WhatsApp: బలవంతం చేస్తే భారత్ నుంచి వెళ్లిపోతాం!
ABN , Publish Date - Apr 27 , 2024 | 04:14 AM
తమ వినియోగదారుల సందేశాలకు సంబంధించి ఎన్‌క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని బలవంతం చేస్తే నిరభ్యంతరంగా భారత్ నుంచి వైదొలుగుతామని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టం చేసింది.
ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ‘కొత్త ఐటీ నిబంధనలు-2021’లోని పలు సెక్షన్లను సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్‌బుక్ (ఇప్పుడు మెటా) సంస్థలు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా కోర్టు విచారణ జరిపింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరాల ధర్మాసనం ముందు వాట్సాప్ తరఫున సీనియర్ న్యాయవాది తేజస్ కరియా వాదనలు వినిపించారు. ‘వాట్సాప్‌లో సందేశాల భద్రత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానాన్ని అవలంబిస్తున్నాం.
సందేశాన్ని పంపిన వారు.. గ్రహీత మాత్రమే దాన్ని చదవగలరు. కొత్త నిబంధనల మేరకు ఇప్పుడు ఆ ఎన్‌క్రిప్షన్ విధానాన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు చేయాలని చెబితే భారత్ నుంచి వైదొలుగుతాం’ అని తేల్చి చెప్పారు. ఐటీ నిబంధనల్లోని 4 (2) సెక్షన్ మేరకు చాట్‌లను ట్రేస్ చేయడం, మూలాలను గుర్తించడం లాంటివి చేయాల్సి ఉంటుందన్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని.. రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. సామాజిక మాధ్యమ సంస్థలతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే కొత్త నిబంధనలు తెచ్చారని ఆక్షేపించారు. దీంతో కోర్టు కలుగజేసుకొని ఇతర దేశాల్లో ఇటువంటి చట్టాలు లేవా అని ప్రశ్నించింది. దీనికి కరియా బదులిస్తూ.. ‘ఏ దేశంలోనూ ఇటువంటి నిబంధనలు లేవు’ అని తెలిపారు. వాదనల అనంతరం కోర్టు.. విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది.