Share News

Spicejet Airlines: పాపం.. విమానంలో టాయిలెట్ కోసం వెళ్తే.. 100 నిమిషాల నరకం!

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:48 PM

ఈమధ్య కాలంలో విమానాల్లో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆకతాయిలు వేధింపులకు పాల్పడటం, మందుబాబులు హల్‌చల్ చేయడం, మరికొందరు అనవసరంగా గందరగోళ వాతావరణం సృష్టించడం వంటివి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది.

Spicejet Airlines: పాపం.. విమానంలో టాయిలెట్ కోసం వెళ్తే.. 100 నిమిషాల నరకం!

ఈమధ్య కాలంలో విమానాల్లో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆకతాయిలు వేధింపులకు పాల్పడటం, మందుబాబులు హల్‌చల్ చేయడం, మరికొందరు అనవసరంగా గందరగోళ వాతావరణం సృష్టించడం వంటివి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. టాయిలెట్ కోసం వెళ్లిన అతగాడు, లోపలే 100 నిమిషాల పాటు చిక్కుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళవారం స్పైస్‌జెట్ విమానంలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్పైస్‌జెట్‌కు చెందిన SG-268 విమానం ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే.. 14డీ సీట్‌లో కూర్చున్న ఒక ప్రయాణికుడు టాయిలెట్‌కు వెళ్లాడు. తన కార్యకలాపాలు ముగించుకున్న అనంతరం అతను టాయిలెట్ డోర్ ఓపెన్ చేయబోయాడు. అయితే.. అది ఎంతసేపటికీ ఓపెన్ అవ్వలేదు. అతడు లోపల నుంచి గట్టిగట్టిగా కేకలు వేయడంతో.. విమానం సిబ్బందితో పాటు ఇతర ప్యాసింజర్లు సైతం బయట నుంచి డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు. కానీ.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో.. అతడు టాయిలెట్ లోపలే దాదాపు 100 నిమిషాల పాటు ఉండాల్సి వచ్చింది.


తాను టాయిలెట్‌లోనే చిక్కుకుపోవడంతో ఆ ప్రయాణికుడు భయాందోళనలకు గురయ్యాడు. అప్పుడు విమాన సిబ్బంది ఒక పేపర్‌లో నోట్ రాసి లోపలికి పంపారు. ‘‘మేము వీలైనంత వరకూ ప్రయత్నించాం. కానీ, డోర్ మాత్రం ఓపెన్ అవ్వడం లేదు. మీరు ఆందోళన చెందకండి. మరికొన్ని నిమిషాల్లోనే మనం ల్యాండ్ అవ్వబోతున్నాం. ఆలోపు మీరు కమోడ్‌లోనే కూర్చొండి. మెయిన్ డోర్ ఓపెన్ అవ్వగానే, ఇంజినీర్ వచ్చి బాత్రూం డోర్ తెరుస్తారు’’ అని ఆ నోట్‌లో రాసినట్టు ఒక ఎయిర్‌హోస్టెస్ తెలిపారు. చివరికి.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకి విమానం చేరుకోగానే, ఇంజినీర్లు రంగంలోకి దిగి, ఆ డోర్ ఓపెన్ చేసి, ప్రయాణికుడ్ని బయటకు తీశారు.

ఈ ఘటనపై స్పెస్‌జెట్ సంస్థ స్పందిస్తూ.. ప్రయాణికుడ్ని సురక్షితంగా బయటకు తీసిన వెంటనే, వైద్య సహాయం అందించడం జరిగిందని పేర్కొంది. డోర్ లాక్‌లో లోపం కారణంగా అది ఓపెన్ అవ్వలేదని, దాంతో ప్రయాణికుడు లోపల చిక్కుకున్నాడని చెప్పింది. తమ సిబ్బంది ఆ ప్రయాణికుడికి తగిన సహాయం అందించారని చెప్పారు. ఈ ఘటన కారణంగా ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని, ఇందుకు క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. ఆ ప్యాసింజర్‌కి రీఫండ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పుకొచ్చింది.

Updated Date - Jan 17 , 2024 | 03:48 PM