Share News

Bangalure Cafe Blast: నిందితుడి లేటెస్ట్ ఫోటోలను రిలీజ్ చేసిన ఎన్ఐఏ

ABN , Publish Date - Mar 09 , 2024 | 04:39 PM

సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితుడి కొత్త ఫోటోలను దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారంనాడు విడుదల చేసింది. మార్చి 1న జరిగిన ఈ పేలుడులో సుమారు 10 మంది గాయపడ్డారు. 3వ తేదీన కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది.

Bangalure Cafe Blast: నిందితుడి లేటెస్ట్ ఫోటోలను రిలీజ్ చేసిన ఎన్ఐఏ

బెంగళూరు: సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ (Rameshwarm Cafe blast) కేసులో నిందితుడి కొత్త ఫోటోలను దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శనివారంనాడు విడుదల చేసింది. మార్చి 1న జరిగిన ఈ పేలుడులో సుమారు 10 మంది గాయపడ్డారు. 3వ తేదీన కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది.


కేఫ్‌లో పేలుడు జరిగిన సుమారు ఒక గంటకు నిందితుడు ఒక బస్సు ఎక్కుతుండటం సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. టైమ్‌స్టాంప్ మధ్యాహ్నం 2.03 గంటలుగా వీడియోలో ఉండగా, 12.56 గంటలకు కేఫ్‌లో పేలుడు జరిగింది. అనుమానితుడు టీ-షర్డ్, టోపీ, ఫేస్ మాస్క్ వేసుకుని కనిపించాడు. కాగా, అదే రోజు (మార్చి1) మరో ఫుటేజిలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక బస్సు స్టేషన్ లోపల అతను తిరుగుతున్నట్టుగా ఉంది. అనుమానితుడికి సంబంధించి సమాచారం తమకు తెలియజేస్తే రూ.10 లక్షలు రివార్డుగా ఇస్తామని కూడా ఎన్ఐఏ ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరును గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది.


ఈ కేసు విచారణలో ఎన్ఐఏకు బెంగళూరు పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సహకారం అందిస్తోంది. విచారణలో భాగంగా బల్లారి జిల్లాలోని కౌల్ బజార్‌లో ఒక బట్టల వ్యాపారిని, నిషేధిత పాపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన మరో వ్యక్తిని ఎన్ఐఏ టీమ్ ఇంతవరకూ అరెస్టు చేసింది. ఎన్ఐఏ సమాచారం ప్రకారం, పేలుడు ఘటనకు పాల్పడిన నిందితుడు తన పని ముగియగానే బస్సులో తుమకూరు, బళ్లారి, బీదర్, భత్కల్ సహా పలు ప్రాంతాల్లో బస్సుల్లో తిరిగాడని, విచారణకు దొరక్కుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు తన ఆహార్యంలో మార్పులు చేసుకున్నాడని తెలుస్తోంది.


తెరుచుకున్న కేఫ్

కాగా, పేలుడు ఘటన అనంతరం మూతపడిన రామేశ్వరం కేఫ్‌ శనివారం తిరిగి తెరుచుకుంది. ఈసారి కేఫ్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంట్రన్స్ వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. హ్యాండ్‌హెల్డ్ డిటెక్టర్లతో కస్టమర్లను తనిఖీ చేసి లోపలకు పంపుతున్నారు. తమ బ్రాంచీల్లోని సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇచ్చేందుకు మాజీసైనికులతో ప్రత్యేక ప్యానల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు రామేశ్వరం కేఫ్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు తెలిపారు.

Updated Date - Mar 09 , 2024 | 04:41 PM