు చెబితే ఓకే..
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక, మానవవనరుల అభివృద్ధిశాఖా మంత్రిగా ఉన్న తంగం తెన్నరసు 2006 నుంచి 2011 వరకు కరుణానిధి ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖా మంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించి రూ.76.40 లక్షల మేర ఆస్తులను సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై 2012లో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించిన శ్రీవిల్లిపుత్తూరు ప్రిన్సిపల్ కోర్టు ఈ కేసు నుంచి ఆయన్ని విముక్తుడిని చేస్తూ 2022 సంవత్సరం డిసెంబరు నెలలో తీర్పునిచ్చింది. అదేవిధంగా ప్రస్తుతం రెవెన్యూ శాఖామంత్రిగా ఉన్న సాత్తూరు రామచంద్రన్ 2006-2011 మధ్యకాలంలో బీసీ సంక్షేమ శాఖామంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన రూ.45.56 లక్షల మేరకు ఆదాయానికి మంచి అక్రమాస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన భార్య ఆదిలక్ష్మి, మంత్రి స్నేహితుడు కేఎ్‌సబీ షణ్ముగమూర్తిపై కూడా ఏసీబీ అధికారులు 2012లో కేసు నమోదు చేశారు. ఈ కేసును కూడా శ్రీవిల్లిపుత్తూరు కోర్టు విచారణ జరిపి, 2022లో కొట్టివేసింది.
సుమోటోగా స్వీకరించిన హైకోర్టు...
అక్రమాస్తుల కేసులో నిందితులందరినీ శ్రీవిల్లిపుత్తూరు కోర్టు విముక్తులను చేయడాన్ని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశన్ సుమోటోగా స్వీకరించారు. ఈ కేసులో ఇద్దరు మంత్రులతో పాటు ఏసీబీ కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత మార్చి నుంచి జూన్ వరకు ఈ రెండు కేసులపై న్యాయమూర్తి పలు దఫాలుగా విచారణ జరిపారు. అన్ని వర్గాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి.. తుది తీర్పును మాత్రం తేదీ వెల్లడించకుండా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశన్ బుధవారం కీలక తీర్పును వెలువరించారు. సాత్తూర్ రామచంద్రన్, ఆయన సతీమణి, స్నేహితుడిపై నమోదైన అక్రమాస్తుల కేసులో ఆధారాలు లేవంటూ ఏసీబీ అధికారులు సమర్పించిన నివేదికను న్యాయమూర్తి తప్పుబట్టారు. అంతేగాక శ్రీవిల్లిపుత్తూరు కోర్టు ఈ కేసు నుంచి ఆ ముగ్గురిని విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
9 నుంచి రోజువారీ విచారణ జరపాలి
సాత్తూర్ రామచంద్రన్, ఆదిలక్ష్మి విశాలాక్ష్మి, షణ్ముగమూర్తి ఈ నెల 9వ తేదీ నుంచి రోజువారీ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. వీరిపై 2011లో నమోదైన అక్రమాస్తుల కేసు విచారణను శ్రీవిల్లిపుత్తూరు ప్రత్యేక కోర్టు రోజువారీగా విచారణ జరిపి, వీలైనంత త్వరగా తుది తీర్పు వెల్లడించాలని ఆదేశించారు. అదేవిధంగా మంత్రి తంగం తెన్నరసుపై నమోదైన కేసును కూడా సరైన ఆధారాలు లేని కారణంగా కింది కోర్టు రద్దుచేసింది. ఈ తీర్పును కొట్టివేస్తున్నట్టు పేర్కొన్నారు. తంగం తెన్నరసుతో పాటు ఆయన భార్య మణిమేఘలై కూడా ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రోజు విచారణకు హాజరు కావాలని, వీరిపై నమోదైన కేసులను రోజువారీగా విచారణ జరిపి తుది తీర్పును వెలువరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
వలలో పెద్ద చేపలు చిక్కడం లేదు...
సాధారణంగా ఇలాంటి కేసుల్లో పెద్ద చేపలు తప్పించుకుంటున్నాయని ఓ విదేశీ కవి రాసిన కవితను న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశన్ తీర్పు సందర్భంగా ప్రస్తావించారు. ఈ కేసులో హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కింది కోర్టు దృష్టిలో ఉంచుకోవాలని న్యాయమూర్తి సూచించారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్ క్రైంలో కేసు నమోదు..
Read Latest Telangana News and National News